ఉమ్మ‌డి ఖ‌మ్మంకు గోదావ‌రి జ‌లాలు అందించ‌డ‌మే ల‌క్ష్యం

– గిరిజన కుటుంబాల ఆదాయం పెర‌గాలి
– అప్పుడే పిల్లల భవిష్యత్తు ఉజ్వలం
– మరో 10 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరిస్తే పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు
– ఆయిల్ పామ్ సాగు రైతుల ఆర్థిక స్థిరత్వానికి పునాది
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

దమ్మపేట/ ములకలపల్లి, ప్రజాతంత్ర, జూలై 21 : ములకలపల్లి మండలంలో మంగళవారం నిర్వహించిన ఆయిల్ పామ్ రైతుల ఆత్మీయ సమ్మేళనంలో వ్యవసాయ, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా, జిల్లా కలెక్టర్ అంకిత్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయిల్ పామ్ సాగు విస్తరణ, ఎల్‌నినో పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, నీటి సంరక్షణ, గోదావరి జలాల వినియోగం తదితర అంశాలపై రైతులకు దిశానిర్దేశం చేశారు.మంత్రి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గిరిజనులకు రహదారులు, తాగునీరు, విద్యుత్, వైద్యం, విద్య వంటి మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు, ప్రతి మండలంలో గురుకులాలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. గిరిజన పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి కలెక్టర్లు, ఉన్నతాధికారులుగా ఎదగాలని ఆకాంక్షించారు.అడవుల విస్తీర్ణం తగ్గిపోవడంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని, అడవి జంతువులు గ్రామాల్లోకి వస్తున్నాయని పేర్కొన్నారు. మర్రి, వెదురు, చింత వంటి స్థానిక జాతుల మొక్కలను విస్తృతంగా నాటి అడవులను పరిరక్షించాలని, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.సూపర్ ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో ఇప్పటికే 35 శాతం వర్షపాతం లోటు నమోదైందని, భూగర్భ జలాలు కూడా తగ్గుముఖం పట్టాయని తెలిపారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కూడా సాధారణం కంటే 20 నుంచి 30 శాతం వరకు తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున బోర్లపై ఆధారపడి వరి సాగు చేయకుండా తక్కువ నీటి అవసరం ఉన్న ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.పెసర, మినుము, కంది, అలసంద వంటి అపరాల సాగును విస్తరించాలని కోరారు. పత్తి సాగు చేసే రైతులు ప్రతి నాలుగు లేదా ఆరు వరుసలకు ఒక వరుస కందిని అంతర పంటగా సాగు చేస్తే అదనపు ఆదాయం లభించడంతో పాటు భూమి సారం పెరుగుతుందని తెలిపారు.ములకలపల్లి మండలంలో ప్రస్తుతం 8 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని, మరో 10 వేల ఎకరాల్లో సాగు విస్తరిస్తే వెంటనే పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తామని మంత్రి ప్రకటించారు. పోడు భూముల్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి సౌర విద్యుత్ సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఆయిల్ పామ్‌తో పాటు మునగ, పప్పుధాన్యాలను అంతర పంటలుగా సాగు చేస్తే అదనపు ఆదాయం లభించడంతో పాటు భూమి సారం పెరుగుతుందని చెప్పారు. ప్రపంచ మార్కెట్లో మునగ ఆకుకు మంచి డిమాండ్ ఉన్నందున రైతులు ఆదాయాన్ని పెంచే పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగు రైతుల ఆర్థిక స్థిరత్వానికి బలమైన పునాదిగా నిలుస్తుందని అన్నారు గిరిజన గ్రామాల్లో ప్రతి కుటుంబానికి సురక్షిత తాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. గిరిజన కుటుంబాల ఆదాయం పెరిగితేనే వారి పిల్లల భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉంటుందని చెప్పారు. గురుకులాలు, ఏకలవ్య పాఠశాలల్లో అందుబాటులో ఉన్న విద్యా అవకాశాలను గిరిజన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టడం నేటి అవసరమని , ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి రైతు తన పొలంలో ఫామ్ పాండ్ నిర్మించుకుని వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలని సూచించారు. దీంతో భూగర్భ జలాలు పెరిగి భవిష్యత్తులో వ్యవసాయానికి ఉపయోగపడతాయని తెలిపారు.సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను జిల్లాలోని అన్ని ప్రాంతాలకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. యాతాలకుంట టన్నెల్ పనులు పూర్తయిన వెంటనే సీతారామ ప్రాజెక్టు ద్వారా చెరువులను నింపనున్నామని తెలిపారు.డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణానికి రైతులు సహకరిస్తే పనులు వేగంగా పూర్తిచేసి ప్రతి రైతు పొలానికి గోదావరి జలాలు అందిస్తామని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు గోదావరి జలాలు అందించడమే తన జీవిత లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షపాతం గణనీయంగా తగ్గిందని, సూపర్ ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ, ఉద్యానవన, నీటిపారుదల, విద్యుత్, పశుసంవర్ధక, మిషన్ భగీరథ తదితర శాఖల సమన్వయంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నామని తెలిపారు.జిల్లాలో ప్రస్తుతం 90 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని, ఈ ఏడాది కొత్తగా 15 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా నిర్దేశించామని తెలిపారు. వరికి బదులుగా మొక్కజొన్న, మిర్చి, ఆయిల్ పామ్, కూరగాయలు, పప్పుధాన్యాలు వంటి తక్కువ నీటి అవసరం ఉన్న పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.ఆయిల్ పామ్ నాలుగో సంవత్సరం నుంచి దిగుబడిని ఇవ్వడం ప్రారంభించినప్పటికీ, సుమారు 30 సంవత్సరాల పాటు రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందించే పంటగా నిలుస్తుందని తెలిపారు. ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని కలెక్టర్ వివరించారు.అనంతరం ఆత్మనిర్భర్ మిషన్ అపరాల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం కంది, మినుము విత్తనాలను 50 శాతం రాయితీపై అందిస్తున్నదని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి, జిల్లా కలెక్టర్ రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. రైతులు సమీప వ్యవసాయ అధికారులు లేదా వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు, ఆయిల్ పామ్ సంస్థ ప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *