వేసవి దుక్కి.. భూమికి బలం, రైతుకు లాభం!

– కలుపు మొక్కలు, పురుగుల గుడ్లు, లార్వాల సహజ నియంత్రణ
– నేలలో సేంద్రియ కర్బనం, మిత్ర సూక్ష్మజీవుల పెరుగుదల
– వర్షపు నీటి నిల్వ సామర్థ్యం మెరుగుదల
– సాగు ఖర్చులో తగ్గుదల అవకాశం
– పంట దిగుబడిలో పెరుగుదల సాధ్యం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : పంట కోత అనంతరం భూమిని లోతుగా దున్నే వేసవి దుక్కులు (Summer Ploughing) పద్ధతి రైతులకు దీర్ఘకాలిక లాభాలను అందించే కీలక వ్యవసాయ యాజమాన్య చర్యగా వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వేసవి ఎండలో భూమిని దున్నడం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడటమే కాక చీడపీడల నివారణ, నీటి నిల్వ, పెట్టుబడి తగ్గుదల, దిగుబడి పెరుగుదల వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. నేల గుల్లబారి వేర్ల పెరుగుదలకు అనుకూల పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని కలుపు మొక్కలు, పురుగుల గుడ్లు, లార్వాల సహజ నియంత్రణ సాధ్యమవుతుందని, నేలలో సేంద్రియ కర్బనం, మిత్ర సూక్ష్మజీవుల పెరుగుదల, వర్షపు నీటి నిల్వ సామర్థ్యం మెరుగుదలతోపాటు సాగు ఖర్చులో తగ్గుదలకు అవకాశం ఉంటుందని, పంట దిగుబడిలో పెరుగుదల సాధ్యం అవుతుందని వ్యవసాయ అధికారులు తెలుపుతున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం.. వేసవి దుక్కుల వల్ల నేల గట్టిపడిన పొరలు పగిలి గాలి ప్రసరణ మెరుగుపడుతుంది. భూమిలోని పోషకాలు సమానంగా కలవడంతో మొక్కల వేర్లు లోతుగా పెరిగి పోషకాలను సమర్థవంతంగా గ్రహిస్తాయి. వేసవి ఎండ తీవ్రత కారణంగా నేలలో దాగి ఉండే హానికర పురుగుల గుడ్లు, లార్వాలు, కోశస్థ దశలు (ప్యూపా) బయటకు వచ్చి ఎండకు నశిస్తాయి. పక్షులు వాటిని ఆహారంగా తీసుకోవడం వల్ల సహజ నియంత్రణ జరుగుతుంది. దీంతో పురుగు మందుల వినియోగం గణనీయంగా తగ్గుతుంది. అలాగే ఎండు తెగుళ్లు, వేరు కుళ్లు వంటి వ్యాధులకు కారణమయ్యే శిలీంద్ర బీజాలు అధిక ఉష్ణోగ్రతల వల్ల నశించి పంట కాలంలో వ్యాధుల తీవ్రత తగ్గుతుంది. చీడపీడల ప్రభావం కూడా తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు తెలుపుతున్నారు. వేసవి దుక్కుల వల్ల భూమిలోని పంట అవశేషాలు, ఎండు గడ్డి తదితరాలు మట్టిలో కలిసిపోయి క్రమంగా సేంద్రియ కర్భన పదార్థంగా మారతాయి. దీనివల్ల నేలలో సేంద్రియ కర్బనం (Soil Organic Carbon) పెరిగి భూసారం మెరుగుపడుతుంది. మిత్ర సూక్ష్మజీవుల వృద్ధికి కూడా ఇది అనుకూల పరిస్థితులు కల్పిస్తుంది. వేసవి దుక్కుల వల్ల భూమిలో గాలి ప్రసరణ, తేమ నిల్వ, సేంద్రియ పదార్థాల కలయిక మెరుగుపడటంతో వానపాములకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. దీంతో వానపాముల సంతతి పెరిగి నేల మరింత గుల్లగా మారుతుంది. వానపాములు భూమిలో సహజంగా సొరంగాలు తయారు చేయడం వల్ల నీరు, గాలి సులభంగా లోనికి చేరి భూసారం పెరగడానికి సహాయపడుతుంది. నీటి యాజమాన్యంలో కూడా వేసవి దుక్కులు కీలక పాత్ర పోషిస్తాయి. దుక్కి చేసిన భూమి గుల్ల బారడం వల్ల  తొలి వర్షపు నీటిని భూమిలోకి ఇంకించుకుంటుంది. దీనివల్ల భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండి వర్షాభావ పరిస్థితుల్లో కూడా పంట నిలబడే అవకాశాలు పెరుగుతాయి. ఆర్థికంగా కూడా ఈ పద్ధతి రైతులకు మేలు చేస్తుంది. కలుపు నివారణ, పురుగు మందుల ఖర్చులు తగ్గడం వల్ల రైతులకు ఖర్చు ఆదా అవుతుంది. అదనంగా దిగుబడి పెరగడం ద్వారా మరింత ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

రైతులకు సూచనలు 

పంట కోత పూర్తయిన వెంటనే భూమిలో స్వల్ప తేమ ఉన్నప్పుడు దుక్కులు చేయాలి. భూమిని లోతుగా దున్నడం ఉత్తమం. వీలైతే భూమిని ఏటవాలుగా దున్నడం ద్వారా వర్షపు నీరు భూమిలోకి ఎక్కువగా ఇంకుతుంది. దుక్కుల అనంతరం పంట అవశేషాలను భూమిలో కలపడం ద్వారా సేంద్రియ కర్బనం పెరుగుతుంది. వేసవి దుక్కులను కేవలం ఒక వ్యవసాయ పనిగా కాకుండా భూమి ఆరోగ్యాన్ని కాపాడే దీర్ఘకాలిక పెట్టుబడిగా భావించాలని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ పద్ధతిని పాటించడం ద్వారా భూసారం పెరగడంతోపాటు సాగు ఖర్చు తగ్గి లాభసాటి వ్యవసాయం సాధ్యమవుతుందని తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *