పశ్చిమాసియాలో సడలని ఉద్రిక్తతలు

– ఇరాన్‌పై దాడులకు అమెరికా సన్నద్దమైనట్లు వార్తలు
– తమ గగనతలాన్ని మూసేస్తూ ఇరాన్ ఆదేశాలు

టెహ్రాన్, మే 23: పశ్చిమాసియాలో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఓవైపు చర్చలు కొనసాగుతుండగానే ఇరాన్‌పై మరోసారి దాడికి దిగేందుకు అమెరికా సన్నద్ధమవుతున్నదంటూ వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది. దేశంలోని పశ్చిమ ప్రాంతం వైపున్న గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ఇరాన్ పౌర విమానయాన సంస్థ విమానయాన సిబ్బందికి నోటమ్ జారీ చేసింది. ఈనెల 25 వరకు అన్ని విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ నోటమ్ జారీ సమయంలో ఖతార్ ప్రభుత్వానికి చెందిన ఓ వీఐపీ విమానం ఇరాన్ గగనతలాన్ని దాటింది. ఆ విమానం శాంతి ఒప్పందానికి సంబంధించిన చర్చల కోసం టెహ్రాన్‌కు వచ్చిన ఖతార్ ప్రతినిధి బృందానికి చెందినదిగా తెలుస్తోంది. ఇక అమెరికా- ఇరాన్ మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయని, ఒప్పందానికి సంబంధించిన చాలా అంశాల్లో ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిరినట్లు తెలుస్తోంది. దీంతో ఏ క్షణమైనా ఒప్పంద ప్రకటన వెలువడే అవకాశముంది. అదే సమయంలో ఈ దౌత్య ప్రయత్నాలు చివరి నిమిషంలో విఫలమైతే టెహ్రాన్‌పై మళ్లీ దాడులు చేసే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఇరాన్ కూడా తన గగనతలాన్ని మూసివేయడంతో పశ్చిమాసియాలో ఏ క్షణాన ఏం జరుగుతుందోననే భయాందోళనలు నెలకొన్నాయి. ఈ పరిణామంతో గల్ఫ్‌లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. యూఎస్ మరోసారి యుద్దాన్ని ప్రారంభించిన పక్షంలో దీటుగా ఎదుర్కొనేందుకు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్సు, ఇతర సాయుధ దళాలు సిద్ధమవుతున్నట్టు ఇరాన్ వార్తా సంస్థ తస్నిమ్ ఒక కథనాన్ని ప్రచురించింది. అమెరికా ఆస్తులకు నష్టం కలిగేలా, ప్రయోజనాలు దెబ్బతినేలా దాడులకు ప్రణాళికలను ఇరాన్ మిలిటరీ సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ వారాంతాన్ని న్యూజెర్సీలో గడపాల్సిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరి నిమిషంలో అకస్మాత్తుగా రద్దు చేసుకుని రాజధాని వాషింగ్టన్‌కు తిరిగొచ్చారు. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ ఘర్షణలు మొదలవుతాయన్న వార్తలు మీడియాలో వెలువడ్డాయి. ఈ వారాంతంలో మెమోరియల్ డే వేడుకల్లో పాల్గొనాల్సిన అమెరికా నిఘా సంస్థల సీనియర్ అధికారులు కూడా తమ ప్రణాళికలను రద్దు చేసుకుని వాషింగ్టన్‌కు తిరిగొచ్చేశారు. రాబోయే 24 గంటల్లో దౌత్యపరమైన పురోగతి లేని పక్షంలో దాడులు మొదలుపెట్టేందుకు ట్రంప్ కూడా సుముఖంగానే ఉన్నట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పరిస్థితులు అంతకంతకూ ఉద్రిక్తంగా మారుతున్నా తెరవెనుక దౌత్యమార్గాల్లో ప్రయత్నాలు ముమ్మర స్థాయిలో జరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది. చర్చల్లో కొంత పురోగతి కనిపించిందని విశ్వసనీయ వర్గాలు చెప్పినట్టు తస్నిమ్ వార్తా సంస్థ పేర్కొంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *