నీట్ 2026.. పదేళ్ల వైఫల్యం..!

దేశ భవిష్యత్తుకు వెన్నెముకగా నిలవాల్సిన యువత కలలు నేడు నడిరోడ్డుపై వేలం వేయబడుతున్నాయి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ‘నీట్’ (NEET 2026) పరీక్షా పత్రం లీక్ కావడం కేవలం ఒక పాలనాపరమైన వైఫల్యం మాత్రమే కాదు; ఇది దేశ విద్యా వ్యవస్థపై జరుగుతున్న వ్యవస్థీకృత దాడి. పరీక్షకు 42 గంటల ముందే వాట్సాప్ గ్రూపుల్లో ప్రశ్నపత్రాలు ప్రత్యక్షం కావడం చూస్తుంటే, ఇది ఒక అర్హత పరీక్షలా కాకుండా, అత్యధిక ధరకు ప్రశ్నలను అమ్ముకునే ‘వేలం పాట’ను తలపిస్తోంది.

ఈ ఏడాది సుమారు 22 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష కోసం సిద్ధమయ్యారు. రెండేళ్ల పాటు నిద్రలేని రాత్రులు గడుపుతూ, వినోదాలకు దూరంగా ఉంటూ, కళ్లల్లో వత్తులు వేసుకుని చదివిన ఆ విద్యార్థుల శ్రమకు విలువ ఏది? మధ్యతరగతి, పేద కుటుంబాల తల్లిదండ్రులు తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలని కడుపు కట్టుకుని కూడబెట్టిన సొమ్ము కోచింగ్ సెంటర్ల పాలవుతుంటే, చివరి నిమిషంలో లీకేజీల రూపంలో వారి కలలను అపహాస్యం చేయడం అత్యంత దారుణం…రాత్రంతా కష్టపడి చదివిన విద్యార్థి కంటే, రాత్రికి రాత్రే లక్షల రూపాయలు కుమ్మరించి ప్రశ్నపత్రం కొనుక్కున్న వ్యక్తి వైద్య సీటును పొందడం  ఈ దేశ మెరిట్ వ్యవస్థకే మాయని మచ్చ.

గడచిన పదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వొస్తున్నాయి. ఈ పదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా వివిధ పరీక్షలలో 89 సార్లు పేపర్ లీక్ ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటి ఫలితంగా 48 సార్లు పునః పరీక్షలు నిర్వహించాల్సి వొచ్చింది. ప్రతిసారీ పేపర్ లీక్ అయినప్పుడు ప్రభుత్వం “కఠిన చర్యలు తీసుకుంటాం”, “దోషులను వదిలిపెట్టం” అని ప్రకటనలు ఇవ్వడం, ఆ తర్వాత నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అలవాటుగా మారింది.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వంటి స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలు ఉండీ, అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రశ్నపత్రాలు ఎలా బయటకు వస్తున్నాయి? ఇది కేవలం కింది స్థాయి సిబ్బంది లోపం మాత్రమే కాదు; వ్యవస్థలోని ఉన్నత స్థాయి వ్యక్తుల ప్రమేయం లేకుండా ఇంత భారీ స్థాయిలో లీకేజీలు జరగడం అసాధ్యం.

దేశ యువత కలలను చిధ్రం చేస్తున్న ఈ వ్యవస్థీకృత నేరాలపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మౌనం వహించడం శోచనీయం. యువతకు ఉపాధి కల్పిస్తామని, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని హామీలు ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. భారతదేశ యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు నేడు బయటి శక్తుల కంటే, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వ యంత్రాంగమే అని చెప్పక తప్పదు.

పరీక్షల నిర్వహణలో పారదర్శకత లేకపోవడం, దోషులపై తక్షణ శిక్షలు పడకపోవడం వల్లనే ఇటువంటి ముఠాలు రెచ్చిపోతున్నాయి. విద్యను ఒక వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ విద్యా సంస్థలు, మాఫియా శక్తుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనాలను పణంగా పెడుతోందా? అన్న అనుమానాలు సామాన్య ప్రజల్లో బలపడుతున్నాయి.

22 లక్షల మంది విద్యార్థుల నమ్మకం ఈ రోజు ముక్కలైపోయింది. ఈ వ్యవస్థపై వారికి మళ్లీ విశ్వాసం కలగాలంటే కేవలం విచారణలు సరిపోవు. ఎన్ టి ఏ ఉన్నతాధికారుల నుంచి విద్యాశాఖ మంత్రి వరకు బాధ్యత వహించాలి.పేపర్ లీకేజీలకు పాల్పడే వారిపై ఉగ్రవాద వ్యతిరేక చట్టాల తరహాలో కఠినమైన శిక్షలు అమలు చేయాలి. డిజిటల్ భద్రతను పటిష్టం చేయడంతో పాటు, పరీక్షా విధానంలో సమూల మార్పులు తీసుకురావాలి.

ఇది కేవలం కొందరు విద్యార్థుల సమస్య కాదు; ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించిన అంశం. అక్రమ మార్గాల్లో వైద్య సీట్లు పొందిన వారు రేపు సమాజానికి ఎటువంటి సేవలు అందిస్తారో ఊహించడానికే భయమేస్తుంది. ఈ క్లిష్ట సమయంలో దేశం మొత్తం విద్యార్థుల పక్షాన నిలబడాలి. ప్రభుత్వం తన మౌనాన్ని వీడి, తక్షణమే న్యాయం చేయాలి. వ్యవస్థ ఎప్పుడూ ఇలాగే ఉండదు. యువత ఆక్రందనల నుండి పుట్టే ఆగ్రహం తప్పకుండా మార్పుకు దారితీస్తుంది. అందరం కలిసికట్టుగా పోరాడి, విద్యా వ్యవస్థను ఈ మాఫియా కోరల నుండి రక్షించుకోవాలి. విద్యార్థుల శ్రమకు వేలం పాట ఉండకూడదు; అది కేవలం మెరిట్ ఆధారంగానే గౌరవించబడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *