– కేసీఆర్ చేసిన అప్పులు రూ.8,21,651 కోట్లు
– మేం చేసిన అప్పులు రూ.లక్షా 77 వేల కోట్లు
– మీరు చేసిన అప్పులకు రూ.2,08,681 కోట్లు చెల్లించాం
– నిజాలతో నిఖార్సుగా ప్రజల ముందుకొచ్చాం
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 3 : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్‌ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ చేస్తున్న విమర్శలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. ఎవరిస్థాయి ఏమిటనేది ఇప్పటికే ప్రజలు నిర్ణయించారు.. అయినా స్థాయి అనేది పుట్టుకను బట్టి రాదు.. ప్రజాజీవితంలో పోషించే పాత్రనుబట్టి వస్తుందని వారికి చురకలు అంటించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లతో కలిసి సచివాలయంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ పదేళ్లపాటు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, ఇప్పుడు అబద్ధపు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రచార అస్త్రాలుగా అబద్ధాలు
పదేళ్లలో జరిగిన అడ్డగోలు దోపిడీ, అప్పులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. ఆ అస్తవ్యస్త పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంలో తామున్నామని, అబద్ధాలను ప్రచారాస్త్రాలుగా మార్చుకుని గోబెల్స్ ప్రచారానికి పాల్పడటం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని అన్నారు. పాలనపై దృష్టి సారిస్తూ రాష్ట్ర ప్రతిష్ఠను దృష్టిలో ఉంచుకుని ఇప్పటివరకు వాస్తవాలను వెల్లడించడానికి సంయమనం పాటించామన్నారు. ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా నిరంతరం విషప్రచారం సాగిస్తుంటే చూస్తూ ఊరుకోవడం రాష్ట్రానికి మరింత నష్టదాయకమని ఆయన అన్నారు. హరీష్‌రావు, కేటీఆర్‌ల వైఖరిపై విస్మయం వ్యక్తం చేస్తూ ‘ఓవైపు ముఖ్యమంత్రికి, మంత్రులకు ఛాలెంజ్ విసురుతూనే మరోవైపు మళ్లీ కేసీఆరే అధికారంలోకి వస్తారని మీరే చెప్పుకుంటున్నారు.. అలాంటప్పుడు మధ్యలో మీ పాత్ర ఏమిటి? మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే అవగాహన లేదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక విధ్వంసం చేసిన మీరే ఇవాళ నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అప్పుల చిట్టా మా దగ్గర స్పష్టంగా ఉంది. ఎఫఆర్‌బీఎం పరిమితికి లోబడి చేసినవి, కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న ప్రభుత్వ గ్యారంటీ రుణాలు, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, డిస్కంల బాకీలు.. ఇలా అన్ని రకాల అప్పులు కలిపితే మొత్తం రూ.8,21,651 కోట్లు.. ఇది వాస్తవం కాదా అని భట్టి ప్రశ్నించారు. వీటికి వారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాము రాగానే అసెంబ్లీ సాక్షిగా అప్పులపై శ్వేతపత్రం విడుదల చేశామని గుర్తుచేశారు. కేసీఆర్ చేసిన అప్పులకు సంబంధించి కేవలం రెండున్నరేళ్లలోనే ప్రజాప్రభుత్వం రూ.2,08,681 కోట్లను అసలు, వడ్డీల రూపంలో బ్యాంకులకు చెల్లించిందని తెలిపారు. కేవలం రూ.3 లక్షల కోట్లే అప్పు చేశామని హరీష్‌రావు అబద్ధాలు చెబితే మరి రిజర్వ్ బ్యాంక్ ద్వారా ప్రభుత్వ ఖాతాల నుంచి చెల్లించిన ఆ భారీ మొత్తం దేనికో వారే సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. గతం లేదు, భవిష్యత్తు లేదు.. కనీసం నైతికత అయినా ఉండాలి కదా అని ఆయన వ్యాఖ్యానించారు. అబద్ధాల పునాదుల మీద రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఇబ్బందుల్లోకి నెట్టేసిన వారు, ఇప్పుడు ఆ అప్పులను దాచాలని చూడటం సాధ్యం కాదని, రికార్డులన్నీ ప్రజల ముందున్నాయని డిప్యూటీ సీఎం అన్నారు. బీఆరఎస్ ప్రభుత్వం కార్పొరేట్ బ్యాంకుల వద్ద 10% నుంచి 10.5% వరకు భారీ వడ్డీ రేట్లతో అప్పులు తెచ్చి రాష్ట్రంపై పెనుభారం వేసిందని, ప్రజాప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఆ అప్పులను డెబిట్ రీస్ట్రక్చరింగ్ ప్రక్రియలోకి తీసుకొచ్చిందని చెప్పారు. దీనివల్ల 2025-26 నుంచి 2031-32 మధ్య కాలంలో చెల్లించాల్సిన రూ. 34,058 కోట్ల రుణ భారాన్ని, రూ.11,915 కోట్లకు తగ్గించామని చెప్పారు. దీని ద్వారా రాష్ట్రానికి రూ.22,142 కోట్లు ఆదా జరిగిందన్నారు. ఒకవైపు నెలనెలా ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తూనే రైతు భరోసాతోపాటు ఇతర సంక్షేమ పథకాలను అమలు చేస్తూన్నామని చెప్పారు. ప్రజాప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించడం వల్లే ఇదంతా సాధ్యమవుతోందని స్పష్టం చేశారు. అడ్డగోలుగా అప్పులు తెచ్చిన వారు ఇలాంటి ఆర్థిక నిర్వహణపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిప్యూటీ సీఎం డిమాండ్ చేశారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల కోసం కార్పొరేషన్ల పేరుతో భారీగా అప్పులు తీసుకున్నారు.. అప్పట్లో ఆ అప్పులను రైతులే కడతారని, పన్నుల ద్వారా వసూలు చేస్తామని చెప్పారు.. కానీ ఇప్పుడు ఆ అప్పులను, వడ్డీలను చెల్లించేది ఎవరు.. రాష్ట్ర ప్రభుత్వం కాదా.. ప్రజల పన్నులతోనే కదా ఈ భారాన్ని మోస్తున్నాం.. వాటన్నింటినీ అప్పులుగా చూపకుండా గత పాలకులు రాష్ట్రాన్ని మోసం చేశారు అని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం చెల్లిస్తున్న ప్రతి రూపాయి వెనుక ప్రజల కష్టం ఉందని, దీనిని ప్రతి ఒక్కరూ సీరియస్‌గా ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం కాక సభకు వచ్చి వాస్తవాలపై చర్చించాలని ప్రతిపక్ష నాయకులను సవాల్ చేశారు.
సింగరేణిపై విషప్రచారం ఆపండి
సింగరేణి సంస్థపై ప్రతిపక్ష నేతలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని భట్టి విక్రమార్క తప్పుబట్టారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి ఆస్తులు, వనరులు రాష్ట్రానివి. పదేళ్ల మీ పాలనలో సింగరేణికి కొత్తగా ఒక్క కోల్ బ్లాక్‌నైనా తీసుకువచ్చారా? కనీసం ఉత్పత్తి అయిపోయి మూతపడిన మైనింగ్ బ్లాకులకు బదులుగా కొత్తవి తెచ్చారా అని సూటిగా ప్రశ్నించారు. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులను భారీగా విస్తరించిన కేసీఆర్ ప్రభుత్వం వాటికి అవసరమైన బొగ్గు గనులను మాత్రం ఎందుకు సమకూర్చలేదని నిలదీశారు. కేంద్రం వేలం వేసిన కోల్ బ్లాకుల్లో పాల్గొని సింగరేణికి ఆ గనులను ఎందుకు దక్కించుకోలేదు.. సింగరేణికి గనులు వస్తే రాయల్టీ రూపంలో వచ్చే ఆదాయం తెలంగాణకే చెందేది కదా.. అటు కొత్త గనులు తేరు, ఇటు వేలంలో పాల్గొనరు.. అంటే రాష్ట్రంలో బొగ్గు కొరత సృష్టించి విద్యుత్ ప్రాజెక్టులను సంక్షోభంలోకి నెట్టడమే మీ ఉద్దేశమా’ అని భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి కాలరీస్‌లో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందంటూ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. సింగరేణి అస్తిత్వం, కార్మికుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు చేస్తున్న దుష్ప్రచారమని మండిపడ్డారు. సింగరేణిలో ఎలాంటి అక్రమాలకు తావులేదని, సంస్థ భద్రత కోసం అత్యున్నతస్థాయి జియో-ఫెన్సింగ్ వ్యవస్థ ఉందని ఆయన స్పష్టం చేశారు. కోయగూడెం, సత్తుపల్లి-3 వంటి బొగ్గు బ్లాకులను సింగరేణికి దక్కకుండా చేసింది బీఆరఎస్ ప్రభుత్వమేనని మండిపడ్డారు. వాటిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడంలో కేసీఆర్ సర్కార్ పాత్ర ఉందన్నారు. దాదాపు 65 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్న సత్తుపల్లి-3 