– ఖచ్చితమైన నిర్ణయాలు, సౌమ్య స్వభావం ఆయన ప్రత్యేకత
– మావోయిస్టుల అణచివేతలో కీలక పాత్ర
– శాంతిభద్రతల డీజీపీ మహేష్ ఎం భగవత్
– శివధర్ రెడ్డికి ఘనంగా వీడ్కోలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఉత్తమ ఇంటెలిజెన్స్ అధికారులలో శివధర్ రెడ్డి ఒకరని, ఆయన హయాంలో వందలాదిమంది మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిశారని శాంతిభద్రతల డీజీపీ మహేష్ ఎం భగవత్ గుర్తు చేశారు. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం డీజీపీ కార్యాలయ టీఎన్జీవోస్ యూనిట్ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పోలీస్ శాఖలోని పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొని శివధర్ రెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మహేష్ ఎం భగవత్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తం గా గుర్తింపు పొందిన ఉత్తమ ఇంటలిజెన్స్ అధికారులలో శివధర్ రెడ్డి ఒకరని కొని యాడారు. ఆయన నాయకత్వంలో వంద లాది మంది మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిశారని గుర్తు చేశారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఆయన చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ రాష్ట్రవ్యాప్తంగా మంచి ఫలితాలను ఇచ్చిందని తెలిపారు. పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో తీవ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా ఉన్న సమయంలో శివధర్ రెడ్డి వారిని ఎదుర్కోవడంలో అహర్నిశలు శ్రమించారన్నారు. మావోయిస్టులు ఆయన మీద ఉన్న నమ్మకంతోనే భారీ సంఖ్యలో లొంగిపోయారని పేర్కొన్నారు. డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ తాను ఏ హోదాలో పనిచేసినా తన పరిధి మేరకు ప్రజలకు న్యాయం చేసేందుకే కృషి చేశానని తెలిపారు. గతంలో ఏడు సంవత్సరాలకు పైగా డీజీపీ కార్యాలయంలో పనిచేయడం వల్ల తనకు అన్ని విభాగాలపై పూర్తి అవగాహన ఉందన్నారు. కొత్తగా విధుల్లో చేరిన వారు నామమాత్రంగా కాకుండా పోలీస్ శాఖ సమర్థతను పెంచేలా కష్టపడి పనిచే యాలని సూచించారు. క్షేత్రస్థాయి పోలీసులు విజయం సాధించాలంటే కార్యాలయాల్లోని మినిస్టీరియల్ సిబ్బంది సహకారం ఎంతో అవసరమని ఆయన అన్నారు. కార్యాలయ సిబ్బంది శివధర్ రెడ్డిని మృదుభాషిగా, స్నేహపూర్వక అధికారిగా, కఠిన నిర్ణయాలు తీసుకోగల సమర్థుడిగా అభివర్ణించారు. వివిధ విభాగాల ఉద్యోగులు డీజీపీని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీజీ స్వాతి లక్రా, చారు సిన్హా, అడిషనల్ డీజీపీ డి.ఎస్.చౌహాన్, ఐజీపీలు చంద్రశేఖర్ రెడ్డి, గజరావు భూపాల్, టిఎన్జీవోస్ యూనిట్ అధ్యక్షుడు ఆర్.ఉపేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి టి.శివరంజని తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




