ఉద్యమకారుల గుర్తింపును వేగవంతం చేయండి

– సీఎం రేవంత్ రెడ్డితో కేకే కమిటీ సుదీర్ఘ సమావేశం
– డిజిటల్ పోర్టల్ రూపకల్పనకు అధికారులకు సీఎం ఆదేశాలు
– ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టీకరణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 29 : స్వరాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమ ప్రక్రియను ఎలాంటి ఆలస్యం లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. జీవో నెం. 679 ద్వారా ఏర్ప‌డిన‌ తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ డాక్టర్ కె.కేశవరావు (కేకే) నేతృత్వంలోని ప్రతినిధి బృందం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో శనివారం కలిసింది. ఈ కీలక సమావేశంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్, కమిటీ సభ్యులు మోతె శోభన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్.రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల అమరవీరుల స్మారక చిహ్నం (అమరదీపం) వేదికగా 13,000 మందికి పైగా ఉద్యమకారులు, వివిధ జేఏసీలు, ప్రజాసంఘాలు, కవులు, కళాకారులతో నిర్వహించిన విస్తృతస్థాయి సంప్రదింపుల వివరాలను, ఉద్యమకారుల వర్గీకరణ ముసాయిదా నివేదికను కమిటీ ముఖ్యమంత్రికి అందజేసింది.
వేగంగా పరిపాలనా సహకారం
కమిటీ నివేదికను పరిశీలించిన ముఖ్యమంత్రి ఉద్యమకారుల రుణాన్ని తీర్చుకోవడం ప్రజా ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఉద్యమకారుల దరఖాస్తుల స్వీకరణకు డిజిటల్ పోర్టల్‌ను తక్షణమే రూపొందించాలని అధికారుల‌ను ఆదేశించారు. జిల్లాల వారీగా సమన్వయం చేసుకుంటూ పరిపాలనాపరమైన పూర్తి సహకారాన్ని కమిటీకి అందించాలన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం జీవో 679 జారీ చేయడమే కాక ఉద్యమకారుల ప్రధాన డిమాండ్లైన 250 గజాల నివాస స్థలాలు, ఆసరా పెన్షన్, హెల్త్ కార్డ్స్, ఆర్టీసీ ఉచిత ప్రయాణం, ఉద్యోగులకు గౌరవ గుర్తింపు మొదలైన అంశాలపై సానుకూలంగా స్పందించినందుకు కమిటీ చైర్మన్ కేకే, కోదండరామ్స, భ్యులు ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో ఎంపీ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వి. శషాద్రి, కార్యదర్శులు ఎస్.శ్రీధర్, చంద్రశేఖర్ రెడ్డి, వి.పి.గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
———————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *