తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యం

-2047 ‌నాటికి 3 ట్రిలియన్‌ ‌డాలర్స్ ఆర్థిక వ్యవస్థ
-దేశ ఆర్థిక వ్యవస్థలో 10శాతం వాటా సాధించేలా ప్రణాళికలు
-ఓఆర్‌ఆర్‌ ‌లోపలున్న పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌ ‌వెలుపలకు తరలింపు
-హైదరాబాద్‌ను కాలుష్యం నుంచి తప్పించే చర్యలు
ఇండియాస్ ‌నెక్ట్స్- ‌జెన్‌ ‌సోలార్‌ ‌మాడ్యూల్‌ ‌యూనిట్‌ ‌ప్రారంభంలో సిఎం రేవంత్‌

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 9: తెలంగాణ 2047 నాటికి 3 ట్రిలియన్‌ ‌డాలర్స్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. షాబాద్‌ ‌మండలం సీతారాంపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియాస్‌ ‌నెక్టస్- ‌జెన్‌ ‌సోలార్‌ ‌మాడ్యూల్‌ ‌యూనిట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.  యువతలో నైపుణ్యాభివృద్ధి కోసమే.. స్కిల్స్ ‌యూనివర్సిటీ నెలకొల్పాం. ఏటా 1.10 లక్షల మంది యువత ఇంజినీరింగ్‌ ‌పట్టాలతో బయటకి వస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పరిశ్రమలు రావాలి. బ్లూకాలర్‌ ఎం‌ప్లాయిస్‌లో కొత్త స్కిల్స్ ‌పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.  సీతారాంపురం ప్రజల త్యాగాల వల్లే ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటయ్యాయని తెలిపారు. గతంలోనూ రంగారెడ్డి జిల్లా ప్రజల త్యాగాల వల్లే ఓఆర్‌ఆర్‌, ‌పరిశ్రమలు వచ్చాయన్నారు.అత్యంత నివాస అనుకూల నగరాల జాబితాలో హైదరాబాద్‌ ‌ముందుంటుంది. అయినప్పటికీ హైదరాబాద్‌ను కూడా కాలుష్య సమస్య వేధిస్తోంది. 1.34 కోట్ల మంది ఓఆర్‌ఆర్‌ ‌లోపల నివసిస్తున్నారు. ఓఆర్‌ఆర్‌ ‌లోపలున్న పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌ ‌వెలుపలకు తరలించాలని నిర్ణయించాం. పెరి అర్బన్‌ ‌రీజియన్‌లో ప్రత్యేక మాన్యుఫ్యాక్చరింగ్‌ ‌జోన్లు ఏర్పాటుచేస్తున్నామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. రాజకీయంగా ఎన్ని ఆరోపణలు వచ్చినా తమ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధినే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందని సీఎం అన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు ఉంటాయని, ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధికి అందరూ సహకరించాలని ప్రతిపక్షాలను కోరారు. అధికారం కోల్పోయిన బాధ ఉన్నా అభివృద్ధిని అడ్డుకోవద్దని, తమ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ట్రాఫిక్‌ ‌సమస్యలు తీవ్రంగా ఉన్నాయని పేర్కొన్న సీఎం.. అలాంటి పరిస్థితులు హైదరాబాద్‌లో రాకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేస్తున్నామని చెప్పారు. అందుకే ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డు లోపల ఉన్న సుమారు 2,100 చ.కి.ప్రాంతాన్ని  ఏరియాగా అభివృద్ధి చేయాలని నిర్ణయించామని తెలిపారు. అలాగే రాష్టాన్న్రి క్యూర్‌, ‌ప్యూర్‌ ‌ప్రాంతాలుగా విభజించి సమతుల అభివృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని వెల్లడించారు.  దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ 10శాతం వాటా సాధించేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజల సహకారంతో 2034 నాటికి రాష్ట్రాన్ని1 ట్రిలియన్‌ ‌డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించాలంటే మెరుగైన మౌలిక సదుపాయాలు అవసరమని సీఎం అభిప్రాయ పడ్డారు. యువతకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు అందించేందుకు అడ్వాన్స్‌డ్‌ ‌ట్రైనింగ్‌ ‌సెంటర్లు, స్కిల్స్ ‌యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీతారాంపూర్‌లో సోలార్‌ ‌మాడ్యూల్‌ ‌తయారీ యూనిట్‌ ‌ప్రారంభం కావడం సంతోషకరమని పేర్కొన్న సీఎం.. ఈ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన కుటుంబాలకు ఇంటి పట్టాలు ఇవ్వడంతో పాటు ఉపాధి కోసం వ్యాపార సముదాయాలు నిర్మించి అందించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా రైతులు చేసిన త్యాగాల వల్లే ఈ అభివృద్ధి సాధ్యమైందని సీఎం కొనియాడారు. చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే బుద్వేల్‌ ‌నుంచి కొడంగల్‌ ‌వరకు 100 టర్ల వెడల్పుతో రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. సీతారాంపూర్‌లో నిర్మిస్తున్న ఆలయ ప్రారంభోత్సవానికి త్వరలో మరోసారి వస్తానని సీఎం రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు. ప్రజల సహకారంతో తెలంగాణను అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

