– ఎన్యూమరేషన్ ఫారాలు పూరించటంలో తడబాటు
– చదువుకున్న వారికి సైతం అర్థంకాని పదజాలం
– పత్రాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న సిబ్బంది
– ప్రారంభ దశలోనే డిజిటలైజేషన్, సాంకేతిక సమస్యలు
సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర 9 : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా బూత్ లెవల్ అధికారులు (బీఎలఓలు) పంపిణీ చేస్తున్న ఎన్యూమరేషన్ ఫారం (గణన ఫారం)లు నింపడం ఓటర్లకు సమస్యగా మారింది. అధికార యంత్రాంగం ఫారాల పంపిణీని దాదాపు పూర్తిచేసింది. కానీ వాటిని ఎలా పూరించి ఇవ్వాలో తెలియక ఎలా పూరిస్తే ఏ సమస్య వస్తుందోనని ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. సాంకేతిక పదజాలం, ఫారంలోని కుడి ఎడమలలో ఏమి వివరాలు రాయాలో అర్థం కాని వారు ఎందరో. అక్షరాస్యులు సైతం ఏమి చేయాలో తెలియక ఇరుగుపొరుగు వారిని ఆరా తీస్తున్నారు. అనుమానాల నివృత్తి కోసం జిల్లా కలెక్టరేట్, మున్సిపల్, ఇతర కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసినా క్షేత్రస్థాయిలో మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. కొందరు పాత ఓటరు ఐడీ కార్డులు తీసుకెళ్లి ఫారం అడిగితే లిస్టులో వారి పేరు కనిపించకపోవడం మరో అందోళనకర విషయం. యాప్‌లో వారి వివరాలు నమోదు చేస్తే ఓటరు ఫోన్‌కు ఓటీపీ వస్తుందంటున్నా కొందరికి ఆ మెసేజ్ కూడా రావడంలేదు.
కొందరు బీఎల్‌ఓల నిర్లక్ష్యం..
ఫారంపైన బీఎల్‌ఓ నంబర్ ఇచ్చినా ఓటర్లు ఫోన్ చేస్తే కొందరు అందుబాటులోకి రావడం లేదు. మరికొందరి నెంబర్లు తరచూ బిజీ వస్తున్నాయి. చాలాచోట్ల బీఎలఓలు ఇండ్లకు తిరిగి గణన ఫారంలు ఇవ్వ లేదు. ఒకచోట కూర్చుని ఓటర్లను అక్కడకు పిలిపించుకుంటున్నారు. ఓ వీధిలో ఒకరిద్దరికి నెంబర్లు వేసి ఇచ్చి ఆ బజార్ మొత్తానికి పంపిణీ చేయమని సూచిస్తున్నారు. అవగాహన లోపంతో గ్రామీణ ప్రాంతాల్లోనే కాక పట్టణాల్లోని వృద్ధులు, నిరక్షరాస్యులు ఫారం నింపడానికి ఇబ్బందులు పడుతున్నారు. పెన్నుతో రాస్తే సమస్యలు వస్తాయి కాబట్టి పెన్సిల్‌తో రాయమని చెబుతున్నాం కదా అని బీఎల్‌వోలు ఓటర్లకు బదులిస్తున్నారు. తండ్రి ఓటరు గుర్తింపు కార్డు నంబరు, తల్లి ఓటరు గుర్తింపు కార్డు నెంబరు, తాతల పేర్లు రాయమని చెబుతున్నారు. ఆ వివరాలు తెలియక చాలామంది తెల్లమొహం వేస్తున్నారు. బీఎల్‌వోలు ఫారం ఇచ్చి వెళ్తున్నారే తప్ప ఎలా పూరించాలో సరైన అవగాహన కల్పించడం లేదనే విమర్శలు ఉన్నాయి. అక్షరాస్యులు సైతం 2002లో ఓటరు జాబితా ప్రకారం ఓటు ఉంటే ఏమి రాయాలి, ఓటు లేకపోతే ఏమి రాయాలో తెలియక సతమతమవుతున్నారు. తప్పులు దొర్లితే ఓటు ఎక్కడ తొలగిస్తారోననే భయం ఓటర్లను వేధిస్తోంది. అలాగని మరో ఫారం ఇవ్వడంలేదు. ఎక్కడైనా డౌన్‌లోడ్ చేయించుకుందామా అంటే అదీ కుదరడంలేదు. కేవలం వాళ్లిచ్చిన ఫారంనే నింపాల్సి వస్తోంది.
ఆన్‌లైన్- ఆఫ్‌లైన్ సమస్యలు 
ఆన్‌లైన్ ద్వారా ఫారం పూరించే సమయం లో ఆధార్ కార్డులోని పేరు (ఉదాహరణకు ఇంటి పేరు ముందు వెనుక ఉండటం), ఓటరు ఐడీలోని పేరుతో సరిపోలకపోతే ఆన్‌లైన్ సబ్మిషన్ నిలిచిపోతోంది. ఆన్‌లైన్‌లో ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేయాలంటే ఓటరు కార్డుకు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి. లింక్ లేని వారు ముందుగా ఫారం-8 ద్వారా మొబైల్ నంబర్ అప్ డేట్ చేసుకోవాల్సి వస్తోంది. 2002 నాటి ఓటర్ లిస్టులోని పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ వంటి పాత వివరాలను వెతకడం ప్రస్తుత వివరాలతో వాటిని మ్యాపింగ్ చేయడం పెద్ద సమస్యగా మారింది. ఫారంలో పెన్నుతో రాసినపుడు తప్పులు దొర్లితే ఓటర్లు వైట్‌నర్లు వాడుతున్నారు. వైట్‌నర్ ఉపయోగించిన ఫారాలు చెల్లవని కొందరు అధికారులు చెబుతున్నారు. జీహెచఎంసీ పరిధిలో ఇంగ్లీష్, మిగిలినచోట్ల తెలుగులో ఫారాలు ఇస్తున్నారు. ఉర్దూ మాత్రమే చదవగలిగే కొందరు ముస్లింలు, ఇతర భాషలు మాత్రమే చదవగలిగేవారు ఈ ఫారాలను అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు.
సాంకేతిక పదజాలం.. డిజిటలైజేషన్ ఇబ్బందులు
ఎన్యూమరేషన్ ఫారంను పూరించేటప్పుడు కొన్ని సాంకేతిక పదాలు ఇబ్బంది కలిగిస్తున్నాయి. కుటుంబ సభ్యుల వివరాలు, వారి ఓటరు గుర్తింపు కార్డుల నంబర్లతోపాటు ప్రొజెనీ (సంతతి), సెల్ఫ్, నో మ్యాపింగ్ వంటి సాంకేతిక పదాలు ఎలా నింపాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. డిజిటలైజేషన్ (ఆన్‌లైన్) ప్రక్రియ ప్రారంభ దశలోనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ 15 శాతంగా ఉందని సమాచారం. మొత్తం 99.07శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4,75,695మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 99.07శాతం (4,75,037 మంది ఓటర్లకు) గణన ఫారంలు పంపిణీ చేశారు. ఇప్పటివరకు 73,693 ఫారంలను మాత్రమే డిజిటలైజ్ చేశారు. ఫారాల సేకరణ వేగంగా జరగాలంటే ఓటర్లకు బిఎల్‌వోల ద్వారా అవగాహన కల్పించాలని, తద్వారా ఇబ్బందులు తప్పి ఎసఐఆర్ ఆశయం నెరవేరుతుందని పలువురు సూచిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





