బీఆర్ఎస్ చేసిన అప్పుల‌పై దుష్ప్ర‌చారం త‌గ‌దు

– కాంగ్రెస్ చేసిన అప్పుల‌పై బ‌హిరంగ‌ లేఖ‌
– ఆధారాల‌ను మంత్రికి వాట్సాప్ ద్వారా పంపిన హ‌రీష్‌రావు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 3: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల గురించి మీ ముఖ్యమంత్రి, మీ సహచర మంత్రివర్గ సభ్యులు పదేపదే దుష్ప్రచారం చేస్తున్నారు. మీ ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆధారాలతో సహా ఎన్నిసార్లు వివరించినా మీ తీరు మారక పోవడం శోచనీయం. తొమ్మిదిన్నరేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న రుణాలు, గ్యారెంటీ ఇచ్చి ప్రభుత్వం చెల్లించే రుణాలు మొత్తం కలిపితే రూ.4.17 లక్షల కోట్లు మాత్రమేనని నేను అసెంబ్లీలో తెలిపాను. నేను చెప్పిన ఆ లెక్కలకు కట్టుబడి ఉంటానని, ఎక్కడైనా చర్చకు సిద్దమని అసెంబ్లీలోనే స్పష్టంగా ప్రకటించాను. ఈరోజు మీరు రాసిన లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 2023 నుంచి జూన్ 2026 వరకు చేసిన అప్పు రూ.1,77,058 కోట్లు అని పేర్కొన్నారు. కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లెక్కల ప్రకారం జూన్ 30, 2026 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు రూ.1,86,067 కోట్లు. అలాగే, 2026 మార్చి 18న అసెంబ్లీలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతూ, మీ ప్రభుత్వం చేసిన ఎఫ్ ఆర్‌బీఎం, అన్ని రకాల అప్పు కలిపి రూ.3,47,294 కోట్లు అని స్వయంగా ప్రకటించారు. మీలాగా మేము మాట మార్చడం లేదు, పూటకో తీరుగా అంకెలు మార్చి చెప్పడం లేదు. మేము చెప్పిన లెక్కలకు కట్టుబడి ఉన్నాం. నేటికి మా లెక్కల ప్రకారం, సుమారు 4.5 లక్షల కోట్ల అప్పు వివిధ మార్గాల ద్వారా మీ ప్రభుత్వం తీసుకున్న విషయం బహిరంగ రహస్యమే. జూపల్లి గారు.. బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో నేను అసెంబ్లీలో చేసిన ప్రసంగం వీడియో, మీ ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చేసిన ప్రకటన వీడియో, అలాగే మీ అప్పులకు సంబంధించిన ఆర్బీఐ అధికారిక లెక్కలను మీ వాట్సాప్‌కు పంపిస్తున్నాను. వాటిని ఒకసారి పరిశీలించి, వాస్తవాలు తెలుసుకోవాలని కోరుతున్నాను. ఇకనైనా అప్పుల విషయంలో తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు ప‌లికారు.

జూప‌ల్లి రాజీనామా చేయాలి

సంగారెడ్డి :  జూపల్లి కృష్ణారావు మళ్లీ ప్రెస్ మీట్ పెట్టిండు. నిన్న వాళ్లు గోల్ కొడదాం అనుకుంటే సెల్ఫ్ గోల్ అయిపోయింది.. అందుకే డ్యామేజ్ కంట్రోల్ మొదలు పెట్టిర్రు.. అందులో కూడా పప్పులో కాలు వేసిర్రు.. మొన్న సవాల్ విసిరి నిన్న తోక ముడిచి నాకు వాట్సాప్ లో ఒక ఉత్తరం పెట్టిండు.. పూటకో సవాలు.. రోజుకో అడ్రస్ లెక్క ఉంది జూపల్లి సంగతి. మొదలేమో తెలంగాణ భవన్ అన్నడు.. తర్వాత అమరవీరుల స్థూపం అన్నడు.. ఇప్పుడేమో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అంటుండు. ముందు నన్ను, కేటీఆర్‌ను చర్చకు రమ్మన్నాడు.. ఇప్పుడు కేసీఆర్‌ను రావాలంటున్నారని మాజీ మంత్రి హ‌రీష్‌రావు విమ‌ర్శించారు. సంగారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం, సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమంలో ఆయ‌న‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2023 డిసెంబర్ నుండి 2026 జూన్ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం కింద తెచ్చిన అప్పు రూ.1,86,087 కోట్లు అయితే ఆయన నాకు రాసిన ఉత్తరంలో రూ.1,77,058 కోట్లు అని చెప్తుండు. మరి ఆ 10 వేల కోట్లు ఎక్కడికి పోయినయి.. మార్చి 18, 2026 నాడు అసెంబ్లీలో నేను గట్టిగా నిలదీస్తే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మా ప్రభుత్వం 27 నెలల్లో చేసిన అప్పు రూ.3,47,294 కోట్లు అని అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. ఇందులో ఏది నిజం.. అంటే ఇప్పుడు రాజీనామా ఎవరు చేయాలి.. పాలమూరు బిడ్డవైతే పౌరుషం ఉంటే, చీము నెత్తురు ఉంటే వెంటనే రాజీనామా చెయ్యి మిస్టర్ జూపల్లి. నువ్వు కాదు, మీ ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి, మొత్తం మీ క్యాబినెట్ ను కూసోబెట్టి నిండు అసెంబ్లీలో బీఆర్ఎస్ చేసిన అప్పు రూ.4 లక్షల కోట్లే అని నిరూపించిన, మీ అబద్ధాలను కడిగి పారేసిన. ఇప్పుడేదో వచ్చి చర్చిద్దాం అంటున్నవ్అ.. ప్పుడు నేను సవాల్ చేస్తే అసెంబ్లీలోనే సప్పుడు చేయలేదు. సీనియర్ మంత్రి అంటూనే మీ క్యాబినెట్ ఎంత అప్పు చేసిందో తెల్వదా? కాగ్ రిపోర్టు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.4.15 లక్షల కోట్లు అని అసెంబ్లీలో చెప్పింది. నేనూ చెప్పింది, కాగ్ చెప్పింది ఒక్కటే. అబద్దాలు చెబుతూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. నేను అసెంబ్లీలో మాట్లాడిన వీడియో, రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో, ఆర్బీఐ లెక్కలు మీకు వాట్సప్ లో పంపుతున్నా చదువుకో.. చీము నెత్తురు ఉంటే రాజీనామా చేయాలని సవాల్ విసురుతున్నా. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్  ఆశీర్వాదంతో మన సంగారెడ్డి జిల్లా, సదాశివపేట నియోజకవర్గానికి ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా నిధులు తీసుకొచ్చాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ హయాంలో మంజూరైన ఎస్డీఎఫ్ నిధులను కూడా వెనక్కి తీసుకునే పరిస్థితి వచ్చింది. అదే విధంగా సంగమేశ్వర–బసవేశ్వర ప్రాజెక్టు ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును అటకెక్కించి సంగారెడ్డి జిల్లాకు తీవ్ర అన్యాయం చేస్తోంది. రేపు ఏడు మండలాల ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. సంగమేశ్వర ప్రాజెక్టు గురించి, బసవేశ్వర ప్రాజెక్టు గురించి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కరోజైనా మాట్లాడారా? జిల్లాకు చెందిన మంత్రి ఈ అంశంపై ఎందుకు మాట్లాడటం లేదు? మీ నియోజకవర్గాల్లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు ఇస్తే, మా సంగారెడ్డి జిల్లాకు, మా రైతులకు ఉపయోగపడే సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదు. తక్షణమే ఈ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలి. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు, పాదయాత్రలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఇబ్బందులు పడుతున్నారని సమాచారం వచ్చిన వెంటనే కేసీఆర్ తో మాట్లాడి రెండు రోజుల్లోనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేవాళ్లం. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ రోడ్డెక్కితే తప్ప ప్రభుత్వం స్పందించడం లేదు. ఇప్పటికే రైతులకు రావాల్సిన సుమారు రెండు కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాకు రావాల్సిన ఆ నిధులు ఇప్పటికీ ఎందుకు విడుదల చేయలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతు చేస్తాం అని చెప్పి ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. సింగూరు ప్రాజెక్టు సంగారెడ్డి జిల్లాకే కాదు, హైదరాబాద్‌కు తాగునీరు అందించే కీలకమైన ప్రాజెక్టు. ఇప్పటికైనా తక్షణమే మరమ్మతులు చేపట్టాలి. ఎన్నికల మేనిఫెస్టోలో ఎస్సీ, ఎస్టీ, బీసీల అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు ఉన్న భూములనే లాక్కుంటోంది. ఒక్క సంగారెడ్డిలోనే 700 ఎకరాలు, రాష్ట్రవ్యాప్తంగా 50 వేల ఎకరాల అసైన్డ్ భూములను లాక్కునే కుట్ర జరుగుతోంది. ఎకరం రూ.3 కోట్లు ఉంటే రూ.40 లక్షలు ఇస్తామని గిరిజనులను మోసం చేస్తున్నారు. ఏ ఒక్క హామీని రేవంత్ ప్రభుత్వం నెరవేర్చలేదు. మూసీ సుందరీకరణ పేరుతో హడావుడి చేస్తున్న ప్రభుత్వం మల్లన్నసాగర్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఆ మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు తాగునీరు, మూసీకి నీళ్లు వెళ్తున్నాయంటే అది కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషే. మల్లన్నసాగర్ రేవంత్ రెడ్డి అయ్య కట్టాడా? ఈరోజు హైదరాబాద్‌కు అది పెద్ద దిక్కుగా మారిందంటే అది కేసీఆర్ చలవేన‌న్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎమ్మెల్యేలు మాణిక్ రావు, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, శశిధర్ రెడ్డి, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

————————————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *