– 6 నుంచి 15 శాతానికి పెంచిన కేంద్రం
న్యూదిల్లీ, మే 13: బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని కేంద్రం తాజాగా పెంచింది. బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 10 శాతానికి, అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్‌ను 5 శాతానికి పెంచింది. దీంతో మొత్తం దిగుమతుల సుంకం 15 శాతానికి చేరింది. గతంలో ఇది 6 శాతంగా ఉండేది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో 95.75కి పతనమైన నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీని పెంచింది. బంగారం వినియోగంలో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. వెండి వినియోగంలో ప్రథమ స్థానంలో ఉంది. దేశీయ అవసరాల కోసం భారత్ ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇక ఈక్విటీ మార్కెట్‌లో రాబడులు మందగించిన నేపథ్యంలో గతేడాది భారత్‌లో బంగారానికి డిమాండ్ పెరిగింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం, ఈ మార్చితో ముగిసిన త్రైమాసికంలో గోల్డ్ ఆధారిత ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లో పెట్టుబడులు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 186 శాతం మేర పెరిగాయి. ఇప్పటికే ధరలు అధికంగా ఉన్నందున కస్టమ్స్ డ్యూటీ పెంపుతో బంగారం, వెండికి మరింత డిమాండ్ తగ్గవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. బంగారం, వెండి దిగుమతుల కట్టడి కోసం ఇటీవల ప్రభుత్వం 3 శాతం ఐజీఎస్‌టీ విధించింది. దీంతో బ్యాంకులు దిగుమతులకు దాదాపు నెల రోజులపాటు బ్రేక్ చెప్పాయి. ఫలితంగా ఏప్రిల్‌లో దిగుమతులు 30 ఏళ్ల నాటి కనిష్ఠాన్ని తాకాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





