రేపు సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ

– సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో సభ నిర్వహణకు ఏర్పాట్లు
– సభా ప్రాంగణంలో ప్రముఖుల ఫ్లెక్సీలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 5 : సాధించుకున్న భౌగోళిక తెలంగాణను సామాజిక న్యాయ తెలంగాణగా పునర్నిర్మించే కర్తవ్యాన్ని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన భుజానికి ఎత్తుకున్నారు. సబ్బండ వర్గాల వికాసం.. సాధికారతే లక్ష్యంగా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభను గురువారం నిర్వహిస్తున్నారు. సామాజిక వైతాళికులను కీర్తించుకునేలా సభా ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యమిస్తూ రాష్ట్రానికి కొత్త రాజకీయాలను పరిచయం చేస్తూ అందులో ఆయా వర్గాల వారిని ఆమె భాగస్వామ్యం చేయబోతున్నారు. సభా ప్రాంగణంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, తన జీవితం మొత్తాన్ని తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం త్యాగం చేసిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్, సామాజిక అంతరాలను రూపుమాపేందుకు కృషి చేసిన మహనీయులు మహాత్మా జ్యోతిబా ఫూలే, మొదటి మహిళా ఉపాధ్యాయిని సావిత్రిబాయి ఫూలే, అట్టడుగు వర్గాల ప్రజలు పేదరికం, పీడన నుంచి బయట పడేందుకు విద్య మాత్రమే ఆయుధమని నమ్మి పాఠశాలలు ఏర్పాటు చేసిన భాగ్యరెడ్డి వర్మ చిత్రపటాలను సభా ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నారు. నిజాం రాజ్యంలో దేశ్‌ముఖ్‌లు, దొరల దురహంకారంపై తిరుగుబాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య, నిజాం సింహాసనాన్ని వణికించిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, బహుజనులకు రాజ్యాధికారం కోసం కృషి చేసిన కాన్షీరామ్, జల్-జంగిల్-జమీన్‌పై హక్కుల కోసం పోరు సాగించిన యోధుడు కొమురం భీమ్, నిఖార్సయిన తెలంగాణవాది, ప్రత్యేక తెలంగాణ కోసం మంత్రి పదవి తృణప్రాయంగా వదులుకున్న బహుజన నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ, సమాజంలో దోపిడీకి గురవుతున్న వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన కర్పూరి ఠాకూర్ చిత్రపటాలు ఏర్పాటు చేస్తున్నారు. తొలి తరం తెలంగాణ ఉద్యమకారిణి, ఉమ్మడి ఏపీలో మొదటి దళిత మహిళా ఎమ్మెల్యే, మొదటి మహిళా డిప్యూటీ స్పీకర్ టీఎన్ సదాలక్ష్మి, నిజాం నిరంకుశత్వంపై పోరాడిన బహుజన యోధుడు పండుగ సాయన్న, బహుజన గెరిల్లా యోధుడు వడ్డెర ఓబన్న, బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్, ఉమ్మడి ఏపీ నుంచి లోక్‌సభకు ఎన్నికైన మొదటి మహిళా నాయకురాలు, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు సంగం లక్ష్మీబాయి, రజాకర్ల అరాచకాలపై తన కలాన్ని ఎక్కుపెట్టిన అక్షర యోధుడు షోయబుల్లాఖాన్, మలి దశ రాష్ట్ర సాధన పోరాటానికి ఆద్యుడు, కుల-వర్గ పోరాట సిద్ధాంతకర్త మారోజు వీరన్న, నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన ప్రముఖ కవి, కార్మిక నాయకుడు మఖ్దూం మొహియుద్దీన్‌ల విగ్రహాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *