మూసీపై ఉన్న ప్రేమ రైతులపై లేదు..

  • రేవంత్ రెడ్డి ఒక ‘డూప్లికేట్ రైతు బిడ్డ’
  • 40 రోజులుగా కల్లాల్లోనే రైతులు.. పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం
  • సర్కారుపై మాజీ మంత్రి హ‌రీష్ రావు నిప్పులు
  • చిన్నకోడూరులో సన్ ఫ్లవర్, ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన
  • యుద్ధప్రాతిపదికన పంటలు కొనుగోలు చేయాలని డిమాండ్

సిద్దిపేట/చిన్నకోడూరు, ప్రజాతంత్ర‌, మే 9 : కాంగ్రెస్ ప్రభుత్వానికి మూసీ పునరుద్ధరణ, ఫ్యూచర్ సిటీ మీద ఉన్న ప్రేమ.. ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతుల మీద లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌ రావు (Harish Rao) మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ‘డూప్లికేట్ రైతు బిడ్డ’ అని, అందుకే రైతుల గోస ఆయనకు పట్టడం లేదని విమర్శించారు. శనివారం సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరు మండలంలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించి, నెలన్నర రోజులుగా పడిగాపులు కాస్తున్న రైతుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తరుగు, నిబంధనల పేరుతో రైతులను దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై హరీష్‌ రావు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు, వడగండ్ల వానలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను గాలికి వదిలేసి నిర్లక్ష్యం చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లపై ఒక్క స‌మీక్ష స‌మావేశం కూడా నిర్వ‌హించ‌లేదు. ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరి కోతలు మొదలవుతున్నాయంటేనే మంత్రులు, అధికారులతో మీటింగ్ పెట్టి సంచులు, లారీలు, పైసలు అన్నీ సిద్ధం చేసి రైతులను కంటికి రెప్పలా కాపాడుకున్నారు.
నేడు ధాన్యం కేంద్రాల్లో నెలన్నర రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్నా ముఖ్యమంత్రికి గానీ, జిల్లా మంత్రులకు గానీ కనీస పట్టింపు లేదు. ఏ ఒక్క మంత్రి అయినా వడ్లు, మక్కలు, శనగలు, సన్ ఫ్లవర్ కొనుగోళ్లపై ఒక్కసారైనా రివ్యూ చేశారా? అని హ‌రీష్ రావు ప్రశ్నించారు. రైతులను ఆదుకోని ప్రభుత్వం ఒక ప్రభుత్వమే కాదు. కాంగ్రెస్ పాలనలో రైతులు ఎరువులు, విత్తనాలు, కరెంటు, రైతుబంధు, సాగునీరు.. ఇలా అన్నింటికీ ఇబ్బందులు పడుతున్నారు. ఆఖరికి పండించిన పంట అమ్ముకోవడానికి కూడా నెలల తరబడి కల్లాల్లోనే పడిగాపులు కాయాల్సిన దుస్థితి. చిన్నకోడూరు ప్రాంతంలో ఎకరాకు 9-10 క్వింటాళ్ల సన్ ఫ్లవర్ పండుతుంటే, కేవలం ఆరున్నర క్వింటాళ్లు మాత్రమే కొంటామని నిబంధన పెట్టారు. తీరా చూస్తే ఆ ఆరున్నర క్వింటాళ్లు కూడా కొనడం లేదు. కేంద్ర ప్రభుత్వ కోటా అయిపోయింది అంటున్నారు. కేంద్రం అయితే ఏంటి? రాష్ట్రం అయితే ఏంటి? రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది కాదా? పొద్దున లేస్తే రేవంత్ రెడ్డి పంటల మార్పిడి చేయండి, వరి తగ్గించండి అంటాడు. మరి రైతులు సన్ ఫ్లవర్, మక్కలు, శనగలు, జొన్నలు వేస్తే ఎందుకు కొనడం లేదు? నువ్వే మార్పిడి చేయమంటావు, మళ్లీ నువ్వే పంట కొనవు.. ఇదేం ద్వంద్వ విధానం. జొన్న పంటను కేసీఆర్ ప్రతి ఏటా కొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక జొన్నలు కొనడం లేదు, సన్ ఫ్లవర్ పూర్తిగా ఆపేశారు. మక్కలకు 26 క్వింటాళ్ల సీలింగ్ పెట్టి, ఆ మేరకైనా కొంటున్నారా అంటే అదీ లేదు. సంచులు లేవు మీరే తెచ్చుకోండి అని రైతులను వేధిస్తున్నారు. రైతులకు సంచులు సరఫరా చేసే తెలివి లేదు గానీ, 69 సార్లు ఢిల్లీ పోయి మూటలు మోయడానికి మాత్రం రేవంత్ రెడ్డికి టైమ్ ఉంటుంది. మూడు పంటలకు రైతుబంధు ఎగ్గొట్టారు. వడ్లు కొనరు, యూరియా అడిగితే యాప్ పేరుతో ఆల‌స్యం చేస్తున్నార‌ని హ‌రీష్ రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
వడ్లను రైస్ మిల్లులు తీసుకోవడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో తరుగు పెడుతున్నారు. బీ-గ్రేడ్ పేరుతో ఎకరాకు రూ. 700 రైతులు నష్టపోతున్నారు. బస్తాకు కిలో తరుగు, అటు రైస్ మిల్లుల్లో కటింగ్స్.. ఇలా రెండు రకాలుగా రైతులను దోచుకుంటున్నారు. సన్న వడ్లకు బోనస్ ఇస్తామని నమ్మించి, తీరా ఇప్పుడు యాసంగి పంటకు బోనస్ లేదని మొండిచెయ్యి చూపారు. ఒకవైపు బోనస్ ఎగ్గొట్టారు, మరోవైపు బీ-గ్రేడ్, తరుగు పేరుతో రైతులను నిలువునా దగా చేస్తున్నారు.

