– ప్రధాని తీరుపై మండిపడ్డ కవిత
– భగీరథ్ పై లుకౌట్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు వచ్చి పొదుపు సూత్రాలు చెప్పారని, డబ్బులు మాత్రం ఏపీకి ఇచ్చారని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యానించారు. బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుటుంబ సభ్యులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, ప్రధాని పర్యటనలో ఆయన పాల్గొనడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళ్లిందని అన్నారు. సంజయ్ కుమారుడు దేశం దాటిపోకుండా తెలంగాణ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయాలన్నారు. కొడుకు తప్పు చేసినట్లు రుజువైతే మంత్రి పదవికి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆడపిల్ల జీవితం నాశనం అయ్యేలా సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేసిన వారిని అరెస్టు చేయాలని, సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయాల్సిన అత్యుత్సాహం బీఆర్ఎస్ పార్టీకి ఎందుకని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపై ప్రధాని మోదీ మాట్లాడలేదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వాలన్నారు. జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయాలన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం పూర్తిచేయాలని కేంద్ర మంత్రిని కలిశారని, పోలవరం ప్రాజెక్టును ఐదుసార్లు సందర్శించారని అంటూ తెలంగాణ సీఎం రేవంత్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు వెళ్లలేదని విమర్శించారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే వాటర్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని, చెక్‌డ్యామ్‌లు కట్టి నీటి వనరులను సద్వినియోగం చేస్తామని తెలిపారు. ప్రధాని పర్యటనపై బీఆర్ఎస్ ఒక్క మాట మాట్లాడలేదని విమర్శించారు. కులగణనలో ఓబీసీ కాలమ్ పెట్టాలని కవిత డిమాండ్ చేశారు. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధించడానికి దేశం మొత్తం తిరుగుతామని, పోలవరం, బనకచర్లపై రిట్ పిటిషన్ వేయనున్నట్లు తెలిపారు. దీనిపై కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసి వినతి పత్రం ఇస్తామన్నారు. ‘నీట్’ లాంటి జాతీయ పరీక్ష పేపర్ల లీక్ ఘటన అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడుకోవద్దని హెచ్చరించారు. టీఆర్ఎస్ జెండా పండుగలో తాను పాల్గొంటానని తెలిపారు. తెలంగాణ రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికి తెలంగాణ రక్షణ సేన పుట్టిందని కవిత పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





