రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిందో.. పెరిగిందో అప్పుడు తెలుస్తుంది
మీరు దుష్ప్రచారం చేసినా గణాంకాలు అబద్ధం చెప్పవు
టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ ఎక్స్ పో ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 21: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిందంటూ కొందరు కావాలనే తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారు ఒక్కసారి కళ్లు తెరిచి వాస్తవాలు తెలుసుకోవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచించారు. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ ఎక్స్‌పో 2025ను ఆయన శనివారం లాంఛనంగా ప్రారంభించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రియల్ ఎస్టేట్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ రంగంలో 15.4 శాతం వృద్ధి రేటు నమోదయిందన్నారు. నిర్మాణ రంగం 11.97 శాతం వృద్ధి చెందిందిదని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఈ రంగం రూ.80వేల కోట్లు సమకూర్చిందని తెలిపారు. తెలంగాణ సర్వీసెస్ ఎకానమీలో ఈ రంగం వాటా 24.9 శాతం అన్నారు. ప్రస్తుతం రెరా దగ్గర 9744 రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ రిజిస్టర్ అయ్యాయని, ఇవి గణాంకాలు కాదు.. మా హయాంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నెమ్మదించిందటూ తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి చెంప దెబ్బ అని వివరించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక్క హైదరాబాద్‌లోనే 5900 ఇళ్ల రిజిస్ట్రేషన్ జరిగిందని, మొత్తం రిజిస్ట్రేషన్లలో రూ.కోటి, అంతకంటే ఎక్కువ ధర గల ఇళ్ల వాటా 18 శాతంగా ఉందని, ఈ తరహా ఇళ్ల కొనుగోలులో వార్షిక వృద్ధి రేటు 58 శాతంగా నమోదైందని నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడిరచిందని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తాం.. తొలి దశలో 4.16 లక్షలు ఇచ్చాం.. ప్రతి ఒక్కరూ తలెత్తుకొని గౌరవప్రదంగా జీవించాలనే సంకల్పంతోనే ఈ పథకానికి శ్రీకారం చుట్టాం అని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న నిర్మాణ రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా ఈ రంగానికి అవసరమైన అత్యుత్తమ నైపుణ్య మానవ వనరులను తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని శ్రీధర్‌బాబు వివరించారు. ఈ వేదిక ద్వారా బిల్డర్లు, కొనుగోలుదారులకు ఒక్కటి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను.. ప్రభుత్వం మీ వెంట ఉంది.. నిర్మాణరంగ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉంది.. ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు.. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి అని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, గండ్ర సత్యనారాయణ రావు, క్రెడాయ్ ప్రెసిడెంట్ జైదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.