40 రోజులుగా పొద్దుతిరుగుడు పంట‌ను కొన‌డం లేదు..

చిన్నకోడూరులో సన్ ఫ్లవర్ కొనడం ఆపి 40 రోజులైంది. కుప్పల కింద చెదలు పట్టి పంట పాడవుతోంద‌ని హ‌రీష్ రావు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మద్దతు ధర రూ. 7,720 కాగా, ప్రైవేట్ వ్యాపారులు రూ. 5,000 కు అడుగుతున్నారని అన్నారు. బయట అమ్ముకుంటే రైతు ఎకరాకు రూ.27,000 నష్టపోతున్నార‌ని, మీ రైతుబంధు లేక, మద్దతు ధర రాక రైతులు అప్పుల పాలవుతున్నారని తెలిపారు. . సిద్దిపేట మార్కెట్ యార్డ్ కు గత నాలుగు రోజులుగా తాళం వేశారు. లోపల నిల్వలు పేరుకుపోయాయి, లారీలు లేవని వడ్లు, మక్కలు లోపలికి రానివ్వడం లేదు. నాలుగు రోజులుగా లారీలు పెట్టలేదు. ఈ ప్రభుత్వంలో ఒక రైతు పంట అమ్ముకోవాలంటే.. తేమ చూడ్డానికి వారం, సంచుల కోసం వారం, కాంటాకు వారం, లారీలకు వారం, మిల్లులో దించుకోడానికి వారం ప‌డుతోంది. ఇలా కల్లాల దగ్గరే నెల రోజులు పడిగాపులు కాయాలా? ఇంటి దగ్గర బర్రెలు, ఎడ్లు, వ్యవసాయం ఎవరు చూసుకోవాలి? ఆఖరికి అలిసిపోయిన రైతు మీరు పెట్టిన తరుగుకు ఒప్పుకుని అప్పుల పాలవుతున్నాడ‌ని అన్నారు. మాటల్లో మందం డైలాగులు కొట్టే రేవంత్ రెడ్డి.. డూప్లికేట్ రైతు బిడ్డ అని, ఆయ‌న‌నిజంగా రైతు బిడ్డే అయితే రైతులను ఎరువుల కోసం ఇలా లైన్లలో నిలబెడ‌తావా అని ప్ర‌శ్నించారు. . వడ్లతో పాటు సన్ ఫ్లవర్, జొన్నలు, మక్కలు, శనగలు తక్షణమే యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర అందించాలని హ‌రీష్ రావు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *