– ఆదివాసీ, గిరిజన జీపీలకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలి
– అన్‌టైడ్ గ్రాంట్లను కొనసాగించాలి
– 16వ ఆర్థిక సంఘం వర్క్‌షాప్‌లో తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూలై 3 : పనితీరు ఆధారిత గ్రాంట్లు, సొంత రెవెన్యూ వంటి 16వ ఆర్థిక సంఘం ప్రతిపాదించిన నిబంధనల్లో ఆదివాసి, గిరిజన, షెడ్యూల్డ్ ప్రాంతాలు, వెనుకబడిన గ్రామ పంచాయతీలకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క కోరారు. గ్రామ పంచాయతీల పనితీరును కేవలం పన్నుల వసూళ్లతోనే అంచనా వేయకుండా ప్రజలకు అందిస్తున్న సేవలు, పారిశుధ్యం, పారదర్శకత, డిజిటల్ పాలన, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల సిఫారసులపై కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జాతీయ వర్క్‌షాప్‌లో ఆమె రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జీపీలకు పనితీరు ఆధారిత గ్రాంట్లను తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తోందని, అయితే ఆదాయ సామర్థ్యం తక్కువగా ఉన్న ఆదివాసీ, గిరిజన, మారుమూల ప్రాంతాల గ్రామ పంచాయతీలపై అదనపు పన్నుల భారం మోపే విధంగా నిబంధనలు ఉండకూడదని అన్నారు. అభివృద్ధిని ప్రజల ఆర్థిక స్థితితో ముడిపెట్టడం సమంజసం కాదన్నారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో అనేక గ్రామ పంచాయతీల జనాభా చాలా తక్కువగా ఉండటంతో వాటి సొంత ఆదాయ వనరులు కూడా పరిమితంగానే ఉంటాయని తెలిపారు. అలాంటి ప్రాంతాలకు ప్రత్యేక సడలింపులు ఇవ్వాలని, ఆదివాసీ, గిరిజన, షెడ్యూల్డ్ కులాల జనాభా అధికంగా ఉన్న గ్రామ పంచాయతీలు, మండలస్థాయి స్థానిక సంస్థలకు కూడా పనితీరు గ్రాంట్ల అర్హతలో వెసులుబాటు కల్పించాలని కోరారు. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల కారణంగా ఎన్నికలు జరగని 62 గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి నిధులు నిలిపివేయడం వల్ల అక్కడి ప్రజలకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల వల్ల ఎన్నికలు ఆలస్యమైన ప్రత్యేక పరిస్థితుల్లో నిధులు కొనసాగించేలా నిబంధనలు ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి గ్రామ అవసరం భిన్నంగా ఉంటుందని, అందువల్ల స్థానిక అవసరాలకు అనుగుణంగా గ్రామ సభలు నిర్ణయాలు తీసుకునేలా అన్‌టైడ్ బేసిక్ గ్రాంట్లను తగిన స్థాయిలో కొనసాగించాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. డిజిటల్ గవర్నెన్స్, ఈ-గ్రామ్ స్వరాజ్, పీఎఫఎంఎస్ వంటి వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తోందని, వాటి అమలుకు అవసరమైన శిక్షణ, సిబ్బంది, ఇంటర్నెట్ కనెక్టివిటీ, సాంకేతిక మౌలిక వసతులను మారుమూల గ్రామాల్లో కేంద్రం బలోపేతం చేయాలని కోరారు. షెడ్యూల్డ్ ప్రాంతాలు, వెనుకబడిన జిల్లాలు, భౌగోళికంగా క్లిష్టమైన ప్రాంతాల్లో ప్రజా సేవలను అందచేసేందుకు అధిక వ్యయం అవుతున్నందున నిధుల కేటాయింపులో అలాంటి ప్రాంతాలకు ప్రత్యేక వెయిటేజ్ ఇవ్వాలని కోరారు. బలమైన గ్రామ పంచాయతీలు, బలమైన రాష్ట్రాలు కలిసి బలమైన భారత నిర్మాణానికి పునాది వేస్తాయని మంత్రి సీతక్క అన్నారు. గ్రామీణ స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేయాలంటే రాష్ట్రాలకు తగిన ఆర్థిక సామర్థ్యం ఉండాలని, సహకార సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలను బలోపేతం చేస్తూనే పంచాయతీలను మరింత శక్తివంతం చేసే విధంగా 16వ ఆర్థిక సంఘం సిఫారసులు ఉండాలని మంత్రి సీతక్క సూచించారు. స్పెషల్ సీఎస్ దానకిషోర్‌తోపాటు ఇతర రాష్ట్రాల మంత్రులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




