త్యాగాలు బీఆర్ఎస్‌వి.. మోసాలు రేవంత్‌వి!

– సబ్బండ వర్గాల పొట్టగొడుతున్న ప్ర‌భుత్వం
– ఏ వర్గానికి అన్యాయం జరిగినా అండగా నిల‌బ‌డ‌తాం
– రేవంత్ రెడ్డికి హిట్లర్ గతే పడుతుంది
– హ‌స్నాబాద్ పార్టీ స‌భ్య‌త్వ స‌ద‌స్సులో హ‌రీష్‌రావు

సిద్దిపేట‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 17: తెలంగాణ కోసం త్యాగాలు చేసింది బీఆర్ఎస్ అయితే మోసాలు చేస్తోంది రేవంత్ రెడ్డి అని అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. ఎలాంటి త్యాగం చేయని వ్యక్తి సీఎం అయ్యాడన్నారు. గత ఎన్నికల్లో కృతజ్ఞతకు, ఆశకు మధ్య పోటీ జరిగితే కాంగ్రెస్ అబద్ధపు హామీలకు ప్ర‌జ‌లు మోస‌పోయార‌ని, రేవంత్ మోసగాడన్న నిజస్వరూపం ఇప్పుడు బయటపడింద‌ని వ్యాఖ్యానించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో బుధ‌వారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, ‘స‌ర్‌’ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ ఉద్యమ తొలి నాళ్లలో కేసీఆర్ నిరాహార దీక్షకు వెళ్తుంటే ఆయనతో అలుగునూరు చౌరస్తాలో అరెస్టయిన గొప్ప నాయకుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు అని, ఈ వయసులో కూడా పార్టీ కార్యక్రమానికి రావడం ఆయన అంకితభావానికి నిదర్శనమ‌ని కొనియాడారు. హుస్నాబాద్ అంటే కేసీఆర్ కి ఎంతో నమ్మకం.. ఇక్కడినుంచే ఎన్నికల శంఖారావం పూరించేవారు.. కేసీఆర్ సైకిల్ యాత్రకు బ్రహ్మరథం పట్టి తొలి రోజుల్లోనే ఎంపీపీలు, జడ్పీటీసీలను గెలిపించిన గడ్డ ఇది అని గుర్తుచేశారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ కోసం మనం దీక్షలు చేయ‌గా కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే హుస్నాబాద్‌ను రెవెన్యూ డివిజన్‌గా మార్చారన్నారు. ఎస్పీ, డీఎస్పీ, ఎలక్ట్రిసిటీ డీఈ ఆఫీసులు తెచ్చుకున్నాం.. బస్టాండ్‌ను పూర్తిస్థాయి డిపోగా మార్చారు. గౌరవెల్లి ప్రాజెక్టును, గండి మహాసముద్రం చెరువును అద్భుతంగా తీర్చిదిద్దారు అని వివ‌రించారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో 610 జీవో అమలు చేయకపోతే, పోతిరెడ్డిపాడు పెంచుతుంటే.. మనమే తెలంగాణ కోసం పదవులకు రాజీనామాలు చేశామ‌ని ఆయ‌న‌ గుర్తుచేశారు. తెలంగాణ కోసం రాజీనామా చేయాలన్నప్పుడు ముందుగా స్పీకర్ కు రాజీనామాలు ఇచ్చింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్ర‌మేన‌న్నారు. రేవంత్ రెడ్డి మాత్రం ఒరిజినల్ కాపీ జేబులో పెట్టుకుని జిరాక్స్ కాపీ ఇచ్చి డ్రామాలు ఆడాడని విమ‌ర్శించారు. ఎస్టీ సబ్ ప్లాన్ కింద 2730 కోట్లు కేటాయించామని గొప్పలు చెప్పి కేవలం 52 కోట్లు.. అది కూడా కరెంట్ బిల్లులు, జీతాలకే ఖర్చు చేశారని, ఒక్క ఎస్టీ యువకుడికి కూడా ఉపాధి కల్పించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ కింద రూ.5403 కోట్లు కేటాయించినా ఒక్క దళితుడికి కూడా లోన్ రాలేదు.. దళిత బంధు కింద 12 లక్షలు ఇస్తామన్న హామీ గాలికి పోయింది.. బీసీ కార్పొరేషన్ కు 1370 కోట్లు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు.. 33 కుల కార్పొరేషన్లు పెట్టి అందులో కాంగ్రెస్ నేతలకు కుర్చీలు ఇచ్చారు తప్ప బీసీలకు ఒరిగిందేమీ లేదు.. కేసీఆర్ యాదవులకు గొర్రెలు, మత్స్యకారులకు ఏటా 100 కోట్లతో ఉచిత చేప పిల్లలు ఇస్తే కాంగ్రెస్ వాటన్నింటినీ బంద్ పెట్టిందని హరీశ్ రావు వివ‌రించారు. చేనేతన్నలకు బతుకమ్మ చీరలు, స్కూల్ యూనిఫాం ఆర్డర్లు కేసీఆర్ ఇస్తే రేవంత్ రెడ్డి ఆ ఆర్డర్లను గుజరాత్ కార్పొరేట్లకు కట్టబెట్టి నేతన్నల పొట్టగొట్టాడు. .చేనేత సబ్సిడీలు ఆపేశాడు.. గౌడన్నలకు వైన్ షాపుల్లో 15% రిజర్వేషన్ ఇచ్చి, చెట్ల పన్ను రద్దు చేసి ఆదుకున్న ఘనత కేసీఆర్ ది అయితే రేవంత్ రెడ్డి వేలాదిమంది గౌడన్నలను జైళ్లకు పంపుతున్నాడు.. గౌరవెల్లి ప్రాజెక్టును ప్రత్యేక ప్యాకేజీతో పూర్తి చేసి కేసీఆర్ ట్రయల్ రన్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం 30 గజాల కాలువ కూడా తవ్వలేదు.. సొంత జిల్లాలోని పాలమూరు ప్రాజెక్టు అర్థం కావడానికే తనకు రెండున్నరేళ్లు పట్టిందని సీఎం అంటున్నాడు.. మరి గౌరవెల్లి అర్థం కావడానికి ఐదేళ్లు పడుతుందా అని నిల‌దీశారు.

ఆయ‌న‌ది కమీషన్ మోడ్

రేవంత్‌ది మిషన్ మోడ్ కాదు కమీషన్ మోడ్. గురుకుల పిల్లల కోడిగుడ్లలో కూడా కమీషన్లు కొడుతున్నాడని హరీశ్ రావు ఆరోపించారు. రైతుబంధు, రైతు బీమా ఎప్పుడిస్తావ్.. బోనస్ ఏమైంది.. ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడిస్తావ్ అని ప్రజల పక్షాన సూటిగా ప్రశ్నిస్తా. హామీలు నెరవేర్చేదాకా నిలదీస్తూనే ఉంటా, స్కాములు బయటపెడుతూనే ఉంటాన‌న్నారు. సిటీలో మోరీలు బాగుచేయడం చేతకాని వాడు ఫ్యూచర్ సిటీ కడతాడట. 1.5 లక్షల కోట్లతో మూసీ సుందరీకరణ అని కమీషన్లకు కక్కుర్తి పడుతున్నాడు. ఎస్సీ , ఎస్టీలకు అదనంగా ఇస్తామన్న రూ.లక్ష కూడా ఇవ్వలేదు. ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై అఘాయిత్యం జరిగితే ఆ జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు పట్టించుకోలేదు. నేను నిమ్స్ కు వెళ్లి బయట మందులు కొంటున్న ఆ తల్లి బాధను, బిల్లులను మీడియాకు చూపిస్తే అప్పుడు ఈ దద్దమ్మ ప్రభుత్వం కదిలింది. హిట్లర్ నాకు ఆదర్శం అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డికి హిట్లర్ కు పట్టిన గతే పడుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

‘స‌ర్‌’ విషయంలో ఎవరూ ఆందోళన వ‌ద్దు

‘స‌ర్‌’ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు.. కానీ అప్రమత్తంగా ఉండాలి అన్నారు. చనిపోయిన వారి, డబుల్ ఓట్లను తొలగించి జాబితాను సవరించే ప్రక్రియ అన్నారు. అధికారికంగా ఇందులో పార్టీలకు భాగస్వామ్యం ఉంది కాబట్టి బూత్ లెవెల్ ఆఫీసర్లు (అంగన్వాడీ టీచర్లు) ఇంటింటికి వచ్చేటప్పుడు మన బూత్ లెవెల్ ఏజెంట్లు వారి వెంట వెళ్లాలన్నారు. ఎవరైనా అధికారులు సహకరించకపోతే ఏఆర్ఓ, ఆర్డీ వోలకు ఫిర్యాదు చేయొచ్చున హరీశ్ రావు చెప్పారు. ఫ్యామిలీ గ్రూపింగ్ ఫారాలు, ఓటరు నమోదు ఫారాలు నింపడంలో ప్రజలకు మనమే దగ్గరుండి సహాయపడాలన్నారు. బీఆర్ఎస్ సానుభూతిపరుల ఓట్లు ఎక్కడా గల్లంతు కాకుండా ప్రతి కార్యకర్త బాధ్యతగా చూసుకోవాలంటూ ఒక్క ఓటు కూడా ఎన్నికల్లో క్రియాశీలకంగా మారుతుంద‌న్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *