– ఇస్రో భవిష్యత్‌పై జైరామ్ రమేశ్ ఆందోళన
న్యూదిల్లీ, ఆగస్ట్ 24 : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో భవితవ్యంపై రాజకీయ దుమారం మొదలైంది. ఇస్రోను మోదీ సర్కారు బలహీనపరుస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జైరామ్ రమేష్ ఆరోపించారు. ఆరు దశాబ్దాలుగా ఇస్రో నిర్మించుకున్న సామర్థ్యాలను ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన విమర్శించారు. ఇస్రో భవిష్యత్ పాత్రకు సంబంధించి ఇటీవల వెలువడిన వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని జైరామ్ రమేష్ పేర్కొన్నారు. రాకెట్ల తయారీ, ప్రయోగ వాహనాల ఉత్పత్తిలో ఇస్రో పాత్రను గణనీయంగా తగ్గించి, ప్రైవేట్ సంస్థలకు ఎక్కువ బాధ్యతలు అప్పగించే దిశగా ప్రభుత్వం వెళ్తోందని ఆయన ఆరోపించారు. శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల కృషితో ఇస్రో ఆరు దశాబ్దాలుగా అభివృద్ధి చేసుకున్న సామర్థ్యాలను, మౌలిక వసతులను ప్రైవేట్ రంగానికి అప్పగించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రైవేట్ అంతరిక్ష సంస్థల ప్రతినిధులతో సమావేశమమయ్యారు. ప్రపంచ స్థాయి ప్రతిభను భారత్‌కు ఆకర్షించేలా బలమైన అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని పిలుపునిచ్చారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇస్రో క్రమంగా ప్రయోగ వాహనాల తయారీ, సాధారణ ఉపగ్రహాల తయారీ నుంచి దూరమవుతున్నట్టు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




