– యువ ఐపీఎస్ అధికారులను అభినందించిన డిజిపి
– కోర్టు కేసులు, న్యాయ ప్రక్రియలపై మరింత దృష్టి
– నిరంతర శిక్షణతో వృత్తి నైపుణ్యాల మెరుగుదల
– క్లస్టర్-1లో హైదరాబాద్.. క్లస్టర్-2లో రామగుండం టాప్
– క్లస్టర్-3లో నల్గొండ.. క్లస్టర్-4లో సూర్యాపేట ప్రథమం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 29: నేరాల స్వరూపం వేగంగా మారుతున్న నేపథ్యంలో కృత్రిమ మేధ (ఏఐ), ఆధునిక సాంకేతికతను పోలీసింగ్‌లో విస్తృతంగా వినియోగించాలని డిజిపి సి. వి. ఆనంద్ సూచించారు. తెలంగాణ పోలీసింగ్ దేశంలోనే ముందంజలో ఉండాలంటే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్‌ఎస్), ఇంటర్‌ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్)లను నిరంతరం అప్‌డేట్ చేస్తూ సమర్థంగా అమలు చేయాలని తెలిపారు. శనివారం బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో అన్ని విభాగాల పోలీసు అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసు శాఖలో అందుబాటులో ఉన్న సాంకేతికత ఆధారిత అప్లికేషన్లను మరింత విస్తృతంగా వినియోగించాలని డిజిపి సూచించారు. డిజిటల్ పోలీసింగ్ వ్యవస్థలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన సమాచారాన్ని అప్‌డేట్ చేయాలన్నారు. కొత్త నేర చట్టాల (ఎన్‌సీఎల్) అమలు, ఈ-సాక్ష్య, ఈ-ఫోరెన్సిక్, ఐసీజేఎస్ అనుసంధానం, జాతీయ స్థాయి పోర్టళ్లలో తెలంగాణ పనితీరుపై సమీక్షించారు. మెరుగుపరచాల్సిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. కోర్టు కేసుల నిర్వహణకు పోలీసులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని డిజిపి సూచించారు. న్యాయ ప్రక్రియలను కచ్చితంగా పాటిస్తూ కేసుల పురోగతిని సమర్థంగా పర్యవేక్షించా లన్నారు. దర్యాప్తు, కోర్టు విధానాలు, న్యాయపరమైన అంశాలపై పోలీసులకు నిరంతరం శిక్షణ ఇవ్వాలని చెప్పారు. జిల్లా శిక్షణా కేంద్రాలు, నగర శిక్షణా కేంద్రాలు, పోలీసు శిక్షణా కళాశాలలు, బెటాలియన్లు, పోలీసు అకాడమీలు నిర్వహించే శిక్షణా కార్యక్రమాలు మారుతున్న నేర పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని సూచించారు. నిరంతర శిక్షణతో సిబ్బంది నైపుణ్యాలు, విశ్లేషణ సామర్థ్యం పెరిగి విధుల నిర్వహణ మరింత సమర్థంగా సాగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో నేర నియంత్రణకు సంబంధించిన వివిధ ప్రమాణాల అమలులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు విభాగాలను ఆనంద్ అభినందించారు. క్లస్టర్-1లో హైదరాబాద్, క్లస్టర్-2లో రామగుండం, క్లస్టర్-3లో నల్గొండ, క్లస్టర్-4లో సూర్యాపేట ప్రథమ స్థానాల్లో నిలిచాయి. ఆయా విభాగాల అధికారులను డిజిపి సర్టిఫికెట్లతో సత్కరించారు. ఏఐ ఆధారిత అప్లికేషన్లను రూపొందించి పోలీసు శాఖలో అంతర్గత సామర్థ్యం, పర్యవేక్షణ ను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్న యువ ఐపీఎస్ అధికారులను డిజిపి అభినందించారు. ఆధునిక సాంకేతికతను పోలీసింగ్‌తో అనుసంధానిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా మరిన్ని వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని సూచించారు. 2013 బ్యాచ్, ఆపై బ్యాచ్‌లకు చెందిన ఐపీఎస్ అధికారులతో నిర్వహించిన నాయకత్వ లక్షణాలు అంశాలపై డిజిపి కీలక ఉపన్యాసం చేశారు. నాయకత్వంలో ముందుండి నడిపించడం, నిజాయితీ, బృంద స్ఫూర్తి వంటి అంశాల ప్రాధాన్యాన్ని వివరించారు. మారుతున్న నేర ధోరణులను ఎదుర్కొనేందుకు అన్ని పోలీసు విభాగాలు సమన్వయంతో పనిచేయాలని డిజిపి ఆదేశించారు. పోలీసింగ్‌లో సాంకేతికత వినియోగం, డేటా ఆధారిత నేర విశ్లేషణ, వృత్తిపరమైన శిక్షణ, సిబ్బంది హేతుబద్ధమైన వినియోగం కలగలిపితే పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా, ప్రజలకు స్పందించేలా తీర్చిదిద్దవచ్చని తెలిపారు. సమావేశంలో డీజీ (లా అండ్ ఆర్డర్) మహేశ్ భగవత్, జైళ్ల డీజీ సౌమ్య మిశ్రా, ఆర్‌బీవీఆర్‌ఆర్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్ట్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, మహిళా భద్రత విభాగం డీజీ చారు సిన్హా, ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్యతోపాటు పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