బ్లాకును ప్రైవేటు వారికి ఎందుకు ఇచ్చారు అని సూటిగా ప్రశ్నించారు. సింగరేణిని ఆర్థికంగా దెబ్బతీసి, థర్మల్ పవర్ ప్రాజెక్టులకు బొగ్గు కొరత సృష్టించి, ప్రైవేటు వ్యక్తుల నుంచి బొగ్గు కొనుగోలు చేయాలన్నదే బీఆరఎస్ ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచన అని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారంతో సంస్థ ప్రతిష్ఠను మంటగలుపుతున్నారని భట్టి విమర్శించారు. సింగరేణిలో వ్యవస్థలు చాలా పటిష్టంగా ఉన్నాయి.. ఒక్క కేజీ బొగ్గు కూడా అక్రమంగా బయటకు వెళ్లే అవకాశం లేదని అన్నారు. ప్రతిపక్షాలు పదేపదే బొగ్గు మాయమైందని చేస్తున్న ఆరోపణలను ప్రభుత్వం సవాలుగా తీసుకుందని, ‘సింగరేణి సంస్థ సొంత బిడ్డ వంటిది.. 40 వేల మంది కార్మికుల జీవితాలు దీనిపై ఆధారపడి ఉన్నాయి.. సంస్థపై అనవసరపు అభాండాలు వేయడం తెలంగాణకే నష్టం.. ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని సింగరేణి విజిలెన్స్ డైరెక్టర్‌ను ఆదేశించాను.. వారు సమగ్ర విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తారు. వాస్తవాలు ప్రజల ముందుంచే బాధ్యత మాది అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
విద్యార్థుల సౌకర్యాల పట్ల చిత్తశుద్ధి లేదు
సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల సౌకర్యాల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేని ప్రతిపక్ష నేతలు హరీష్‌రావు, కేటీఆర్‌లు రాజకీయ లబ్ధి కోసం దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత పదేళ్లలో ఇరిగేషన్, రోడ్ల నిర్మాణాల పేరుతో ఎసఎసఆర్ రేట్లు పెంచిన మీరు రెసిడెన్షియల్ పాఠశాలల్లో పిల్లలు తినే ఆహారానికి గానీ, వారి కాస్మెటిక్ చార్జీల” గానీ ఎందుకు పెంచలేదు అని ప్రశ్నించారు. డైట్ చార్జీలను ఆరు నుంచి తొమ్మిది నెలలపాటు పెండింగ్‌లో పెట్టి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసిన ఘనత గత ప్రభుత్వానిదేనని భట్టి దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం బాధ్యత చేపట్టిన తర్వాత హాస్టళ్ల నిర్వహణను పూర్తిగా ప్రక్షాళన చేశామని భట్టి వివరించారు. పిల్లల కాస్మెటిక్ చార్జీలను 200% పెంచామని, డైట్ చార్జీలను ప్రతి నెలా మొదటి వారంలోనే అందేలా స్ట్రీమ్ లైన్ చేశామని చెప్పారు. నాణ్యతతో కూడిన దుస్తులు, షూస్, పుస్తకాలను ఓపెన్ టెండర్ల ద్వారా పారదర్శకంగా అందిస్తున్నామన్నారు. టెండర్ విలువ రూ.1,142 కోట్లు ఉంటే గతంలో రూ.2,000 కోట్ల మేర దోపిడీ జరిగిందని, ఒకసారి రూ.3,000 కోట్లు అని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. ఇది ఎంతవరకు సమంజసం అని నిలదీశారు. ప్రజా సంక్షేమం కోసం పని చేస్తున్న మంత్రులపై అడ్డగోలు విమర్శలు చేయడం ప్రతిపక్షాలకు తగదని ఉప ముఖ్యమంత్రి హితవు పలికారు. పదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించి, దోపిడీకి కారణమైన కేసీఆర్ ఎందుకు బయటకు రారు.. ఈ అప్పులు, ఈ దోపిడీపై చర్చకు ఆయన ఎందుకు సిద్ధపడరు అని నిలదీశారు. ప్రతిపక్ష నాయకులుగా నిబద్ధత, బాధ్యత లేకుండా అబద్ధాలు ప్రచారం చేస్తే ప్రజలు క్షమించరుని హెచ్చరించారు. ప్రజల ఆస్తిని, కార్మికుల చెమటను కాపాడే బాధ్యత మాది.. నిరాధారమైన ఆరోపణలతో రాష్ట్రాన్ని, సమాజాన్ని ఇబ్బందులకు గురిచేసే కార్యక్రమాలు ఆపాలని సూచించారు. శాసనసభకు హాజరుకాని ప్రతిపక్ష నేతపై భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష నేతగా నా అటెండెన్స్ రికార్డులను ఎవరైనా చూసుకోవచ్చు. నేను ఒక్క రోజు కూడా అసెంబ్లీని మిస్ కాలేదు. కానీ, ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ సభకు రాకపోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




