వరంగల్ అభివృద్ధిపై మోదీకి ప్రత్యేక ప్రేమ

– రూ.17 వేల కోట్లతో మహా నగరంగా అభివృద్ధి
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

వరంగల్, ప్రజాతంత్ర, జూన్ 29 : రాష్ట్రంలో బీజేపీ ఎన్నడూ అధికారంలో లేకపోయినా వరంగల్ నగరమన్నా, ఇక్కడి ప్రజలన్నా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేకమైన ప్రేమ, గౌరవం ఉన్నాయని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు, వరంగల్‌కు ఏమి చేసిందని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులకు ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు. నగరంలో జరిగిన బూత్‌స్థాయి కార్యకర్తల సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. పదేళ్లు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ వరంగల్ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. ఇక్క‌డ‌ బీజేపీకి ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకపోయినా మోదీ ప్రభుత్వం వరంగల్ రూపురేఖలను మార్చడానికి సుమారు రూ.17వేల కోట్లను మంజూరు చేసిందని వివరించారు. ఈ అభివృద్ధిపై వరంగల్ చౌరస్తాలోని అమరవీరుల స్థూపం వద్దకైనా లేదా అంబేద్కర్ చౌరస్తాకైనా తాము బహిరంగ చర్చకు సిద్ధమని, తమ పార్టీ శ్రేణులు పూర్తి వివరాలతో వస్తారని కాంగ్రెస్, బీఆర్ఎస్ అధినాయకత్వాలకు కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. వరంగల్ అభివృద్ధికి సంబంధించి మోదీ ప్రభుత్వం చేసిన పనుల పూర్తి వివరాలను గణాంకాలతో బహిర్గతం చేశారు. ఎప్పటికీ రాదనుకున్న కాజీపేట రైలు కోచ్ ఫ్యాక్టరీని మోదీ ప్రభుత్వం వరంగల్‌కు తీసుకొచ్చిందని, ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయిన ఈ ఫ్యాక్టరీలో వచ్చే ఏడాది జనవరి నాటికి కోచ్‌ల తయారీ ప్రారంభం కానుందని తెలిపారు. అలాగే 30 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న రైల్వే టెర్మినల్ పనులకు వచ్చే నెలలోనే శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు. వరంగల్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పూర్తి కాగా ప్రధాని ప్రారంభించారని, కాజీపేట-బల్లార్షా మూడో లైన్ కోసం రూ.2,909 కోట్లు మంజూరు చేయడంతోపాటు కాజీపేట-విజయనగరం మూడో లైన్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. వరంగల్ విమానాశ్రయం త్వరలోనే ప్రారంభం కానుందని, అందులో ప్రయాణించే తొలి ప్యాసింజర్‌గా తాను ఉంటానని కిషన్ రెడ్డి ప్రకటించారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా దేశవ్యాప్తంగా కేంద్రం మంజూరు చేసిన ఏడు మెగా టెక్స్‌టైల్ పార్కులలో ఒకదాన్ని వరంగల్‌కు కేటాయించామని, అలాగే వేల కోట్ల వ్యయంతో నిర్మించనున్న సమ్మక్క-సారక్క గిరిజన విశ్వవిద్యాలయానికి ఈ ఏడాదిలోనే ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా భూమి పూజ చేయనున్నారని తెలిపారు. వీటితోపాటు జిల్లాకు 110 ఎకరాల విస్తీర్ణంలో 77 పీఎం శ్రీ పాఠశాలలు, ఒక ఎంఎసఎంఈ టెక్నాలజీ సెంటర్ మంజూరయ్యాయని వెల్లడించారు. నగరంలో అత్యుత్తమ వైద్యం కోసం రూ.108 కోట్లతో ఒక క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణం పూర్తి కాగా మరో రూ.130 కోట్లతో ఇంకొక క్రిటికల్ కేర్ బ్లాక్ పనులు జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్-వరంగల్, వరంగల్-కరీంనగర్ జాతీయ రహదారులను అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నామని, దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ సిమెంట్ రోడ్ల కోసం రూ.999 కోట్లు మంజూరు చేయగా, వరంగల్-కరీంనగర్ మధ్య రూ.1,250 కోట్ల పనులు జరుగుతున్నాయన్నారు. రూ.500 కోట్లతో వరంగల్ రింగ్ రోడ్డు 50 శాతం పనులు పూర్తయ్యాయని, నగర రవాణా కోసం 50 కొత్త బస్సులను కూడా కేంద్రం మంజూరు చేసిందని చెప్పారు. స్మార్ట్ సిటీ మిషన్అ, ర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద వేల కోట్లతో వరంగల్ సుందరీకరణ, రోడ్లు, డ్రైనేజీ పనులు జరుగుతున్నాయ ని, రూ.1,380 కోట్లతో 70 ప్రాజెక్టులు పూర్తి కాగా రూ.414 కోట్లతో మరో 40 ప్రాజెక్టుల పనులు ప్రగతిలో ఉన్నాయని తెలిపారు. పీఎం కిసాన్ నిధి కింద ఈ జిల్లా రైతులకు ఇప్పటివరకు రూ.1,841 కోట్ల ఆర్థిక సాయం నేరుగా ఖాతాల్లోకి చేరిందని, రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ల కోసం కేంద్రం ఖర్చు చేసిన రూ.70వేల కోట్లలో సింహభాగం వరంగల్ రైతులకు అందిందని వివరించారు. ఈ ఒక్క ఏడాదిలోనే పత్తి కొనుగోళ్లకు రూ.16,550 కోట్లు కేంద్రం వెచ్చించిందని గుర్తు చేశారు. ఉమ్మడి జిల్లాలోని రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తెచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. విదేశీ దండయాత్రల్లో ధ్వంసమైన వెయ్యి స్తంభాల గుడిలోని 100 స్తంభాల కళ్యాణ మండపాన్ని ఏపీ, చెన్నైల నుంచి ప్రత్యేకంగా రాళ్లు తెప్పించి, శిల్పులతో అద్భుతంగా పునర్నిర్మించామని, మేడారం, ములుగు, లక్నవరం, బొగత జలపాతం వంటి పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం 100 శాతం నిధులు ఇస్తోందని చెప్పారు. గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని మండిపడిన కిషన్ రెడ్డి వరంగల్ సమగ్రాభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి మేయర్ పీఠాన్ని అందించి ఆశీర్వదిస్తే వరంగల్ కు మరిన్ని నిధులు తెస్తానని కిషన్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *