భూ యజమానికి చట్టబద్ధ హక్కులు కల్పించడమే లక్ష్యం

  • భూ రీ స‌ర్వేకు హాజ‌రు కాని స‌ర్వేయ‌ర్ల‌కు నోటీసులు ఇవ్వాలి
  • సబ్ రిజిస్ట్రార్లు, తహసీల్దార్ల‌ పనితీరు మారాలి
  • అన్ని జిల్లాల్లో జ‌న‌గామ యాప్ అమ‌లు చేయాలి
  • భద్రాద్రి ఐడీవోసీ సమీక్షలో మంత్రి పొంగులేటి 

భద్రాద్రి కొత్తగూడెం, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 3 : రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతోపాటు ప్రతి భూయజమానికి చట్టబద్ధమైన హక్కులు కల్పించడమే తమ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని రెవెన్యూ, భూ రీ-సర్వే, రిజిస్ట్రేషన్, హౌసింగ్ అంశాలపై గురువారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సీసీఎల్ఏ డి.ఎస్.లోకేశ్ కుమార్, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లతో కలిసి నిర్వహించిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సామాన్య ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ధరణి స్థానంలో ‘భూ భారతి’ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. అధికారాలను కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్ల స్థాయికి వికేంద్రీకరించి సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రభుత్వం చేపట్టిన భూ రీ-సర్వేకు హాజరుకాకుండా ప్రైవేట్ సర్వేలకే ప్రాధాన్యమిచ్చే లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు తక్షణమే నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన ప్రత్యామ్నాయ సిబ్బందిని సిద్ధంగా ఉంచాలన్నారు. సబ్ రిజిస్ట్రార్లు, తహసీల్దార్ల‌ పనితీరుపై వస్తున్న వార్తలపై మంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారులు తమ వైఖరిని మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు లేదా లబ్ధిదారుల ఎంపికలో ఎవరైనా డబ్బులు వసూలు చేసినట్లు తేలితే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు సంక్షేమ ఫలాలను త్వరితగతిన అందించాలని పిలుపునిచ్చారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం

మొదటి విడత ఎల్-1 కేటగిరీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని, పనులు ప్రారంభం కాని వాటిని రెండో విడత జాబితాలోకి మార్చాలని సూచించారు. లబ్ధిదారులకు వెసులుబాటుగా రవాణాతో కలిపి సిమెంట్ బస్తా రూ.230 లకే అందిస్తున్నట్లు వెల్లడించారు.

అటవీ – రెవెన్యూ సరిహద్దు వివాదాల పరిష్కారం

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అటవీ, రెవెన్యూ భూ సరిహద్దు వివాదాలను శాస్త్రీయ పద్ధతుల్లో కొలతలు వేసి శాశ్వతంగా పరిష్కరించాలని కలెక్టర్లు, ఫారెస్ట్ అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. పోడు రైతులకు ఉచిత విద్యుత్, బోర్ల మంజూరులో ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ‘జనగామ యాప్’ అమలు

భూ సంబంధిత ప్రక్రియల్లో జనగామ కలెక్టర్ రూపొందించిన ప్రత్యేక యాప్ సత్ఫలితా లు ఇస్తోందని మంత్రి చెప్పారు. దీనిని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేయాలని అధికారుల‌కు సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *