– అధికార పార్టీలో నామినేటెడ్ పదవుల లొల్లి
ఖమ్మం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 10 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వివిధ కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థలకు చైర్మన్ పదవుల భర్తీపై ఆశలు పెట్టుకున్న పలువురు కాంగ్రెస్ నాయకులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ముఖ్యంగా కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం ఆశావహుల మధ్య పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీ కోసం పని చేసిన నాయకులు, సీనియర్ నేతలు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. గతంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నవారు, ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన నాయకులు తమ సేవలను గుర్తించి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రులకు ఆ బాధ్యతలు అప్పగించడంతో అధికార పార్టీలో సందడి కనిపిస్తోంది. అయితే రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉన్నా ఉమ్మడి ఖమ్మం లో మాత్రం కాంగ్రెస్ లో అంతర్గత పోరు సీనియర్, జూనియర్ మధ్య నామినేటెడ్ పదవులు ఎవరికి దక్కుతాయో అన్న ఉత్కంఠ కనిపిస్తోంది. జిల్లాలో కాంగ్రెస్ వర్గాలుగా పోరు నడుస్తుంది. పైకి అంత ఐక్యంగానే కనిపిస్తున్న ముగ్గురు మంత్రులతో పాటు రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి వర్గం నుంచి కూడా పలువురు నేతలు పదవుల రేసులో ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉండటంతో నామినేటెడ్ పదవుల కోసం ఆశావహుల సంఖ్య కూడా పెరుగుతోంది. పార్టీ కోసం చాలా కాలంగా పనిచేస్తున్న సీనియర్ నాయకులతో పాటు ఇటీవల పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న పలువురు నేతలు కూడా పదవుల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. పదవుల భర్తీలో పార్టీకి చేసిన సేవలు, సీనియారిటీ, సామాజిక సమీకరణాలతో పాటు జిల్లాలో పార్టీ బలోపేతానికి చేసిన కృషిని పరిగణనలోకి తీసుకోవాలని ఆశావహులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి ఏ పదవి దక్కుతుందనే అంశంపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.
అధిష్ఠానం నిర్ణయంపైనే ఉత్కంఠ
ఇప్పటివరకు పార్టీ పదవులు నామినేటెడ్ పదవులు విషయంలోనూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వర్గానికి ప్రాధాన్యత లభించింది మొదట విడత రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ల పదవిలో భట్టి వర్గం నుంచి రాష్ట్ర గిడ్డంకుల సంస్థ చైర్మన్ గా రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర హస్త కళల అభివృద్ధి చైర్మన్ గా నాయుడు సత్యనారాయణ, మరో కార్పొరేషన్ కు శ్రీకాంత్, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పొదెం వీరయ్య పదవులు పొందారు. భట్టి వర్గం నుంచే ఇటీవల సుడా చైర్మన్ గా ఫువాళ్ళ దుర్గాప్రసాద్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నూతి సత్యనారాయణ లకు లభించింది. నాలుగు కీలక పదవులు వైరా ప్రాంత నేతలకు దక్కడంపై కూడా పార్టీలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర నీటి పారుదల సంస్థ చైర్మన్ గా మువ్వా విజయ్ బాబు మంత్రి పొంగులేటి సిఫారసుతో పదవి దక్కించుకున్నారు. అలా మొదటి విడత చైర్మన్ పదవిలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు , రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి అనుచరులకు పదవులు దక్కలేదు. ఈసారి తమ అనునీయులకు పదవులు ఇవ్వాలని ఆ ఇద్దరు చక్రం వ్యూహాలు రచిస్తున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియలో పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. జిల్లాలో మార్కెట్ కమిటీ పదవులు, దేవాలయ కమిటీ పదవులు ఎవరి నియోజకవర్గంలో అక్కడి ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పిన వారికే దక్కాయి. అయితే తాజాగా మొదటి విడత కార్పొరేషన్ చైర్మన్ల కాలం ముగియడంతో మళ్లీ కొత్తగా ప్రభుత్వం నియామకాలకు శ్రీకారం చు ట్టబోతోంది. జిల్లాలో కీలకమైన భద్రాచలం ట్రస్టుబోర్డుతో పాటు సహ కార సంఘాల అధ్యక్షులు, డైరెక్టర్లు, జిల్లా కేంద్ర సహకారబ్యాంకు, డీసీ ఎంఎస్ పదవులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్లు, పాలకవర్గాల డైరెక్టర్ల పద వులు నియామకం చేయబోతున్నారు. ఇన్చార్జ్ మంత్రులకు ఈ బాధ్య త అప్పగించడంతో జిల్లా ఇన్చార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి హైదరాబాద్ లో జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు జిల్లా కాంగ్రెస్ నేతలు, కొందరు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. కాగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రా జ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, ఎంపీలు రఘురాంరెడ్డి, బలరాంనా యక్ తో పాటు మరికొందరు ఎమ్మెల్యేలతో సమావేశం కావాల్సి ఉంది. ఇప్పటికే పలువురు నాయకులు తమకు అనుకూలంగా ఉన్న ముఖ్య నేతల ద్వారా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పదవుల కోసం పోటీ మరింత వేడెక్కుతోంది. కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఎవరిని వరిస్తాయన్నది ప్రస్తుతం ఖమ్మం కాంగ్రెస్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ అధిష్ఠానం తుది నిర్ణయం ప్రకటించే వరకు ఆశావహుల ప్రయత్నాలు కొనసాగనున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





