రైతు భూ హక్కులకు పూర్తి రక్షణే లక్ష్యం

– ఏడాదిలో రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూమికి సమగ్ర సర్వే
– వివాదరహిత భూములన్నింటికీ పట్టాదారు పాస్‌పుస్త‌కాలు
– భూ భారతి ద్వారా తాతల కాలం నాటి భూ సమస్యలకు పరిష్కారం
– నూతన్‌కల్‌లో 1,061 మంది రైతులకు పట్టాదారు పాస్‌పుస్త‌కాల పంపిణీ
– రెవెన్యూ మంత్రి పొంగులేటి 

హైదరాబాద్/ సూర్యాపేట, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 29: రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని, రానున్న ఏడాది కాలంలో వివాదరహిత భూముల ప్రతి అంగుళాన్ని సమగ్రంగా సర్వే చేసి, అర్హులైన నిజమైన భూ ఆసాములకు పట్టాదారు పాస్‌పుస్త‌కాలు అందిస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ మండల కేంద్రంలో నూతన్‌కల్, మద్దిరాల మండలాల్లో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం చూపుతూ 15 గ్రామాలకు చెందిన 1,061 మంది రైతులకు 1,044 ఎకరాల భూమికి పట్టాదారు పాస్‌పుస్త‌కాల‌ను మంత్రి శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఆయ‌న‌ మాట్లాడుతూ ఏళ్లతరబడి భూములను సాగు చేసుకుంటున్నా పట్టాలు లేక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ ప్రభుత్వం  వచ్చిన వెంటనే భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని చెప్పారు. అన్ని జిల్లాల్లో తాతల కాలం నుంచి పరిష్కారం కాకుండా ఉన్న భూ సమస్యలను భూ భారతి ద్వారా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని  తెలిపారు. భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు ప్రతి అంగుళం భూమిని శాస్త్రీయంగా సర్వే చేసి వాస్తవంగా భూమిని అనుభవిస్తున్న అర్హులైన రైతుల హక్కులను రికార్డుల్లో నమోదు చేస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో తొలి విడతగా 70 గ్రామాలను ఎంపిక చేసి సర్వే ప్రక్రియ చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ, రెవెన్యూ, దేవాదాయ, అసైన్డ్ భూములు ఆక్రమణలకు గురవుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, వాటిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. రాబోయే సంవత్సర కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అంగుళం భూమిని సర్వే చేసి, వివాదరహిత భూములన్నింటికీ పట్టాదారు పాస్‌బుక్స్‌ అందిస్తాం. అర్హత ఉన్న ప్రతి భూ ఆసామికి న్యాయం చేస్తాం అని మంత్రి పునరుద్ఘాటించారు. భూమికి చట్టబద్ధమైన హక్కు ఉంటేనే రైతుకు సంపూర్ణ ధైర్యం, ఆర్థిక భద్రత లభిస్తుందని  అన్నారు. భూ హక్కుల రికార్డులు సక్రమంగా ఉంటే రైతులు బ్యాంకు రుణాలు, రైతు సంక్షేమ పథకాలు, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలను సులభంగా పొందగలుగుతారని తెలిపారు. గత ప్రభుత్వం తమపై రూ.8.21 లక్షల కోట్ల అప్పు భారం మోపినప్పటికీ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా ఆగకూడదన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. రైతులకు న్యాయం చేయడం, పేదలకు ఇళ్లు ఇవ్వడం, మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడం తమ ప్రభుత్వ ప్రాధాన్యతలని స్పష్టం చేశారు. గత రెండురేళ్ల‌ల్లో రాష్ట్రంలోని మహిళలకు రూ.63 వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందించామని  తెలిపారు. రానున్న రెండున్నరేళ్ల‌ల్లోనూ ఇదే స్థాయిలో రుణాలు అందిస్తామని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని తెలిపారు. హైదరాబాద్‌లో కోట్ల రూపాయల విలువైన భూముల్లో ఇందిరమ్మ టవర్స్‌ నిర్మించి పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి తొలి విడతగా 3,500 ఇళ్లు, రెండో విడతగా 2,000 ఇళ్లు మంజూరు చేశామని, మూడో, నాలుగో విడతల్లోనూ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.

రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాలుగా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు పట్టాదారు పాస్‌బుక్స్‌ జారీ చేయడమే సరైన పరిష్కారమని అన్నారు. భూమికి హక్కు ఉంటే రైతుకు ధైర్యం వస్తుందని, రైతు భరోసా, రైతుబీమా తదితర ప్రభుత్వ ప్రయోజనాలను రైతులు పొందగలుగుతారని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ప్రతి ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్న ఘనత రాష్ట్ర‌ ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.36 వేల కోట్లతో హ్యామ్‌ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని, తుంగతుర్తి నియోజకవర్గానికి ఇప్పటికే రూ.100 కోట్ల విలువైన రోడ్లు మంజూరు చేశామని, మరో రూ.200 కోట్ల ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. సూర్యాపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు డబుల్ రోడ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *