– ఈనెల 30నుండి రైతు భరోసా చెల్లింపులు
– ఏడు సన్న రకాల వరి వంగడాలకు బోనస్ కొనసాగింపు
– ఎరువుల కేటాయింపులు, పంటల కొనుగోళ్లపై కేంద్రంపై ఒత్తిడి
– మెట్రో విస్తరణకు అనుమతులు కోరనున్న ప్రభుత్వం
– మంత్రివర్గం నిర్ణయాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా (పెట్టుబడి సాయాన్ని) ఈనెల 30న ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించే భారీ రైతు సమ్మేళనంతో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మధిరలో బహిరంగ సభ వేదిక నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నిధులను నేరుగా జమ చేయనున్నట్లు వెల్లడించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వహించిన అనధికారిక మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయం, రైతు సంక్షేమం, ఎరువుల లభ్యత, పంటల కొనుగోలు, హైదరాబాద్ మెట్రో విస్తరణ, పరిపాలనా సంస్కరణలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దనసరి అనసూయ సీతక్కలతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం రైతులకు అందిస్తున్న బోనస్‌ను ఏడు సన్న రకాల వరి వంగడాలకు కొనసాగించాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు ఉత్తమ్ తెలిపారు. మార్కెట్ డిమాండ్, వినియోగదారుల అభిరుచులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. బోనస్ బీపీటీ-5204, ఆర్‌ఎన్ఆర్-15048, హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎనఎం-1638, డబ్ల్యూజీఎల్-44, కేఎన్ఎం-7715 వరి వంగడాలకు మాత్రమే వర్తిస్తుందని వివరించారు. ఈ వంగడాలు సన్న బియ్యం పంటలో 83 శాతం వాటాను కలిగి ఉండటమేకాక ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థ వెలుపల కూడా మంచి మార్కెట్ డిమాండ్ కలిగి ఉన్నాయని తెలిపారు. రాష్ట్రానికి ఎరువుల కేటాయింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. నెలకు సుమారు రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయిస్తామని కేంద్రం హామీ ఇచ్చినా కొన్ని నెలలుగా ఆ మేరకు సరఫరా జరగలేదని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మాట్లాడుతూ రాష్ట్రానికి ఇప్పటివరకు మరింత అధిక స్థాయిలో ఎరువులు అందాల్సి ఉందన్నారు. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్(ఆర్ఎఫ్‌సీఎల్)లో ఉత్పత్తి అవుతున్న యూరియాలో అధిక భాగాన్ని రాష్ట్ర రైతులకు కేటాయించాలని ప్రభుత్వం డిమాండ్ చేసింది. స్థానికంగా ఉత్పత్తి అవుతున్న ఎరువులను రాష్ట్ర రైతులకు అందించడం ద్వారా రవాణా వ్యయాలు తగ్గడంతోపాటు సీజన్‌లో ఎరువుల కొరతను నివారించవచ్చని మంత్రులు అభిప్రాయపడ్డారు.
ఇపుడే విత్తేందుకు తొందరొద్దు
సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటం, మధ్యమధ్యలో పొడి వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు తొలి వర్షాలు పడగానే విత్తనాలు వేయడానికి తొందరపడవద్దని ప్రభుత్వం సూచించింది. వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించి, నేలలో తగినంత తేమ ఏర్పడిన తర్వాత మాత్రమే విత్తనాలు వేయాలని కోరింది. సాధారణంగా మొలకెత్తడానికి, పంట ప్రారంభ వృద్ధికి కనీసం 7 మి.మీ చొప్పున రెండు దఫాల వర్షపాతం అవసరమవుతుందని పేర్కొంది. వర్షాలు పడగానే తొందరపడి విత్తనాలు వేస్తే, అనంతరం పొడి వాతావరణం ఏర్పడిన పక్షంలో పంట నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
మెట్రో అనుమతులు త్వరగా మంజూరు చేయాలి
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు అవసరమైన అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఐఆరఎఫ్‌సీ ద్వారా ప్రతిపాదించిన రుణానికి వెంటనే ఆమోదం తెలపాలని కేంద్రాన్ని కోరనున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు కూడా హైదరాబాద్ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఈ ప్రాజెక్టుకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి, ప్రజల రవాణా అవసరాలను తీర్చడానికి మెట్రో విస్తరణ అత్యంత కీలకమని పేర్కొన్నారు.
డిజిటల్ కేబినెట్
పరిపాలనా సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ కేబినెట్ వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు ప్రత్యేక ట్యాబ్‌లను అందించినట్లు చెప్పారు. కాగిత రహిత పరిపాలనను ప్రోత్సహించడం, పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడం ఈ నిర్ణయ లక్ష్యమని వివరించారు. ఇకపై కేబినెట్ నోట్లు, అజెండాలు, ఇతర అధికారిక పత్రాలు ఎక్కువగా డిజిటల్ రూపంలోనే జరుగుతాయని, దీంతో కాగిత వినియోగం తగ్గడంతోపాటు నిర్ణయ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని తెలిపారు.
‘నీట్’ అభ్యర్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం
రాబోయే ‘నీట్’కు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 2.95 లక్షల మంది 2,008 కేంద్రాల్లో పరీక్ష రాయనున్నట్లు అంచనా. హాల్ టికెట్ చూపించిన విద్యార్థులకు ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. విద్యార్థులు, వారి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించడమే ఈ నిర్ణయ లక్ష్యమని పేర్కొంది.
కొత్త పథకం అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘం
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్‌ఈజీఎస్)లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మార్పుల ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఈ ఉపసంఘంలో మంత్రులు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, సీతక్క సభ్యులుగా ఉంటారని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను అధ్యయనం చేసి, తెలంగాణపై పడే ఆర్థిక భారం ఎంత ఉంటుందో అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై సిఫారసులు చేయనుందని తెలిపారు. ఉప సంఘం అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరించి త్వరలోనే నివేదిక సమర్పించనుంది.
రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు
ఇటీవలి యాసంగి సీజన్‌లో ప్రభుత్వం రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం దేశంలోనే ఈ సీజన్‌లో ఏ రాష్ట్రం సాధించని ఘనత అని పేర్కొన్నారు. దేశ ఆహార ధాన్య నిల్వలకు తెలంగాణ ప్రధాన సహకార రాష్ట్రంగా అవతరించిందని చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన చెల్లింపులను రైతుల బ్యాంకు ఖాతాల్లో 48 గంటల వ్యవధిలోనే నేరుగా జమ చేయడం ద్వారా పారదర్శకతను, రైతుల ఆర్థిక భద్రతను ప్రభుత్వం నిర్ధారించిందన్నారు. తాజా కొనుగోలు సీజన్‌లోనే సుమారు రూ.18,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుత వ్యవసాయ చక్రంలో మొత్తం రూ.38,000-39,000 కోట్ల వరకు రైతులకు చెల్లింపులు జరిగాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్ల కాలంలో కొనుగోలు కార్యకలాపాల ద్వారా రైతులకు రూ.లక్ష కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయని, ఇదే సమయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో సుమారు రూ.1.30 లక్షల కోట్లు చెల్లించినట్లు వివరించారు.
కేంద్ర కొనుగోలు విధానంపై ఆందోళన
తెలంగాణలో పండుతున్న పంటలను కేంద్ర సంస్థలు తగిన స్థాయిలో కొనుగోలు చేయకపోవడంపై మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేయడమే కాక సుమారు 15 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కూడా కొనుగోలు చేసినప్పటికీ కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) వ్యవస్థలో కేంద్ర సంస్థలు ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు చేయడం లేదని పేర్కొన్నారు. ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం, సీసీఐ ద్వారా పత్తి, నాఫెడ్ ద్వారా ఇతర పంటలను కొనుగోలు చేసే విషయంలో కేంద్రం తన రాజ్యాంగ, విధానపరమైన బాధ్యతలను నిర్వర్తించాలని డిమాండ్ చేశారు. పంటల కొనుగోలు అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు మంత్రులు, ఎంపీలు త్వరలోనే దిల్లీ వెళ్లనున్నట్లు మంత్రులు తెలిపారు.
– ఎల్‌ఐసీకి మొత్తం ప్రీమియం చెల్లించాం : మంత్రి తుమ్మల
రైతు మరణించిన సందర్భంలో వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం అత్యంత బాధ్యతతో అమలు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.ఎల్‌ఐసీకి చెల్లించాల్సిన మొత్తం వార్షిక ప్రీమియాన్ని ప్రభుత్వం ఇప్పటికే చెల్లించిందన్నారు. రైతు బీమా పథకాన్ని నిలిపివేసినట్లు బీఆరఎస్ నాయకులు చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని అన్నారు. రైతు సంక్షేమం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రైతులకు ఉపయోగపడే ఏ ఒక్క పథకాన్ని నిలిపివేయలేదని, పథకాలను నిలిపివేసి రైతులను ఇబ్బందులకు గురిచేసిన చరిత్ర గత ప్రభుత్వానిదే అని దుయ్యబట్టారు. రైతులకు ఉపయోగపడే వ్యవసాయ యాంత్రీకరణ, సాయిల్ హెల్త్ టెస్ట్, సబ్సిడీపై విత్తనాలు వంటి పథకాలను నిలిపివేయడమే కాక రాష్ట్ర వాటాను విడుదల చేయకుండా కేంద్ర ప్రాయోజిత పథకాలను సైతం రైతులకు దూరం చేసిందని విమర్శించారు. గత ప్రభుత్వ పథకాలను ఎలాంటి భేñషజాలకు పోకుండా అమలు చేయడమేకాక ఆగిన పథకాలను సైతం పునరుద్ధరిస్తూ రైతులకు అండగా నిలుస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 66,038 మంది రైతుల కుటుంబాలు రైతు బీమా పథకం ద్వారా లబ్ధి పొందాయని మంత్రి తెలిపారు. ఆయా కుటుంబాల నామినీల ఖాతాల్లో మొత్తం రూ.3301.90 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. 2023 డిసెంబర్ నుంచి ఆ ఏడాది ముగిసే వరకు 20,090 కుటుంబాలకు రూ.1,004.50 కోట్లు, 2024లో 25,861 కుటుంబాలకు రూ.1,293.05 కోట్లు బీమా సాయంగా అందించినట్లు వివరించారు. 2025-26కి రాష్ట్రంలో 42.16 లక్షల మంది రైతులు రైతు బీమా పథకంలో నమోదు చేసుకున్నారని, వీరికి వర్తించేలా ఎల్‌ఐసీకి చెల్లించాల్సిన మొత్తం వార్షిక ప్రీమియం రూ.1,359.56 కోట్లను ప్రభుత్వం పూర్తిగా చెల్లించిందని తెలిపారు. దీంతో 20,087 కుటుంబాలకు రూ.1004.35 కోట్లు బీమా సహాయంగా అంది, మరణించిన రైతు కుంటుబాలకు ఆర్ధిక చేయూత అందినట్లు చెప్పారు. రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. రైతు మరణంతో దుఃఖంలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించి వారు ఆర్థికంగా నిలదొక్కుకొనేలా రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని, రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.
———————————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





