ప్రతికూలతల నుండి మహిళా సాధికారత వైపు..

– అంతర్జాతీయ వేదికపై తెలంగాణ స్పూర్తిని చాటిన మంత్రి సీతక్క
– గ్లోబల్‌ వేదికను ఆకట్టుకున్న సీతక్క ప్రసంగం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: ‘ప్రతికూలతల నుండి సాధికారత వైపు-దేశాలను మారుస్తున్న మహిళల శక్తి అనే అంశంపై రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రసంగం గ్లోబల్‌ వేదికను ఆకట్టుకుంది. అంతర్జాతీయ వేదికపై తెలంగాణ స్ఫూర్తిని ఆమె ప్రతిధ్వనింపజేశారు. నెదర్లాండ్స్‌లో జరిగిన మహిళా నాయకత్వ సదస్సు వైటల్‌ వాయిసెస్‌ గ్లోబల్‌ ఫెలోషిప్‌ (వీవీజీఎఫ్‌) గ్లోబల్‌ సమ్మిట్‌లో ఫ్రం యాడ్వెర్సిటీ టు ఎంపవర్‌మెంట్‌ – ద పవర్‌ ఆఫ్‌ ఉమెన్‌ టు ట్రాన్స్‌ఫాం నేషన్స్‌ అనే అంశంపై ఆమె చేసిన ప్రధాన ప్రసంగం శ్రోతలందరినీ ఆకట్టుకుంది. తన చిన్ననాటి ఆదివాసీ బాలిక జీవితం నుండి రాష్ట్ర మంత్రిగా ఎదిగిన ప్రేరణాత్మక ప్రయాణాన్ని, ఆ మార్గంలో సమాజానికి అందించిన సేవలను, ప్రజాస్వామ్య పోరాటాలను, కరోనా కాలంలో చేసిన సహాయ కార్యక్రమాలను వివరించారు. పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను అక్కడ ఆవిష్కరించారు. మంత్రి సీతక్క ప్రసంగం ఇలా సాగింది. ‘తాను తెలంగాణలోని చిన్న ఆదివాసీ గిరిజన గ్రామంలో పుట్టాను.. పేదరికం, అసమానతలు నా బాల్యాన్ని మలిచాయి. 16 ఏళ్ల వయసులో న్యాయం కోసం అడవుల్లోకి వెళ్లి నక్సలైట్‌ ఉద్యమంలో చేరాను.. కానీ అసలైన మార్పు తుపాకీతో కాదు.. విద్య, అనుభూతి, సాధికారతతో సాధ్యమవుతుందని తెలుసుకున్నా’ను అని తెలిపారు. తాను జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత తిరిగి విద్యను ప్రారంభించి ఎంఏ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, ఉస్మానియా యూనివర్సిటీ నుండి పీహెచ్‌డీ పూర్తి చేసినట్లు చెప్పారు. ‘అడవుల నుండి ప్రజాస్వామ్య సభల వరకు నా ప్రయాణం సాక్ష్యం. ప్రజల కోసం ప్రజాస్వామ్యంలోనే నిజమైన విప్లవం ఉంటుంది’ అని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళల భాగస్వామ్యం 40 శాతం కాగా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 20 శాతం లోపే ఉందంటూ స్థూల జాతీయ ఉత్పత్తిలో మహిళల భాగస్వామ్యం పెంచేలా తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని వెల్ల‌డించారు.

మహిళా విజయాల ఆవిష్కరణ

ఇందిరా మహిళా శక్తి పాలసీ ద్వారా మహిళా సంఘాలను ఆర్థికంగా స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దుతున్నాం.. మహిళలు క్యాంటీన్లు నడుపుతున్నారు.. సోలార్‌ ప్లాంట్లు నిర్వహిస్తున్నారు.. ఆర్టీసీకి బస్సులు అద్దెకు ఇస్తున్నారు.. పెట్రోల్‌ బంకులు నడుపుతున్నారు.. ఆర్టీసి బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు.. ఉచిత ప్రయాణికులు ఇప్పుడు ఆర్టీసి అద్దె బస్సులకు యాజమానులుగా ఎదిగారు’ అని మహిళా సంఘాలు సాధించిన విజయాలను గ్లోబల్‌ వేదికపై మంత్రి సీతక్క ఆవిష్కరించారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా మార్చే సంకల్పంతో ప్రభుత్వం కృషి చేస్తోందని, యేటా కనీసం రూ.25 వేల కోట్ల బ్యాంక్‌ లింకేజ్‌ రుణాలు మహిళా సంఘాలకు అందిస్తున్నామని తెలిపారు. వడ్డీ లేని రుణాల పథకం కింద ఏటా రూ. వేయి కోట్లకు పైగా మహిళా సంఘాలకు వడ్డీలు చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. 63 లక్షల మంది మహిళల సంఘటిత శక్తిగా ‘ఇందిరా మహిళా శక్తి’ పనిచేస్తోందని, ప్రతి ఆడబిడ్డ ఆర్థికంగా స్వావలంబిగా మారడం తమ లక్ష్యమని చెప్పారు. ఆరోగ్యలక్ష్మి, బాలమృతం, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లక్షలాది తల్లులు, పిల్లలకు పోషకాహారం అందిస్తున్నాం.. అడవుల్లోని దూరప్రాంత గ్రామాల్లో కూడా డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్‌ ఏర్పాటు చేస్తున్నామని మహిళా సంక్షేమంపై ఆమె వివరించారు. పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల హక్కులను కాపాడడమే లక్ష్యంగా కృషిచేస్తున్నామన్నారు. సవాళ్లను అధిగమిస్తూ ములుగు అడవుల్లో కంటైనర్లలో పాఠశాలు, వైద్య కేంద్రాలను నిర్వహిస్తున్న విషయాన్ని ప్రపంచ దేశాల ముందు ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా మహిళల సాధికారత లక్ష్యంగా మారిందన్నారు. ‘ఆఫ్రికాలో కోడింగ్‌ నేర్చుకుంటున్న అమ్మాయి, లాటిన్‌ అమెరికాలో వ్యాపారం ప్రారంభించిన తల్లి, భారత్‌లోని గిరిజన స్త్రీ.. అందరిదీ ఒకే గమ్యం. మహిళ అభివృద్ధి చెందితే సమాజం మొత్తం అభివృద్ధి చెందుతుంది. మహిళల సాధికారతే దేశ సాధికారత అని ఆమె వక్కాణించారు. సాధికారత ఎవరో ఇస్తే రాదు.. మనమే సాధించేది, పంచేది. ప్రపంచానికి మహిళల శక్తి చూపించాల్సిన సమయం వచ్చింది అంటూ సీతక్క ముగించారు. ప్రసంగం ముగిసిన వెంటనే వేదిక మొత్తం చప్పట్లతో మారుమోగింది. చిత్తశుద్ధి, నిబద్ధత, పట్టుదలకు కృషిని జోడిస్తే ఎక్కడో ఆదివాసీ గిరిజన ప్రాంతంలో పుట్టిన సీతక్కలాంటి సాధారణ మహిళలు కూడా ప్రపంచ వేదికలపై తమ ముద్ర వేయగలరని చెప్పడానికి ఆమె విజయగాథ ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని పలువురు పేర్కొన్నారు. సదస్సులో పెరూ దేశపు మొట్టమొదటి మహిళా ప్రధాని బెట్రిజ్‌ మెరినో, వివిధ దేశాల మహిళా ఎంపీలు, మహిళా ప్రముఖులు ప్రసంగించారు. తమ దేశాల్లో నెలకొన్న పరిస్థితులు, మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, సాధించాల్సిన లక్ష్యాలపై తమ అనుభవాలను వివరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page