ముఖం చాటేసిన నైరుతి

– దేశవ్యాప్తంగా వర్షాల కోసం ఎదురుచూపు
– ఏరువాక సాగక రైతన్న ఆందోళన

న్యూదిల్లీ, జూన్‌ 29 :‌ దేశంలో నైరుతి రుతుపవనాలు జూన్‌ 4‌న కేరళ తీరాన్ని తాకినప్పటికీ, దేశంలోని చాలాప్రాంతాలు ఇంకా వర్షాల కోసం వేచి చూస్తున్నాయి. గత 146 ఏండ్ల వాతావరణ చరిత్రలో ఈ జూన్‌ ‌నెల అత్యంత పొడిగా నమోదైన నెలల్లో ఒకటిగా నిలిచిందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు.
మొత్తంగా దేశంలో నైరుతి రుతుపవనాలు మళ్లీ ముఖం చాటేశాయి. జూన్‌ 4 ‌నుంచి 28 మధ్య సాధారణంగా 141.4 ఎంఎం వర్షం కురవాల్సి ఉండగా ఈసారి 77.1 ఎంఎం వర్షపాతమే నమోదైంది. కదిలే మేఘాలు ఈశాన్య రాష్ట్రాలు, బంగ్లాదేశ్‌ ‌సరిహద్దు ప్రాంతాలు, దక్షిణ-మధ్య అరేబియా సముద్రానికే పరిమితమయ్యాయి. భారత వాతావరణ శాఖ విడుదల చేసిన వర్షపాతం పటం రుతుపవనాల అస్థిర ప్రభావాన్ని తెలియజేస్తున్నది. గుజరాత్‌ 86 ‌శాతం వర్షపాత లోటుతో ఉండగా, మహారాష్ట్రలో 60 శాతం లోటు నమోదైంది. మధ్యప్రదేశ్‌ ‌లో 42 శాతం, యూపీలో 59 శాతం, బీహార్‌లో 52 శాతం, ఒడిశాలో 53 శాతం, తెలంగాణలో 32 శాతం, కర్ణాటకలో 47 శాతం వర్షపాత లోటు రికార్డయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ.. ఎల్‌ ‌నినో ప్రభావం వల్ల చాలాప్రాంతాల్లో చినుకుజాడ కరువైంది. వానకాలం సాగుపై రైతుల్లో ఆందోళన పెరుగుతున్నది. 15 ‌నాటికి దేశంలోని దక్షిణ, తూర్పు, ఈశాన్య ప్రాంతాలకు విస్తరించిన రుతుపవనాలు, తర్వాత స్తంభించిపోయాయి. దేశంలోని చాలాప్రాంతాల్లో 40 శాతం తక్కువ వర్షపాతం నమోదయ్యింది. జూన్‌ ‌నెల లోటును భర్తీ చేయడానికి కొంత సమయం పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. వాతావరణంలో తేమ శాతం పెరగడం, సుదీర్ఘ పొడికాలం తర్వాత అకస్మాత్తుగా కురిసే భారీ వర్షాలు, వరదలు వంటి తీవ్ర వాతావరణ పరిస్థితులు భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణకు హైదరాబాద్‌ ‌వాతావరణశాఖ రెయిన్‌ అలర్ట్ ‌జారీ చేసింది. ఆదిలాబాద్‌, ‌నిర్మల్‌, ‌నిజామాబాద్‌, ‌జగిత్యాల, కామారెడ్డి, మెదక్‌, ‌రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, ‌నాగర్‌కర్నూల్‌, ‌మహబూబాబాద్‌, ‌వరంగల్‌, ‌హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో మహబూబాబాద్‌ ‌జిల్లా మరిపెడలో 8.35 సెం., కరీంనగర్‌ ‌జిల్లా రామడుగులో 6.94 సెం., కరీంనగర్‌ ‌రూరల్‌లో 6.15 సెం., జగిత్యాల జిల్లా వెల్గటూర్‌లో 5.20 సెం., మెట్‌పల్లిలో 4.31 సెం., కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌లో 5.20 సెం., సూర్యాపేట జిల్లా మద్దిరాళ్లలో 4.09 సెం.. చొప్పున వర్షపాతం నమోదయినట్టు అధికారులు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *