జవహర్‌నగర్ డంపింగ్ యార్డుపై పోరు

– ఎంపీ ఈటల మహా పాదయాత్ర ప్రారంభం
– పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సంపూర్ణ మద్దతు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27 : జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల పక్షాన నిలిచి, యార్డును తక్షణమే తరలించాలని డిమాండ్ చేస్తూ మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ చేపట్టిన చలో జవహర్‌నగర్ మహా పాదయాత్రకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు సంపూర్ణ సంఘీభావం తెలిపారు. మంగళవారం ఉదయం ఘట్‌కేసర్ మండలం ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువు వద్ద ప్రారంభమైన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ భవిష్యత్ తరాల ఆరోగ్యం, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ ప్రజా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో పాదయాత్ర చేపట్టిన ఈటలను అభినందించారు. గతంలో కొంపల్లి మోహన్ రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో కేసు వేసినప్పుడు డంపింగ్ యార్డును తరలించడంతోపాటు శాస్త్రీయంగా క్యాపింగ్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఆ ప్రక్రియ ఏమైందో, నిబంధనలు ఎందుకు అమలు కావడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక చెర్యాల, ఎదులాబాద్ పరిసర ప్రాంతాల్లో కాలుష్యం, దుర్గంధం వల్ల ప్రజలు అక్కడ నివసించలేని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని, భూగర్భ జలాలు విషతుల్యమైన కారణంగా ఎదులాబాద్ చెరువులోని చేపలను మార్కెట్‌లో ఎవరూ కొనుగోలు చేయని దయనీయ పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాలుష్య ప్రభావం స్థానికంగానే కాక జూబ్లీహిల్స్, తార్నాక, ఉస్మానియా విశ్వవిద్యాలయం వరకు వ్యాపిస్తోందని తెలిపారు. దిల్లీలోని ఓఖ్లా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను తాను పరిశీలించిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ అక్కడ పారిశ్రామిక ప్రాంతమైనప్పటికీ నియమనిబంధనలకు లోబడి రాత్రివేళల్లో మాత్రమే వ్యర్థాలను తరలిస్తూ శాస్త్రీయ పద్ధతుల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని, పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా నిర్వహిస్తున్నారని తెలిపారు. కానీ జవహర్‌నగర్ విషయంలో కనీస నిబంధనలు కూడా పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు. ఈ సమస్య తీవ్రతపై ఎంపీ ఈటల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసి నెల రోజులు గడిచినా ఎలాంటి స్పందన లేకపోవడం వల్లే ఇది ఉద్యమ రూపం దాల్చిందని స్పష్టం చేశారు. డంపింగ్ యార్డును పూర్తిగా మూసివేసి శాశ్వతంగా తరలించే వరకు ఈ ప్రజా పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. అలాగే, రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు, విచ్ఛిన్నకర విధానాలను ఎండగడుతూ ‘సర’పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి ప్రజలలో చైతన్యం కలిగించేందుకు నవంబర్ 2న ట్యాంక్ బండ్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న మహా పాదయాత్రకు ప్రజలు, శ్రేణులు భారీ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఇదే క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు పక్రియను పార్టీ శ్రేణులందరూ చురుగ్గా ముందుకు తీసుకెళ్లాలని రామచందర్ రావు సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *