తెలంగాణలో విస్తరించిన నైరుతి రుతుపవనాలు

– వారంపాటు జోరు వర్షాలు పడే అవకాశం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24 : నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు తెలంగాణ అంతటా విస్తరించడంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. వారం రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాలు ఆలస్యం కావడంతో నారు వేసుకోవడం ఆలస్యం అవుతోందని రైతులు ఆందోళనలో ఉన్నారు. ఫసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఉష్ణ పరిస్థితుల వల్ల ఈ ఏడాది కాస్త మందకొడిగా సాగిన పవనాలు ఈనెల 8న రాష్ట్రాన్నిన్ని తాకినప్పటికీ తెలంగాణను పూర్తిగా ఆవరించడానికి దాదాపు 15 రోజుల సమయం తీసుకున్నాయి. ఈ ప్రభావంతో సోమవారం నుంచి మంగళవారం వరకు పలు జిల్లాల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం కూనారంలో ఏకంగా 17.1 సెం.మీ ల వాన పడింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఇదే అత్యధికం కావడం విశేషం. హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవగా రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, శంషాబాద్ మండలాల్లో వానలు దంచికొట్టాయి. వీటితోపాటు సంగారెడ్డి, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, జగిత్యాల, ములుగు, ఆదిలాబాద్ జిల్లాల్లో మంగళవారం పగటిపూట కూడా వర్షాలు ఊపందుకున్నాయి. బుధ, గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వానలు జోరుగా పడనున్నాయి. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 26న ఈ ప్రాంతాలతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడతాయని అధికారులు స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *