– క్వాంటమ్‌స్కేప్ కార్యాలయాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 10: తెలంగాణను అధునాతన తయారీ, స్వచ్ఛ ఇంధన రంగానికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చే దిశగా రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక అడుగులు వేస్తున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన సాన్ జోస్‌లోని ప్రసిద్ధ బ్యాటరీ సాంకేతిక సంస్థ ‘క్వాంటమ్‌స్కేప్’ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. సంస్థ అధ్యక్షుడు, సీఈఓ డాక్టర్ శివ శివరామ్ సహా ఉన్నతాధికారుల బృందంతో భేటీ అయి, తదుపరి తరం బ్యాటరీ సాంకేతికతలు, గ్లోబల్ సప్లై చైన్ మరియు పెట్టుబడుల అవకాశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సాంప్రదాయ లిథియం-అయాన్ బ్యాటరీల కంటే అత్యంత సురక్షితమైన, వేగంగా ఛార్జ్ అయ్యే, ఎక్కువ శక్తి నిల్వ సామర్థ్యం గల ‘సాలిడ్-స్టేట్ లిథియం-మెటల్’ బ్యాటరీల అభివృద్ధిని డాక్టర్ శివరామ్ ఈ సందర్భంగా ప్రదర్శించారు. ప్రయోగశాల స్థాయి పరిశోధనలను వాణిజ్యపరంగా భారీ స్థాయి తయారీకి తీసుకెళ్లడంలో ఎదురవుతున్న సవాళ్లను, సంస్థ సాధించిన ప్రగతిని డిప్యూటీ సీఎంకు వివరించారు. గ్లోబల్ సప్లై చైన్ – భవిష్యత్ మార్పులు కీలక ఖనిజాల లభ్యత, అధునాతన విడిభాగాల తయారీ, సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు ఎలక్ట్రిక్ వాహనాలలో వీటి వినియోగంపై ఇరువర్గాలు అభిప్రాయాలు పంచుకున్నాయి. భవిష్యత్తులో ఈ నూతన బ్యాటరీ సాంకేతికతలు గ్లోబల్ సరఫరా గొలుసును ఎలా పునర్నిర్మిస్తాయో, కొత్త భాగస్వామ్యాలకు ఎలా బాటలు వేస్తాయో విశ్లేషించారు.
తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానం
రాష్ట్రంలో శరవేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రిక్ మొబిలిటీ వ్యవస్థ, అత్యుత్తమ ఇంజనీరింగ్ ప్రతిభ, స్వచ్ఛ ఇంధన రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రస్తావించారు. ఆర్ అండ్ డి , విడిభాగాల తయారీ, సరఫరా గొలుసు భాగస్వామ్యాలతో పాటు, భవిష్యత్తులో ఈ సాంకేతికతను భారత్‌లోనే స్థానికీకరించే దిశగా తెలంగాణలో విస్తరణ అవకాశాలను పరిశీలించాలని క్వాంటమ్‌స్కేప్ ప్రతినిధులను కోరారు. అంతర్జాతీయ ఆవిష్కరణల దిగ్గజాలకు, తెలంగాణలో వేగంగా పెరుగుతున్న సాంకేతిక, తయారీ రంగాలకు మధ్య బలమైన అనుసంధానాన్ని ఏర్పరచడమే లక్ష్యంగా డిప్యూటీ సీఎం పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది.
గ్లోబల్ హబ్‌గా తెలంగాణ ఇంధన రంగం
– 2030 నాటికి 500 గిగావాట్ల నాన్-ఫాసిల్ సామర్థ్యం లక్ష్యం
అమెరికా పర్యటనలో భాగంగా ప్రపంచ ప్రసిద్ధ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్క్లీలోని గోల్డ్‌మన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ పరిధిలోని ఇండియా ఎనర్జీ ,క్లైమేట్ సెంటర్‌ను భట్టి విక్రమార్క సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో దేశ పునరుత్పాదక ఇంధన లక్ష్యాల సాధనతో పాటు తెలంగాణను స్వచ్ఛ ఇంధన రంగాన గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన భవిష్యత్ ప్రణాళికలపై లోతుగా చర్చించారు. భారతదేశం నిర్దేశించుకున్న 2030 నాటికి 500 గిగావాట్ల నాన్-ఫాసిల్ సామర్థ్యాన్ని అందుకునేందుకు అవసరమైన వ్యూహాలు, తగ్గుతున్న శుద్ధ సాంకేతికత ఖర్చులు తెచ్చిపెడుతున్న నూతన అవకాశాలను ఈ సమావేశంలో పరిశీలించారు. గ్రిడ్ ఆధునీకరణ, పారిశ్రామిక డీకార్బనైజేషన్, ఆధునిక బ్యాటరీ ఇంధన నిల్వ వ్యవస్థల సమన్వయం, సమాన అవకాశాలతో కూడిన శక్తి పరివర్తన మార్గాలపై పరిశోధకులు, అధికారులతో డిప్యూటీ సీఎం విస్తృతంగా ఆలోచనలు పంచుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం చేపట్టిన వినూత్న పునరుత్పాదక ఇంధన మోడల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పారదర్శకమైన హరిత విధానం ద్వారా గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ రాష్ట్రంలో సౌరశక్తి సహా ఇతర పునరుత్పాదక సామర్థ్యాన్ని వేగవంతంగా విస్తరిస్తున్న తీరును డిప్యూటీ సీఎం వివరించారు. ముఖ్యంగా గ్రాణ ప్రాంతాల్లో మహిళా స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యంతో సోలార్ ప్రాజెక్టుల నిర్వహణ చేపట్టడం, పీఎం-కుసుమ్ పథకం ద్వారా అన్నదాతలకు స్వచ్ఛ ఇంధనాన్ని అందించడం వంటి ప్రజాకేంద్రిత నమూనాలు అంతర్జాతీయ ప్రతినిధుల ప్రశంసలు అందుకున్నాయి. 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాతోపాటు క్లీన్-టెక్ పరికరాల తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్న తీరును ఆయన సభ దృష్టికి తీసుకెళ్లారు. సిలికాన్ వ్యాలీ ఆవిష్కరణలు, కాలిఫోర్నియా రాష్ట్ర ఇంధన రంగానుభవాలను ఉపయోగించుకుని తెలంగాణలో సరికొత్త ఇంధన విప్లవానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. విద్యుత్, రవాణా, పారిశ్రామిక, వాతావరణ స్థిరత్వ రంగాలలో సంయుక్త అధ్యయనాలు చేపట్టడం, విధాన నిర్ణేతలకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో ఇంధన భద్రతను, ఆర్థిక పోటీతత్వా న్ని మరింత బలోపేతం చేసేందుకు యూసీ బర్క్లీ ప్రతినిధులతో కలిసి పనిచేయడానికి తెలంగాణ సర్కారు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





