సమస్యలపై అవగాహనకు లఘు చిత్రాలు దోహదపడాలి

– అంతర్జాతీయ లఘు చిత్రోత్సవం లోగో ఆవిష్కరించిన గవర్నర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: హైదరాబాద్‌ ప్రసాద్‌ ఐమాక్స్‌లో డిసెంబర్‌ 19 నుంచి 21వ తేదీ వరకు తొలిసారిగా జరగనున్న అంతర్జాతీయ లఘుచిత్రోత్సవం లోగోను రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లఘుచిత్రాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశవ్యాప్తంగా పలు చలనచిత్రోత్సవాలు జరుగుతున్నా ఈ స్థాయిలో అంతర్జాతీయ లఘు చిత్రోత్సవం నిర్వహించబూనుకోవటంపై గవర్నర్‌ నిర్వాహకులను అభినందించారు. హైదరాబాద్‌ సంస్కృతీ సంప్రదాయాలకు ఈ లోగో దర్పణం పడుతోందని ప్రశంసించారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో హైదరాబాద్‌కు విశేషమైన స్థానం ఉందని, ఈ లఘుచిత్రోత్సవాల ద్వారా నగరం కొత్తదనాన్ని సంతరించుకోవాలని ఆకాంక్షించారు. దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యల గురించిన ప్రాధమిక అవగాహన కల్పించేందుకు లఘుచిత్రాలు కీలకమైన సాధనంగా మారాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ కార్యనిర్వహక అధికారి ప్రియాంక మాట్లాడుతూ దేశంలో ఈ స్థాయిలో లఘుచిత్రాలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రత్యేకంగా మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహించటం ఇదే మొదటిసారని, రానున్న కాలంలో హైదరాబాద్‌ను అంతర్జాతీయ చలనచిత్ర యవనికలో ఓ ప్రాధాన్యత కలిగిన కేంద్రంగా అభివృద్ధి చేయటానికి ఈ ఉత్సవాలు ఉపయోగపడతాయని అన్నారు. రానున్న కాలంలో దేశంలోనే హైదరాబాద్‌ను చలనచిత్ర హబ్‌గా అభివృద్ధి చేసేందుకు చలన చిత్ర అభివృద్ధి సంస్థ నిర్విరామంగా కృషి చేస్తోందని, దేశంలోనే అత్యధిక సంఖ్యలో పిలిం స్క్రీన్‌లు హైదరాబాద్‌లోనే ఉన్నాయని చెప్పారు. ఈ అంతర్జాతీయ లఘుచిత్రోత్సవాల నిర్వహణలో తెలంగాణ చిలన చిత్ర అభివృద్ధి సంస్థ ప్రధాన భాగస్వామిగా ఉండటం ఎంతో సంతోషించదగ్గ విషయమని, ఈ ఉత్సవాలు విజయవంతం కావాలని ఆమె ఆకాంక్షించారు. హైదరాబాద్‌ అంతర్జాతీయ లఘుచిత్రోత్సవం ఛీఫ్‌ ప్యాట్రన్‌, జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ దర్శకుడు సి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ డిసెంబరు 19 నుంచిీ 21 మధ్య నిర్వహించబోతున్న ఈ లఘు చిత్రోత్సవాలు ఆధునిక ప్రపంచ సంస్కృతితో తెలంగాణ సంస్కృతి పెనవేసుకోవడానికి ఓ వేదికగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో విస్తృతంగా సాంస్కృతిక ఉత్పత్తులు, లఘుచిత్రాలు నిర్మించే యువతకు ఈ ఉత్సవాలు అద్భుతమైన అవకాశాలను కల్పించనున్నాయని, ఈ సందర్భంగా సినీ రంగ నిపుణులతో జరిగే ప్యానెల్‌ చర్చల్లో చలన చిత్ర కౌశలానికి సంబంధించిన ఎన్నో విషయాలు చర్చించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో లఘు చిత్రోత్సవ నిర్వాహకులు, దాదా సాహెబ్‌ ఫాల్కే స్కూల్‌ ఆఫ్‌ ఫిలిం స్టడీస్‌ ప్రిన్సిపాల్‌ నందన్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page