రైతుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యం

– సమగ్ర విత్తన చట్టానికి సిద్ధమవుతున్న ప్రభుత్వం
– కేంద్రం జాప్యం చేసినా కొత్త చట్టం తెస్తామన్న‌ మంత్రి తుమ్మల 

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 29 : రాష్ట్ర రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు సమగ్ర విత్తన చట్టాన్ని తీసుకురావడంలో ఇక ఎలాంటి జాప్యం ఉండకూడదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వచ్చే పంటకాలానికైనా రైతులకు మేలు జరిగేలా విత్తన చట్టాన్ని అమల్లోకి తెచ్చే తదుపరి చర్యలు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. సచివాలయంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో విత్తన చట్టం-2025పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్రంలో విత్తన ఉత్పత్తి, నాణ్యత, నియంత్రణ, విక్రయాలు, ధరల నియంత్రణతో పాటు విత్తన ఉత్పత్తి రైతుల హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో సమగ్ర విత్తన చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం గతంలోనే ప్రత్యేక విత్తన బిల్లు డ్రాఫ్ట్ కమిటీని ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు. ఈ కమిటీ రైతులు, విత్తన కంపెనీలు, సీడ్ ఆర్గనైజర్లు, డీలర్లు, పంపిణీదారులు, వ్యవసాయ అధికారులతో సంప్రదింపులు నిర్వహించి, విత్తన రంగానికి సంబంధించిన అంశాలను అధ్యయనం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కమిటీ సూచనల మేరకు విత్తన చట్టాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతున్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వం ‘విత్తన చట్టం-2025’ పేరుతో ముసాయిదా బిల్లును రూపొందించిందని పేర్కొన్నారు. కేంద్ర ముసాయిదా బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాలను తెలియజేస్తూ కొన్ని అంశాలను సమ్మతించడంతోపాటు మరికొన్ని అంశాలపై అభ్యంతరాలు, సూచనలు తెలియజేస్తూ కేంద్రానికి పంపించిందని తెలిపారు.

కేంద్రం నిర్ణయంతో సంబంధం లేకుండా ముందుకు

కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం తన అభిప్రాయాలను పంపి నెలలు గడిచినా ఆశించిన స్థాయిలో ముందడుగు పడలేదని మంత్రి తుమ్మల అన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చట్టాన్ని త్వరగా తీసుకురావాలని పలుమార్లు లేఖలు రాసినప్పటికీ కేంద్రం జాప్యం చేస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణ దేశంలోనే సీడ్ బౌల్‌ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన నేపథ్యంలో విత్తన రంగానికి సమగ్ర చట్టపరమైన వ్యవస్థ ఎంతో అవసరమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం విత్తన చట్టాన్ని తీసుకొచ్చినా, తీసుకురాకపోయినా రైతుల ప్రయోజనాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గదని మంత్రి స్పష్టం చేశారు. కేంద్రం అనుమతి లభించని పక్షంలో, రాష్ట్ర విత్తన బిల్లు డ్రాఫ్ట్ కమిటీ సూచనల మేరకు స్వయంగా విత్తన బిల్లును రూపొందించి శాసనసభలో ప్రవేశపెట్టి అమల్లోకి తీసుకొస్తామని తెలిపారు.

నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు – పరిహారానికి చట్టబద్ధత

  • రైతులకు చట్టపరమైన రక్షణ: రైతు–విత్తన కంపెనీ మధ్య నేరుగా పారదర్శక ఒప్పంద వ్యవస్థ ఉండేలా చూడాలని, మధ్యవర్తుల పాత్రను నియంత్రించాలని సూచించారు.

  • న్యాయమైన ధర & బీమా: విత్తన ఉత్పత్తి రైతులకు న్యాయమైన ధర లభించేలా చర్యలు తీసుకోవడంతో పాటు పంట బీమా కల్పించాలని ఆదేశించారు.

  • సత్వర నష్టపరిహారం: నకిలీ, నాసిరకం విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు సత్వరమే పరిహారం అందేలా చట్టబద్ధమైన వ్యవస్థను, సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగంను ఏర్పాటు చేయాలన్నారు.

  • కఠిన నియంత్రణ వ్యవస్థ: విత్తన ఉత్పత్తి ప్రాంతాలను క్రాప్ బుకింగ్, Seed Traceability వ్యవస్థతో అనుసంధానం చేయాలని, మండల స్థాయిలో సీడ్ బ్యాంకులు, కమ్యూనిటీ సీడ్ బ్యాంకులను ప్రోత్సహిస్తూ సంప్రదాయ విత్తన రకాలను పరిరక్షించాలని ఆదేశించారు.

 రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం, నకిలీ విత్తనాలను అరికట్టడం, పంట నష్టానికి పరిహారం కల్పించడం, విత్తన రంగంలో పారదర్శకత పెంపొందించడమే ఈ సమగ్ర విత్తన చట్టం ప్రధాన లక్ష్యాలని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *