– పండించిన పంటల అమ్మకం కోసం యాప్
– 4న ప్రారంభించనున్న మంత్రి తుమ్మల
– నేరుగా సేంద్రియ ఉత్పత్తుల కొనుగోలుకు వీలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1: తెలంగాణ వ్యవసాయ రంగంలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. సేంద్రియ సాగు చేస్తున్న రైతులకు అండగా నిలిచేందుకు, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సేంద్రియ ఉత్పత్తుల క్రయవిక్రయాల కోసం రూపొందించిన ప్రత్యేక మొబైల్ యాప్ టిజి ఆర్గానిక్స్ ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈనెల 4న ప్రారంభించనున్నారు. రసాయన ఎరువులు, పురుగు మందులు, జన్యుమార్పిడి పంటలకు స్వస్తి పలికి సహజ వనరులు, సేంద్రియ ఎరువులతో పంటలు పండించడమే సేంద్రీయ వ్యవసాయం. నేటి ఆధునిక కాలంలో అధిక దిగుబడుల కోసం రసాయనాలను విచ్చలవిడిగా వాడుతున్నారు. దీనివల్ల రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరగడమే కాక మనం తినే ఆహారం విషతుల్యమవుతోంది. వాతావరణం కూడా దెబ్బతింటోంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది. చాలామంది రైతులు ఆసక్తితో సేంద్రియ సాగు వైపు మొగ్గుచూపుతున్నప్పటికీ మార్కెట్లో సరైన గుర్తింపు, నాణ్యతా ప్రమాణాలు లేకపోవడం వల్ల వినియోగదారుల్లో నమ్మకం కలగడం లేదు. ఈ సమస్యను అధిగమించేందుకే ప్రభుత్వం యాప్ తీసుకు వస్తోంది. దీని ద్వారా రైతులు పండించిన పంటకు సరైన ధర, వినియోగదారులకు కల్తీలేని ఆహారం లభించనున్నాయి. తెలంగాణ సేంద్రియ సాగులో ఈ యాప్ ఒక నూతన విప్లవానికి నాంది కానుంది. ప్రస్తుతం దాదాపు 500 మంది రైతులు యాప్ లో ఉన్నారు. రాష్ట్రంలోసేంద్రియ ధ్రువీకరణ సేవలు ఇస్తున్న ఇతర రీజినల్ కౌన్సిల్స్ అయిన ఏకలవ్య ఫౌండేషన్, సెంటర్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్ తో ఇతర ఆర్గానిక్ రైతుల వివారాలు కూడా ఈ యాప్ లో పొందుపరచనున్నారు. 100కు పైగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఈ యాప్ లో కస్టమర్లకు అందుబాటులో ఉంచారు. రైతు మొబైల్ నంబర్, చిరునామా, లొకేషన్ వివరాలు పొందవచ్చు. రైతు వద్ద అందుబాటులో ఉన్న ధ్రువీకరించిన వివిధ ఆర్గానిక్ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





