పరీక్షల నిర్వహణలో సమగ్ర సంస్కరణలు తేవాలి

‘నీట్‌’ లీక్‌ వ్యవహారంలో సుప్రీం విచారణ

న్యూదిల్లీ, ఆగస్టు 19 : ‘నీట్‌’ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారం, జాతీయ పరీక్షల సంస్థలో సంస్కరణలకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పరీక్షల నిర్వహణలో శాశ్వత, సమగ్ర సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని కోర్టు స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణకు పటిష్ఠ వ్యవస్థ అవసరమని అభిప్రాయపడింది. ఎన్‌టీఏలో చేపట్టిన సంస్థాగత సంస్కరణలు, ప్రశ్న పత్రాల భద్రత, పరీక్షల పారదర్శకత, సైబర్ భద్రత తదితర అంశాలపై పూర్తి వివరాలను అఫిడవిట్‌లో పొందుపరచాలని సుప్రీంకోర్టు కోరింది. కేవలం తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధే ధర్మాసనం ఈ వ్యవహారంపై విచారిస్తోంది. ఎన్‌టీఏలో సంస్కరణలను తాము పర్యవేక్షిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణలో పదేపదే తలెత్తుతున్న సమస్యలకు తాత్కాలిక పరిష్కారాలు కాకుండా వ్యవస్థాగత మార్పులు అవసరమని పేర్కొంది. ఎన్టీయేను సంస్థాగతంగా బలోపేతం చేయాలని, ‘నీట్‌’ పరీక్షల భద్రతకు శాశ్వత కమిటీ అవసరమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. విద్యార్థుల భవిష్యత్తు, విశ్వసనీయత కోసం ఎన్టీయేలో నిర్మాణాత్మక మార్పులు చేయాలని సూచించింది. నీట్-2026 ప్రశ్నపత్రం లీక్ నేపథ్యంలో పరీక్ష రద్దు చేయాల్సి రావడం, విద్యార్థులు ఎదుర్కొన్న ఇబ్బందుల తర్వాత ఎన్టీయే పనితీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎన్టీయేలో శాశ్వత సంస్కరణలు అమలు చేయడంపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *