‘ఏరోస్పేస్’ వ్యూహాత్మక కేంద్రంగా తెలంగాణ

– సవాళ్లు, మార్పుల్ని అందిపుచ్చుకునేలా ఎకో సిస్టం అభివృద్ధి
– ఆర్‌అండ్‌డీ, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్‌పై ప్రత్యేక దృష్టి
– ది ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా సదస్సులో మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: భవిష్యత్తు ఏరోస్పేస్ రంగ అవసరాలకు అనుగుణంగా తెలంగాణను దేశానికి ఒక వ్యూహాత్మక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఆర్‌ అండ్ డీ, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్, సర్టిఫికేషన్ అండ్ కాంప్లియెన్స్.. ఈ మూడింటినీ అనుసంధానించగలిగే దేశాలు, రాష్ట్రాలే రాబోయే రోజుల్లో ఏరోస్పేస్‌లో గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతాయన్నారు. ఆ దిశగా ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సవాళ్లు, మార్పుల్ని అందిపుచ్చుకునేలా రాష్ట్రంలో ‘ఎకో సిస్టం’ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ది ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ‘ఛేంజింగ్ సినారియో ఇన్ ఏరోస్పేస్- ఆర్ అండ్ డీ, మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ సర్టిఫికేషన్‌’ అంశంపై శుక్రవారం నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఏరోస్పేస్ అంటే యంత్రాల తయారీ మాత్రమే కాదని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఒక దేశ వ్యూహాత్మక శక్తికి, ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తోందని అన్నారు. ఈ రంగంలో ఒకప్పుడు యూఎస్, రష్యా, ఐరోపా దేశాలే ఆధిపత్యం చెలాయించేవని, ఇప్పుడు వాటికి దీటుగా గ్లోబల్ సప్లై చైన్‌లో మన దేశం కూడా ‘కీ’ రోల్ ప్లే చేస్తోందని అన్నారు. యునెస్కో గణాంకాల ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సైంటిస్టులు, ఇంజనీర్లు మన దేశంలోనే ఉన్నారన్నారు. మెకిన్సే నివేదిక ప్రకారం ల్యాబ్‌ల్లో జరిగే పరిశోధనల్లో 30 శాతం కూడా కమర్షియల్ మాన్యుఫ్యాక్చరింగ్‌కు నోచుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పరిశోధనల్ని ఉత్పత్తులుగా మార్చాలన్నదే ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని ఆయన అన్నారు. డెలాయిట్ గ్లోబల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సర్వే ప్రకారం నేడు 74 శాతం మంది ఏరోస్పేస్ సీఈఓలు కేవలం తక్కువ ఖర్చు కంటే పటిష్ఠమైన సప్లై-చైన్, తయారీ సామర్థ్యానికే ప్రాధాన్యమిస్తున్నారన్నారు. రాబోయే 20 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 42,000 కొత్త ఎయిర్ క్ట్రాఫ్ట్స్ అవసరం ఉంటుందని బోయింగ్, ఎయిర్‌బస్ సంస్థలు అంచనా వేశాయన్నారు. ఈ డిమాండ్‌ను హైదరాబాద్ అందిపుచ్చుకునేలా ఇక్కడి ప్రిసిషన్ ఇంజనీరింగ్, డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ నెట్‌వర్క్, బలమైన ఎంఎస్ఎంఈ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. ఇప్పటికీ మనం ఏరోస్పేస్ టెస్టింగ్, సర్టిఫికేషన్ కోసం విదేశాలపైనే ఆధారపడాల్సి వస్తోందని, ఫలితంగా ఖర్చు పెరగడమేకాక ఉత్పత్తుల గ్రౌండింగ్‌కు 18 నుంచి 24 నెలల వరకు అదనపు సమయం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచస్థాయి సర్టిఫికేషన్ ఎకో సిస్టం అభివృద్ధికి హైదరాబాద్ అన్ని రకాలుగా అనుకూలంగా ఉందని, ఆ దిశగా కేంద్రం చొరవ చూపాల్సిన అవసరముందని శ్రీధర్‌బాబు అన్నారు.

డ్రోన్లు, రీయూజబుల్ రాకెట్లు, ఏఐ ఏవియానిక్స్, 3డీ ప్రింటింగ్, అడ్వాన్స్‌డ్  మెటీరియల్స్ తదితర అంశాలు రాబోయే రోజుల్లో ఏరోస్పేస్ భవిష్యత్తును శాసిస్తాయన్నారు. అందుకు అనుగుణంగానే ఇప్పటి నుంచే తెలంగాణను సిద్ధం చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో ఉన్న 1,500కు పైగా ఎంఎస్ఎంఈలు ప్రపంచస్థాయి ఏరోస్పేస్ దిగ్గజ సంస్థలకు విడిభాగాలను సరఫరా చేస్తూ మేడిన్ తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేస్తున్నాయన్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్ ఆర్అండ్ డీ ఇన్‌స్టిట్యూషన్లు, గ్లోబల్ ఓఈఎంలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఆదిభట్ల ఏరోస్పేస్ ఎస్ జెడ్, ప్రత్యేక ఏరోస్పేస్ పార్కులు, రోడ్డు నెట్ వర్క్ తదితర మౌలిక సదుపాయాలు, టాలెంట్ పూల్ ప్రపంచ ఏరో స్పేస్ దిగ్గజ సంస్థలు తెలంగాణ వైపు చూసేలా చేశాయన్నారు. హైదరాబాద్ వేదికగా ఏరో స్పేస్ భవిష్యత్తును నిర్మించేందుకు చిత్తశుద్ధితో కృషిచేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, ఆవిష్కర్తలను మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానించారు. అనంతరం ఏరోస్పేస్ రంగంలో విశేష కృషి చేసిన పలువురు శాస్త్రవేత్తలు, ప్రముఖులను ఆయన సత్కరించారు. కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సారస్వత్, డీజీ సీఎస్ఐఆర్ అండ్ డీఎస్ఐఆర్ సెక్రటరీ డీ.ఎన్ కళైసెల్వి, ది ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు డాక్టర్ సతీష్ రెడ్డి, డాక్టర్ సోమనాథ్, రాజబాబు, డాక్టర్ శివ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *