మహిళలకు తమిళ సీఎం విజయ్‌ ‌వరాలు

– ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల ప్రకటన
– ట్రాన్స్ ‌జెండర్లకు కూడా ఉచిత బస్సు సౌకర్యం

చెన్నై, ఆగస్ట్ 24 : ‌తమిళనాడు అసెంబ్లీ వేదికగా మహిళలపై ముఖ్యమంత్రి జోసెఫ్‌ ‌విజయ్‌ ‌వరాల జల్లు కురిపించారు. ఎన్నికల హామీ మేరకు పలు సంక్షేమ పథకాలను ప్రారంభించనున్నట్లు సోమవారం తెలిపారు. బడ్జెట్‌ ‌సమావేశాల సందర్భంగా అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత ఎల్‌పీజీ సిలిండర్లు అందించనున్నట్లు సీఎం ప్రకటించారు. అన్నపూర్ణి సూపర్‌ ‌సిక్స్ పథకం కింద దీనిని అమలు చేయనున్నట్లు, లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు నేరుగా జమ అయ్యేలా పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఉచిత ఎల్‌పీజీ సిలిండర్ల పథకాన్ని వచ్చే ఏడాది పొంగల్‌ ‌పండుగ నుంచి అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ పథకం కింద సుమారు రూ.1.30 కోట్ల కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. అలాగే రాష్ట్ర ఖజానాపై ఏడాదికి సుమారు రూ.4,000 కోట్ల భారం ప‌డ‌నుంది. మహిళలు, ట్రాన్స్‌జెండర్ల కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని మరింత విస్తరిస్తూ ’వెట్రి పయన తిట్టం’ పథకాన్నీ సీఎం విజయ్‌ ‌ప్రకటించారు. దీని ద్వారా ట్రాన్స్‌జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించడంతోపాటు మహిళల కోసం దీని పరిధిని విస్తరించారు. ఇకపై ఎక్స్‌ప్రెస్‌, ‌లిమిటెడ్‌ ‌స్టాప్‌ ‌సర్వీస్‌, ‌డీలక్స్ ‌సర్వీసుల బస్సుల్లోనూ మహిళలు, ట్రాన్స్‌జెండర్లు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించనున్నారు. ఉచిత ప్రయాణం పొందేందుకు ఆదాయ పరిమితి, ప్రయాణాల సంఖ్యపై ఎలాంటి నిబంధనలు ఉండవని సీఎం స్పష్టం చేశారు. గాంధీ జయంతి రోజైన అక్టోబర్‌ 2 ‌నుంచి ఈ పథకం అమల్లోకి రానుందని తెలిపారు. అలాగే, అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి మరో సంచలన నిర్ణయం ప్రకటించారు. చెన్నై శివార్లలోని పరందూర్‌లో రెండో విమానాశ్రయం నిర్మించాలన్న ప్రతిపాదనను తమ ప్రభుత్వం విరమించుకుంటున్నట్లు తెలిపారు. విమానాశ్రయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న వారికి తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ’పరందూర్‌ ‌విమానాశ్రయ ప్రాజెక్టును విరమించుకుంటున్నాం.. ప్రతిపాదిత విమానాశ్రయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న నిరసనకారులకు అండగా ఉంటా’ అని విజయ్‌ ‌పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *