– వేలం వెర్రిగా సర్కారు భూముల అమ్మకాలు
– నాడు కోర్టుకు వెళ్లి నేడు అడ్డగోలుగా అమ్ముకుంటావా?
– రాయదుర్గం హెరిటేజ్ భూ వేలాన్ని వెంటనే ఆపాలి
– సీఎం రేవంత్‌కు హరీష్ రావు లేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13 : రాష్ట్రంలో వేలం వెర్రిగా ప్రభుత్వ భూముల అమ్మకాలు చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ నేత టి.హరీష్‌రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎక్కడ ప్రభుత్వ భూములు కనిపిస్తే అక్కడ అమ్మకాలేనా అంటూ ప్రశ్నించారు. ఈమేరకు సీఎంకు ఓ లేఖ రాశారు. నాడు పీసీసీ అధ్యక్షుడిగా ప్రభుత్వ భూములు పెద్దలు ఇచ్చిన జాతి సంపద అని ఉపన్యాసాలు దంచిన నువ్వు నేడు ప్రజల ఆస్తులను అమ్మకానికి పెడుతున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కంచ గచ్చిబౌలి, లగచర్ల, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, నేడు రాయదుర్గ్ ఇలా ఎక్కడిక్కడ భూములు అమ్మే కుట్రలు చేస్తుండటం సిగ్గుచేటని అని అన్నారు. జీవో ఎంఎస్ నెం.4 ద్వారా రాయదుర్గు పన్మక్త గ్రామంలోని సర్వే నం.83ను హెరిటేజ్ సైట్‌గా గుర్తించినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయన్నారు. హెరిటేజ్ భూములను కాపాడాల్సిన ప్రభుత్వం వాటినే వేలం వేయడం ఏమిటని నిలదీశారు. 2020లో ఇదే భూములపై రక్షణ కోరుతూ రేవంత్ కోర్టు మెట్లు ఎక్కారని గుర్తుచేశారు. ప్రతిపక్షంలో ఉండగా ఒక మాట.. అధికారంలోకి వచ్చాక మరో మాటనా అని ప్రశ్నించారు. ఇదే సర్వే నంబరులో గతంలో 6.2 ఎకరాలు ఎకరాకు సుమారు రూ.237 కోట్ల చొప్పున వేలం వేస్తే ఎస్‌బీఐ కోర్టుకు ఎక్కిందని, ప్రస్తుతం ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉందని వెల్లడించారు. అయినా మరో 10.63 ఎకరాలను వేలం వేయడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థ అంటే గౌరవం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భూమిపై అనేక వివాదాలు ఉన్నాయంటూ భూమి ఎవరిదో తేల్చలేని ప్రభుత్వం భూమిని అమ్మడానికి ఎందుకు తొందరపడుతోందని నిలదీశారు. రూ.2,000 కోట్ల విలువైన హెరిటేజ్ భూములను అమ్మే హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారంటూ మండిపడ్డారు. ఇంచు ప్రభుత్వ భూమిని కూడా అమ్మబోము అన్న హామీ ఏమైందని అడిగారు. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ భూములను అమ్మబోమని చెప్పిన రెవెన్యూ మంత్రి మాటలకు విలువ లేదా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు కూడా ఆస్తిని పరిరక్షించడం, కొత్తగా థర్డ్ పార్టీ ఇంటరెస్ట్ సృష్టించకుండా చూడాల్సిన అవసరాన్ని స్పష్టం చేసిందని హరీశ్ గుర్తుచేశారు. ఈ పరిస్థితుల్లో వివాదాస్పద భూమిని వేలం వేసి కొత్త హక్కులు సృష్టించడం ఏ విధమైన పరిపాలనా బాధ్యత అని ప్రశ్నించారు. ఈనెల 17, 21 తేదీల్లో జరపనున్న వేలాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సర్వే నం.83కు సంబంధించిన హెరిటేజ్, రెవెన్యూ, సర్వే, వక్ఫ్ రికార్డులన్నింటినీ బయటకు తీసి సమగ్రంగా విచారణ జరిపి, వాస్తవాలు నిగ్గు తేల్చాలన్నారు. హక్కులు, వివాదాలు తేలకముందే ఈ భూములను కొనుగోలు చేస్తే భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తప్పవని హెచ్చరించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారిలా కాక ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని హితవు పలికారు. అనుముల బ్రదర్స్ ప్రయోజనాల కోసం కాదని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే ముఖ్యమంత్రిగా ఉండాలని, లేదంటే చరిత్ర హీనుడిగా మిగిలిపోతావని హరీశ్ రావు హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