‘మేడ్ ఇన్ తెలంగాణ’ విశ్వవ్యాప్తం కావాలి : మంత్రి దుద్దిళ్ల

‘మేడ్ ఇన్ తెలంగాణ’ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తం అయ్యేలా ఇక్కడినుంచే ప్రపంచానికి ఉత్పత్తులను అందించాలి.. ఇదే ప్రభుత్వ సంకల్పం అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. ‘ప్రీమియర్ ఎనర్జీస’ లాంటి ప్రపంచస్థాయి సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు తెలంగాణను ఎంచుకోవడం ఇక్కడి పారిశ్రామిక ప్రగతికి, రాష్ట్ర ప్రభుత్వంపై ఇన్వెస్టర్లకు ఉన్న విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమని అన్నారు. ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్ ద్వారా తెలంగాణను ప్రపంచస్థాయి క్లీన్ ఎనర్జీ, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్, ఇన్నోవేషన్, సుస్థిరాభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ ద్వారా పునరుత్పాదక ఇంధనం, బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్, గ్రీన్ హైడ్రోజన్, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని పేర్కొన్నారు. ఇంధన రంగంలో ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 3.4 ట్రిలియన్ డాలర్ల పెట్టబడులు వచ్చే అవకాశం ఉండగా అందులో మూడింట రెండొంతులు (2.2 ట్రిలియన్ డాలర్లు) క్లీన్ ఎనర్జీ రంగంలోనే వస్తాయని అంతర్జాతీయ ఇంధన సంస్థ అంచనా వేస్తోందన్నారు. ఏఐ, డేటా సెంటర్లు, ఈవీ రంగాల విస్తరణ వల్ల వచ్చే ఏడాది దేశీయ విద్యుత్ డిమాండ్ 300 గిగావాట్లకు చేరే అవకాశముందని కేంద్రం అంచనా వేస్తోందని తెలిపారు. దేశంలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుల పైప్‌లైన్ 260 గిగావాట్ అవర్స్‌కు చేరుకుందన్నారు. ఈ అవకాశాలను తెలంగాణ అందిపుచ్చుకునేలా ముఖ్యంగా సోలార్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, గ్రీన్ టెక్నాలజీపై ప్రధానంగా దృష్టి సారించామని ఆయన వివరించారు. ఈ రంగాల్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా కొత్త పెట్టుబడులను ఆకర్షించేలా సమగ్ర ఎకో సిస్టంను రాష్ట్రంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ అంటే విజన్, అవకాశాల కలయిక. ఆలోచనలు పరిశ్రమలుగా మారే వేదిక. నమ్మకానికి, వేగవంతమైన వృద్ధికి నిదర్శనం అని పేర్కొన్నారు. పెట్టుబడులకు, పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాలుగా అనుకూలం.. అందుకే తెలంగాణలో పెట్టుబడులు పెట్టి ‘రైజింగ్ తెలంగాణ’లో భాగస్వామ్యం కావాలని పారిశ్రామికవేత్తలను ఈ వేదిక ద్వారా సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. పారిశ్రామికవేత్తలకు 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న సబ్సిడీలను దశలవారీగా చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని, సీతారాంపూర్‌లో భూములు ఇచ్చిన రైతుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మనోహర్ రెడ్డి, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *