ఎన్నికల నిర్వహణకు రెడీ అవుతున్న ఈసీ

– రేపటినుంచి ఎన్నికల ప్రక్రియ మొదలు
– ‘స్థానిక’ రిజర్వేషన్లపై స్టేకు హైకోర్టు నిరాకరణ ఫలితం
– ప్రభుత్వ ఉత్తర్వులపై రేపు కొనసాగనున్న విచారణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 8: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించడంతో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్‌ 29న గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికకు షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికల ప్రక్రియ ఈనెల 9 నుండి ప్రారంభమై అక్టోబర్‌ 23, 27, అక్టోబర్‌ 31, నవంబర్‌ 4, నవంబర్‌ 8 తేదీల్లో పోలింగ్‌ జరగనుంది. మొదటి నోటిఫికేషన్‌ ఈనెల 9న వెలువడుతుంది. ఇదిలావుండగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల అంశంపై న్యాయపరమైన వివాదం నడుస్తోంది. బీసీలకు రిజర్వేషన్లను 42%కు పెంచుతూ ప్రభుత్వం జీవో 9ను సెప్టెంబర్‌ 26న జారీ చేసింది. దీంతో ఎస్సీ (15%), ఎస్టీ (10%) రిజర్వేషన్లతో కలిపి మొత్తం రిజర్వేషన్లు 67%కి చేరుకున్నాయి. ఇది సుప్రీంకోర్టు విధించిన 50% పరిమితిని ఉల్లంఘిస్తుందని, తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం 2018లోని సెక్షన్‌ 285-ఎని అతిక్రమిస్తున్నదంటూ హైకోర్టులో అనేక రిట్‌ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను సెప్టెంబర్‌ 27న హైకోర్టు హౌస్‌ మోషన్‌ విచారణకు స్వీకరించింది. జీవోపై స్టే ఇవ్వడానికి లేదా సవరించడానికి హైకోర్టు నిరాకరించింది. అయితే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైనప్పటికీ పిటిషన్ల విచారణ కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది. గతంలో హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ గ్రామ పంచాయతీ ఎన్నికలను సెప్టెంబర్‌ 30, 2025లోగా పూర్తి చేయాలని ఆదేశించినప్పటికీ ఆ గడువులోగా ఎన్నికలు జరపకపోతే ఆకాశం పడిపోదు అంటూ ప్రభుత్వం కావాలంటే సమయం పొడిగింపునకు దరఖాస్తు చేసుకోవచ్చని బుధవారంనాటి విచారణ సందర్భంగా హైకోర్టు బెంచ్‌ వ్యాఖ్యానించింది. స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించడంతో ఎన్నికల ప్రక్రియకు మార్గం సుగమమైంది. అయినప్పటికీ బీసీ రిజర్వేషన్ల అంశంపై తుది తీర్పు కోసం రిట్‌ పిటిషన్లను హైకోర్టు విచారిస్తుందని, కోర్టు తుది నిర్ణయానికి ప్రభుత్వం, ఎన్నికల సంఘం కట్టుబడి ఉండాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్లపై తదుపరి విచారణ గురువారం జరగనుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page