– రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాం
– ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలి
– బీహార్, బెంగాల్ తరహాలో ఇక్కడా ‘సర్’తో ప్రమాదం
– కేసీఆర్ చేసిన అప్పులకు ఏటా రూ. 76 వేల కోట్లు కడుతున్నాం
– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
వైరా, ప్రజాతంత్ర, జూన్ 24 : ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నామని, ప్రతి వ్యక్తికీ సంక్షేమ పథకాలను అందించాలన్న దృఢ సంకల్పంతో పనిచేస్తున్నదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. వైరాలోని తన క్యాంప్ కార్యాలయంలో కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ పాలన అంటే కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన నలుగురు మనుషుల దోపిడీ కాదని అన్నారు. పాలన అంటే రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజల సంక్షేమం గురించి, వారి భవిష్యత్తు గురించి నిరంతరం ఆలోచించేదన్నారు. ఆ బాధ్యతాయుతమైన పాలనను ఈరోజు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం అందిస్తోందన్నారు. కాగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నేతృత్వంలో ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పట్ల పార్టీ కార్యకర్తలు, బీఎ ల్‌ఏలు, ప్రజలు అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. అన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా నమోదు, సవరణలు, మ్యాపింగ్ ప్రక్రియపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ల కాలంలో ఎన్నికల ప్రక్రియలో వస్తున్న మార్పులను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. గతంలో ఓటర్ల నమోదు, చేర్పుల ప్రక్రియ సంప్రదాయ పద్ధతిలో సాగేదని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియా విస్తృతి పెరిగిందని పేర్కొన్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, నాయకుడికి వాట్సాప్ గ్రూపులు, ఇన్‌స్టాగ్రామ్, రీల్స్ వంటి సామాజిక మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయని, ఏఐ ద్వారా నాయకుల అభిమానులు, కార్యకర్తల వివరాలను సేకరించి ప్రతి ఒక్క ఓటును సరిచూసేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థ (సాఫ్ట్‌వేర్/డేటా మేనేజ్‌మెంట్) పనిచేస్తోందని తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా గ్రామాలు, వార్డుల వారీగా ఉన్న ఓటర్ల పూర్తి వివరాలను సేకరించి వారి ఓట్లు తొలగించే ప్రక్రియ కొనసాగుతుందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఇలాంటి వ్యవస్థల ద్వారా ఓటర్ల వివరాలను పక్కాగా క్రోడీకరించారంటూ ఒక్కో నియోజకవర్గం లో 30 నుంచి 40 వేల ఓట్లను ‘సర’ ద్వారా తొలగించడంతో అభ్యర్థుల గెలుపోటములు తారుమారయ్యాయని ఆయన చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థులు, స్థానిక నాయకులు తమ పరిధిలోని ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా అన్‌మ్యాపింగ్ జాబితాలో ఉండిపోయిన ఓటర్ల వివరాలను సేకరించి వారికి ఓటు హక్కు కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ‘వార్డులు, డివిజన్లు, గ్రామాల వారీగా పూర్తి వివరాలు, పొరపాట్లు లేకుండా ఉన్న ఓటర్ల జాబితా ఒకవైపు సిద్ధమవుతోంది.. సాంకేతిక కారణాల వల్లగానీ, లేదా వివరాలు సరిగా నమోదు కాకపోవడం వల్లగానీ ఇంకా అన్‌మ్యాపింగ్‌లోనే ఉండిపోయిన ఓటర్ల వివరాలను కూడా వేరు చేసి పరిశీలిస్తున్నారు.. మ్యాపింగ్ అయిన జాబితాతోపాటు అన్‌మ్యాపింగ్ చేసిన లిస్టులో కూడా ఎవరెవరి పేర్లు ఉన్నాయో స్పష్టంగా తెలుసుకోవాలి.. ఏ ఒక్క అర్హుడైన ఓటరు కూడా తన ఓటు హక్కును కోల్పోకుండా చూడటమే మన లక్ష్యం’ అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే బీఎలఏలు గందరగోళానికి గురికాకుండా స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి కూర్చుని చర్చించాలన్నారు. ప్రతి ఒక్క ఓటరు డేటాను సేకరించి, అన్ని వివరాలను సరిచూసుకోవాలని చెప్పారు.
సంక్షేమ రాజ్యం.. ప్రజా ప్రభుత్వ లక్ష్యం
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమమే పరమావధిగా ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి చెప్పారు. గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన అడ్డగోలు అప్పుల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ ప్రజా శ్రేయస్సు దృష్ట్యా సంక్షేమంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పారు. నాటి అప్పులకు నేడు ప్రజా ప్రభుత్వం అసలు, వడ్డీతో కలిపి ఏడాదికి రూ.76 వేల కోట్లను కడుతోందని తెలిపారు. దశాబ్దాల కిందట నిర్మించిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఇప్పటికీ అత్యంత పటిష్టంగా రైతులకు సేవలు అందిస్తున్నదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం రెండేళ్లలోనే కూలిపోయిందని గుర్తు చేశారు. అది కూలిపోవడంతో ఎంతమేర అవినీతి జరిగిందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. 50 లక్షల కుటుంబాలకుపైగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులకు ఉచిత విద్యుత్, రుణ మాఫీ, రైతు భరోసా, పండించిన పంటను కొనుగోలు చేయడం వంటి కార్యక్రమాల కోసం వేల కోట్లను ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కృతనిశ్చయంతోÃ పనిచేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా మహిళా సంఘాలకు వచ్చే ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలను వడ్డీ లేకుండా ఇవ్వాలని సంకల్పించామన్నారు. ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో అంతర్జాతీయ వసతులతో యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు. గాలి వార్తలతో అబద్ధాలు పోగేసి ప్రజలను మభ్యపెట్టాలని రాష్ట్రం మీద పడి నలుగురు తిరుగుతున్నారని ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. టీవీ ఛానల్, పేపర్ అడ్డం పెట్టుకుని నిత్యం అబద్ధాలనే ప్రచారం చేస్తున్న వారికి ప్రజలు గతంలోనే గుణపాఠం చెప్పారని గుర్తు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





