– మహిళా రిజర్వేషన్ల బిల్లును మళ్లీ పెట్టాలి
– బీజేపీవి రాజ్యాంగ వ్యతిరేక చర్యలు : అద్దంకి దయాకర్
– తేజస్వి విమర్శలు రాజ్యాంగ విరుద్ధం : ప్రొఫెసర్ కోదండరాం
– దక్షిణాదికి అన్యాయం చేసేలా డీలిమిటేషన్ బిల్లు : పల్లా వెంకట్ రెడ్డి
– మహిళా బిల్లుపై బీజేపీకి చిత్తశుద్ది లేదు : జాన్ వెస్లీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18 : పార్లమెంట్‌లో డీలిమిటేషన్ బిల్లు ఓడిపోవడం దక్షిణాది రాష్ట్రాల ప్రజల విజయం అని పలువురు వక్తలు అన్నారు. మహిళా బిల్లును ప్రత్యేకంగా పార్లమెంటులో ప్రవేశపెట్టి 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై అనుచిత వాఖ్యాలు చేసిన ఎంపీ తేజస్వీ సూర్య బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీల ఇళ్లను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ సమాఖ్య కన్వీనర్ కరుణాకర్ దేశాయ్ అధ్యక్షతన సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి పర్యవేక్షణలో పార్లమెంటులో డీలిమిటేషన్, మహిళా బిల్లు వీగిపోవడంపై శనివారం సదస్సు నిర్వహించారు. సదస్సులో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ పేరుతో రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. డీలిమిటేషన్‌లో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఉండాలని డిమాండ్ చేశారు. దీని వల్ల దక్షిణాది రాష్ట్రాలు నష్టపోవడం రాజ్యాంగ వ్యతిరేక చర్య అని ఆరోపించారు. దక్షిణాదిలో సీట్లు పెరిగితే బీజేపీ ఉలిక్కిపడుతోందని ఆయన ధ్వజమెత్తారు. మహిళా బిల్లు వీగిపోవడానికి ప్రధాన కారకుడు ప్రధాని మోదీ అని విమర్శించారు. మహిళా బిల్లును తిరిగి ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ అంటే బానిసల జనతా పార్టీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. తెలంగాణను పాకిస్థాన్‌తో పోల్చడం అత్యంత దుర్మార్గమని, దక్షిణ భారత హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని చెప్పారు.
తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడాన్ని స్వాగతిస్తున్నామని, ఇది ప్రజల విజయం అని అన్నారు. రాజకీయ అధికారాన్ని అడ్డుపెట్టుకుని మోదీ ప్రభుత్వం రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలను నాశనం చేస్తున్నదని మండిపడ్డారు. డీలిమిటేషన్‌తో మహిళా బిల్లు కలిపి పార్లమెంటులో ప్రవేశపెట్టడం సరైంది కాదని, మహిళా బిల్లును ప్రత్యేకంగా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణపై చేసిన విమర్శలు రాజ్యాంగ విరుద్దమన్నారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలు ఏర్పాటవుతాయన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అవమానపరిచిన తేజస్వీ సూర్య బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడం ఇండి కూటమి ప్రజాస్వామిక ఘన విజయం అని అన్నారు. మోదీ ప్రభుత్వం రాజకీయ కుట్ర, కుతంత్రంతోనే మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టిందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే విధంగా బీజేపీ కుట్రలు, కుతంత్రాలతో డీలిమిటేషన్ బిల్లును తీసుకొచ్చిందని ఆరోపించారు. శాస్త్రీయ పద్దతిలో అందరికీ ఆమోదయోగ్యమైన తీర్పుతో డీ లిమిటేషన్ జరగాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై విద్వేషపూరితంగా ఎంపీ తేజస్వీసూర్య మాట్లాడుతుంటే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు చెవులు మూసుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం హర్షణీయమన్నారు. బీజేపీ ఎన్డీయే కూటమికి సరైన బుద్ది చెప్పారని అన్నారు. మహిళా బిల్లుపై మోదీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం గద్దె దిగుడు ఖాయమని ఆయన స్పష్టం చేశారు. సదస్సులో పలు సంఘాల నేతలు కె.గోవర్ధన్, అరుణోదయ విమలక్క, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, పశ్య పద్మ, ఈటీ నర్సింహ, విఎస్ బోస్, స్టాలిన్, రాజలింగం, నుగ్నా సర్వత్, ప్రఫూల్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు డీలిమిటేషన్ బిల్లు విగిపోయిన సందర్భాన్ని పురస్కరించుకుని అఖిల పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు ట్యాంక్ బండ్ వద్దగల అంబేడ్కర్ విగ్రహం నుంచి జగ్జీవన్ విగ్రహం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





