– జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్ర మంలో భాగంగా ఈనెల 18 నుండి 23వ తేదీ వర కు నిర్వహించే యువజన, క్రీడా, పర్యాటక వారోత్సవాలను విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈకార్యక్రమాల నిర్వహణపై స్పెషల్ సీఎస్ లు జయేష్ రంజన్, వాణి ప్రసాద్ లతో కలసి సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో శనివారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో క్రీడా స్ఫూర్తి, దేహదారుఢ్యం, సామాజిక చైతన్యం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకై ఈ కార్యక్రమాలను చేపట్టినట్టు తెలిపారు. అదేవిధంగా పర్యాటక ప్రాంతాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం కల్పించాలని, పర్యాటక ప్రాంతాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం కల్పించాలని, పర్యాటక ప్రాంతాలను ప్రజలు సందర్శించేలా తగు చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రధానంగా స్పోర్ట్స్ కార్యక్రమాలను రాష్ట్ర, జిల్లా, మండలస్థాయిలో నిర్వహించాలన్నారు. ప్రతీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, యువజన సంఘాలను భాగస్వామ్యం చేయాలన్నారు. ఈనెల 18న నిర్వహించే ‘ఫిట్- తెలంగాణ థీమ్‌తో రాష్ట్ర, జిల్లా కేంద్రాలలో 5కె రన్, అన్ని మండల కేంద్రాలలో వాకథాన్, యోగ తదితర కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఈ వారోత్సవాలు దోహదపడతాయని, దీనిలో భాగంగా ఈ వారం రోజులు ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని మ్యూజియంలలో ఉచిత ప్రవేశం కల్పించనున్నట్టు వెల్లడించారు. అదేవిధంగా జిల్లాల్లో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లపై కూడా కలెక్టర్లతో సమీక్షించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోళ్లలో ఎక్కడా జాప్యం లేకుండా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని వారిని ఆదేశించారు.
వారోత్సవాల షెడ్యూల్
ఈ ఆరు రోజుల కార్యక్రమాలలో యువజన సంఘాలు, క్రీడాకారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, సాధారణ ప్రజలు విస్తృతంగా పాల్గొని విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వారంరోజుల షెడ్యూల్ ఇలా ఉంది.
18న ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ
వారోత్సవాలకు తొలి రోజు ‘ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా మారథాన్‌లు, వాక్‌థాన్‌లు, యోగా, ధ్యానం, ఏరోబిక్స్, జుంబా కార్యక్రమాలు నిర్వహిస్తారు. హైదరాబాద్‌లోని ఎల్.బి. స్టేడియంలో 5 కి.మీ మారథాన్, జిల్లా కేంద్రాల్లో మారథాన్‌లు, మండల కేంద్రాల్లో వాక్‌థాన్‌లు, వెల్‌నెస్ కార్యక్రమాలు చేపడతారు.
19న కెరీర్ అండ్ నైపుణ్యాభివృద్ధి దినోత్సవం
రెండో రోజు యువతకు నైపుణ్యాభివృద్ధి కోర్సులు, స్పోర్ట్స్ యూనివర్సిటీ అవకాశాలు, స్కిల్ యూనివర్సిటీ ప్రోగ్రాములు, అగ్నివీర్ నియామకాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలలో వర్చువల్ సెషన్‌లు నిర్వహిస్తారు.
20న యువజన నాయకత్వ సమ్మేళనం
యువతలో నాయకత్వం, సృజనాత్మకత, సామాజిక అవగాహన పెంపొందించే లక్ష్యంతో ‘యూత్ లీడర్‌షిప్ సమ్మిట’ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా విద్యాసంస్థలు, యువజన సంఘాల భాగస్వామ్యంతో యువజన పార్లమెంట్ సమావేశాలు, సామాజికాభివృద్ధి అంశాలపై చిత్రలేఖన పోటీలు జరుగుతాయి.
21న ‘ప్లే అండ్ పార్టిసిపేట్ స్పోర్ట్స్ డే’
క్రీడల్లో సామూహిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు జిల్లా యువజన, క్రీడాధికారుల పర్యవేక్షణలో వివిధ క్రీడా, వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాష్ట్రస్థాయిలో కూడా నగరంలోని వివిధ స్టేడియాల్లో క్రీడా కార్యక్రమాలు జరిగేలా ఏర్పాటు చేస్తున్నారు.
22 న ‘సర్వ్ అండ్ సపోర్ట్ – క్లీన్ తెలంగాణ కోసం యువత’
యువతలో సామాజిక బాధ్యతను పెంపొందించే భాగంగా యువజన స్వచ్ఛంద సేవకులు, ఎన్‌జీవోలు, క్రీడాకారులు, ప్రజాప్రతినిధులతో కలిసి క్రీడా మైదానాలు, పార్కులు, చెరువులు, ఓపెన్ ప్రదేశాలు, ప్రజా స్థలాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపడతారు.
23న ‘ఉద్యోగ సాధన- అవకాశాలతో యువతకు అనుసంధానం’
వారోత్సవాల చివరి రోజు యువతకు ఉపాధి, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అదేవిధంగా ఇటీవల వివిధ జిల్లాల్లో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమాల్లో ఉద్యోగాల ఎంపికైన వారికి ఆయా కంపెనీల నుండి నియామకాల పత్రాలు అందజేస్తారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను సత్కరించడం కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఉంటుంది. కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన వేదికలు, తాగునీరు, సౌండ్ సిస్టమ్, కూర్చునే ఏర్పాట్లు తదితర సౌకర్యాలు కల్పించనున్నారు. యువత, విద్యార్థులు, క్రీడా సంఘాలు, ఎనఎసఎస్, ఎన్‌సీసీ వలంటీర్లు, ప్రజలు ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని విజయవంతం చేయాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





