– 2028 కల్లా దేశంలోనే అత్యుత్తమ రోడ్లు నిర్మాణమే లక్ష్యం
– నవంబర్‌లో హైటెక్స్‌లో ఇండియన్ రోడ్ కాంగ్రెస్
– డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా రాష్ట్రంలో రూ.98,000 కోట్లతో రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రహదారుల నిర్మాణం, అభివృద్ధికి సంబంధించి బుధవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో భట్టి, కోమటిరెడ్డి మాట్లాడుతూ 2028 చివ నాటికి రోడ్ల నిర్మాణంలో దేశంలోనే రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టినట్టు తెలిపారు. దేశంతోపాటు, ప్రపంచం నలుమూలల నుంచి రోడ్డు కాంట్రాక్టర్లు, బిల్డర్లు హాజరయ్యే ప్రతిష్టాత్మక ఇండియన్ రోడ్డు కాంగ్రెస్ సమావేశం నవంబర్‌లో హైదరాబాదులోని హైటెక్స్‌లో నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. గతంలో ఎంపీగా కేంద్ర మంత్రి గడ్కరీతో తనకున్న పరిచయం మూలంగా హైదరాబాదులో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సమావేశం నిర్వహించేందుకు ఒప్పించానని తెలిపారు. ఈ సమావేశం నిర్వహణకు బీజేపీ పాలనలోని రాష్ట్రాలు పోటీపడినప్పటికీ కేంద్ర మంత్రి గడ్కరీ తన విజ్ఞప్తి మేరకు రాష్ట్రంలో నిర్వహించేందుకు అనుమతించారన్నారు. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా రాష్ట్రానికి చెందిన మోహన్ నాయక్ ఎన్నికైన విషయాన్ని సైతం మంత్రి కోమటిరెడ్డి గుర్తు చేశారు. సమావేశం నిర్వహణకు అవసరమైన నిధులను బుధవారం జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విడుదల చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సమావేశం అనంతరం రాష్ట్రానికి రూ.20 వేల కోట్లకుపైగా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రూ.148 కోట్లతో నిర్మించనున్న అప్రోచ్ రహదారులతో 300 గ్రామాల్లో నెలకొన్న సమస్యకు పరిష్కారం లభించనుందని తెలిపారు. గత ప్రభుత్వం సమావేశాలు పెట్టి వదిలివేయడం తప్ప అప్రోచ్ రోడ్ల పూర్తికి నిధులు మంజూరు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో రూ.13 వేల కోట్లతో 6000 కి.మీ రహదారులను హామ్ పద్ధతిలో చేపŸడుతున్నట్టు మంత్రి వెంకటరెడ్డి వివరించారు. ఈ పనులకు సంబంధించిన ప్రైస్ బిడ్ పనులు పూర్తి అయ్యాయని, మే మొదటి వారంలో రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం చేపట్టుతున్నట్టు వివరించారు. రూ.20 వేల కోట్లతో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మొత్తం ఎనిమిది లేన్లతో ఈ రహదారి విస్తరణ చేపట్టినట్టు తెలిపారు. ఆరు ప్రధాన లేన్లు, రెండు సర్వీస్ లైన్ల నిర్మాణం జరుగుతుందన్నారు. రూ.500 కోట్లతో బ్లాక్ స్పాట్స్, చౌటుప్పల్, చిట్యాల వంటి గ్రామాల మీదుగా ఫ్లైఓవర్‌ల నిర్మాణం జరుగుతుందని మంత్రి వెంకటరెడ్డి వివరించారు. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి- బందరు పోర్టు వరకు రూ.20 వేల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ రోడ్ నిర్మాణానికి అలైన్‌మెంట్ ఖరారు చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు మంత్రి వెంకటరెడ్డి వివరించారు. ఈ రోడ్డు అలైన్‌మెంట్‌కు అనుగుణంగా బుల్లెట్ ట్రైన్ నడిపేందుకు అవసరమైన అలైన్‌మెంట్‌ను సైతం ఖరారు చేసి కేంద్రానికి పంపినట్టు చెప్పారు. మన్ననూరు- శ్రీశైలం 52 కి.మీ మేర ఎలివేటెడ్ కారిడార్ రహదారి నిర్మాణానికి రూ.8,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ.36 వేల కోట్లు మంజూరయ్యాయని, ఇది రాష్ట్రానికి గేమ్ ఛేంజర్ ప్రాజెక్టు అని మంత్రి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఈనెల 8న రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం భూ సేకరణకు రాష్ట్ర వాటాగా రూ.628 కోsట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు జమ చేశామని, ఎల్బీనగర్-హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌ను రూ.941 కోట్లతో చేపడుతున్నామని వివరించారు. ఇందులో కేంద్రం వాటా రూ.741 కోట్లు కాగా రాష్ట్రం రూ.200 కెÃట్లు ఖర్చు చేయనుందని తెలిపారు. రహదారులు లేని గ్రామాల్లో కొత్త రోడ్లు, సింగిల్ రోడ్ల స్థానంలో డబుల్ రోడ్లు నిర్మించినట్లు మంత్రి తెలిపారు. రహదారుల నిర్మాణంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివస్తాయని, తద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కోమటిరెడ్డి వివరించారు. రోడ్డు ప్రమాదాలతో రాష్ట్రంలో 2025లో 6,500 మంది దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారని, ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని పెద్ద ఎత్తున రహదారుల నిర్మాణం, అరైవ్ అలైవ్ వంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినట్టు మంత్రి వెంకటరెడ్డి తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





