– కాంగ్రెస్‌ది బ్లాక్మెయిల్, దిగజారుడు రాజకీయం
– అజిత్ దోవల్ వంటి వారిని రాజకీయాల్లోకి లాగడం దుర్మార్గం
– ‘సర్’పై ప్రాథమిక పరిజ్ఞానం లేని రాహుల్
– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16 : శ్రీలంకలో ప్రభుత్వాన్ని కూల్చిన మాదిరిగానే భారత్‌లోనూ ఎన్డీయే ప్రభుత్వాన్ని కూల్చేస్తామని రాహుల్ గాంధీ దింపుడు కళ్లం ఆశలు పెట్టుకుంటున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ.. నీకు దమ్ముంటే ప్రజాదరణతో ఎన్నికైన మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టి చూడు అంటూ తీవ్రంగా హెచ్చరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికల నిర్వహణ యావత్ ప్రపంచానికే ఆదర్శమని స్పష్టం చేశారు. అమెరికా వంటి అగ్రరాజ్యాల్లో ఎన్నికల ప్రక్రియ, కౌంటింగ్ నెలలతరబడి సాగుతుందని, కానీ మన దేశంలో 140 కోట్ల మంది ప్రజల అభీష్టాన్ని నిష్పక్షపాతంగా ఒక్క రోజులోనే తీర్పు వెల్లడించే అద్భుతమైన స్వతంత్ర వ్యవస్థ ఎన్నికల కమిషన్‌దని గుర్తు చేశారు. అలాంటి ఎన్నికల కమిషన్‌పై బురద చల్లేందుకు రాహుల్ నిరంతరం యత్నిస్తున్నారని మండిపడ్డారు. దేశ భద్రతను కాపాడుతూ దేశ ప్రజల, యువత హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను రాజకీయాల్లోకి లాగడం అత్యంత దుర్మార్గమని కిషన్ రెడ్డి ఖండించారు. రాహుల్ వ్యవహారశైలి అత్యంత బాధ్యతారాహిత్యంగా ఉందని ఆయన విమర్శించారు. ఉన్నధికారులు తనకు టచ్‌లో ఉండి సమాచారం లీక్ చేస్తున్నారని ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదమన్నారు. సాధారణంగా ప్రతిపక్ష నాయకుడు అధికారులతో సత్సంబంధాలు పెంచుకోవడం గౌరవప్రదమని, కానీ ప్రభుత్వ అధికారులతో మాట్లాడే సంస్కృతి, సోయి రాహుల్‌కు లేవని దుయ్యబట్టారు. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి ఇంత బాధ్యతారాహిత్యమైన, బలహీనమైన ప్రతిపక్ష నేతను దేశం ఎన్నడూ చూడలేదని విమర్శించారు. నాడు వాజ్‌పేయి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌తో విభేదాలు ఉన్నప్పటికీ దేశ ప్రయోజనాల కోసం పీవీ నరసింహారావు ప్రభుత్వ హయాంలో ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించిన సంప్రదాయాన్ని గుర్తు చేశారు. చరిత్ర చదివి ఇలాంటి విలువలు నేర్చుకోవాలని రాహుల్‌కు హితవు పలికారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను బెదిరిస్తూ రాహుల్ దాదాగిరి భాష మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ‘ప్రజలు మీకు వోట్లు వేయకపోతే ఎన్నికల కమిషనర్ బాధ్యుడా? తమిళనాడులోనో, కేరళంలోనో.. ఇలా ఎక్కడైనా బీజేపీ ఓడిపోతే తాము ఇలాగే దాదాగిరి భాష మాట్లాడాలా అని ప్రశ్నించారు. వోట్ల చోరీ ఎక్కడా జరగలేదని, చోరోం కూ జనతా వోట్ నహీ దేరహీ (దొంగలకు ప్రజలు ఓటు వేయడం లేదు) అన్న వాస్తవాన్ని రాహుల్ గ్రహించాలని చురకలంటించారు.
న్యాయస్థానాలకు ఊరేగింపులు గర్హనీయం
న్యాయస్థానాల ముందుకు కాంగ్రెస్ నేతలు ఊరేగింపుగా వెళ్లడం అత్యంత గర్హనీయమని అన్నారు. స్వాతంత్య్ర పోరాటం జరిగినప్పుడు కూడా ఎవరూ కోర్టుల ముందు ఊరేగింపులు చేయలేదని, కానీ రాహుల్ గాంధీ ముఖ్యమంత్రులు, ఎంపీలు, పదవులు పోయిన నాయకులను విమానాలు, రైళ్లలో తరలించి సుప్రీంకోర్టుపై ఒత్తిడి తెచ్చేందుకు, న్యాయమూర్తులను బ్లాక్మెయిల్ చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ శైలిని ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. బారికేడ్లు ఎక్కి డ్యాన్సులు చేయడం, మహిళా పోలీసులపై దురుసుగా ప్రవర్తించడం, మహిళా కానిస్టేబుల్పె ౖప్రియాంక గాంధీ పిడిగుద్దులు కురిపించడం చూసి దేశ ఆడబిడ్డలు ఛీత్కరించుకుంటున్నారని అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచకాలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎండగడుతూ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయాలన్నా, ఫీజు రీయింబర్స్మెంట్, జీవో 22ఏ సమస్యలపై పోరాడాలన్నా బీజేపీ కార్యకర్తలను, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని వారంలో ఐదుసార్లు అర్ధరాత్రి ఇళ్లల్లోకి చొరబడి అక్రమంగా నిర్బంధిస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్లీలో రైతులు ఏడాదిన్నరపాటు నిరసనలు చేపడితే నీరు, ఆహారం, మరుగుదొడ్లు కల్పించి కేంద్రం ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించిందని గుర్తుచేశారు. ఇక్కడ ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ, బీజేపీ నాయకులు బయటకు రాకుండా గృహ నిర్బంధాలు చేస్తూ దిల్లీలో రాజ్యాంగ పరిరక్షణ అంటూ రేవంత్ రెడ్డి ఇచ్చే పెద్ద పెద్ద ఉపన్యాసాలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఆగ్రహించారు. దేశ అభివృద్ధిని, ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోదీ నాయకత్వంలో పెరుగుతున్న దేశ ప్రతిష్ఠను జీర్ణించుకోలేక అంతర్జాతీయ పెట్టుబడిదారీ శక్తులు, డీప్ స్టేట్ మీడియా, విదేశీ శక్తులు, దేశీయ విద్రోహ శక్తులు ఏకమై కుట్రకు తెరలేపాయని కిషన్ రెడ్డి అన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని దిిల్లీలో ఒక్క రోజే పది వేల జీన్స్ ప్యాంట్లు, టీ-షర్టులు విద్యార్థులకు పంపిణీ చేసి అరాచకాలు సృష్టించేందుకు కుట్రలు పన్నారని ఆధారాలతో వివరించారు. ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్, ఐఎల్వో వంటి అంతర్జాతీయ సంస్థలన్నీ దేశ జీడీపీ వృద్ధి, ఆర్థిక స్థిరత్వాన్ని వేనోళ్ల కొనియాడుతుంటే కొందరికి కంటగింపుగా మారిందన్నారు. ప్రపంచ శక్తులన్నీ ఏకమైనా నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని వెంట్రుక కూడా పీకలేవని స్పష్టం చేశారు.
‘సర్’పై ప్రాథమిక పరిజ్ఞానం లేని రాహుల్
‘సర్’ ప్రక్రియపై రాహుల్ గాంధీకి ప్రాథమిక జ్ఞానం కూడా లేదని కిషన్ రెడ్డి అన్నారు. ఇది ఇప్పుడు మోదీ హయాంలో కొత్తగా వచ్చింది కాదు.. నెహ్రూ, ఇందిర, రాజీవ్, పీవీ నరసింహారావు కాలం నుంచే అమల్లో ఉన్న రాజ్యాంగ ప్రక్రియ అని గుర్తు చేశారు. 2014, 2019, 2024 సాధారణ ఎన్నికల్లో ‘సర’తో సంబంధం లేకుండా ప్రజాదరణతోనే మోదీ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిందని స్పష్టం చేశారు. ‘సర’ ప్రవేశపెట్టకముందే కాంగ్రెస్ లెక్కలేనన్ని రాష్ట్రాల్లో ఘోరంగా ఓడిపోయిందని గుర్తు చేశారు. కేరళంలో సీపీఎం లక్షలాది దొంగ వోట్లను ‘సర్ ద్వారా తొలగించడం వల్లే కాంగ్రెస్ గెలిచిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రమేష్ చెన్నితాల ఒప్పుకున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. పొంతన లేకుండా మాట్లాడుతూ వ్యవస్థలను దెబ్బతీసేందుకు యత్నిస్తున్న రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కేరళం సహా యావత్ దేశ ప్రజలు పూర్తిగా తిరస్కరించడం ఖాయమని ఆయన తేల్చిచెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





