– కాంగ్రెస్-డీఎంకేను గెలిపించండి
– ఆ సాంప్రదాయన్ని కొనసాగించండి
– విభజన రాజకీయాలకు చెక్ పెట్టండి
– తమిళ ఓటర్లకు మంత్రి ఉత్తమ్ పిలుపు
చెన్నై, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15 : లౌకికవాదానికి తమిళనాడు పెట్టని కోట అని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అలాంటి లౌకికవాదం కొనసాగాలి అంటే ఈ ఎన్నికలలో డిఎంకే-కాంగ్రెస్ అభ్యర్డులను బలపరచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. తమిళనాడు ఎన్నికల పరిశీలకుడిగా నియమితులైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మూడు రోజులుగా వివిధ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న విషయం విదితమే. అందులో భాగంగా బుధవారం కోయంబత్తూరు సమీపంలోని సింగనల్లూర్ నుండి కవుండంపాలెం వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన శివకాశికి చేరుకుని అక్కడ ఎన్నికల సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ తమిళనాడులో విభజన రాజకీయాలకు చోటు లేదని స్పష్టం చేశారు. బీజేపీకి ఇక్కడ ప్రవేశం కూడా ఉండొద్దని ఓటర్లకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 21 పార్టీలతో ఏర్పడిన సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ దిల్లీ నుండి గ్రామీణ స్థాయి వరకు విజయవంతంగా కొనసాగుతున్నదన్నారు. భవిష్యత్ ప్రధానిగా రాహుల్ గాంధీ నాయకత్వం కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నార,ని ప్రజల ఆకాంక్ష ప్రతిబింపచేసేలా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. శివకాశి నుండి డీఎంకే బలపర్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి.అశోకన్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రాజకీయాల కోసం కూటమి ఏర్పడలేదని, ప్రజా సంక్షేమం, అభివృద్ధితో దేశాన్ని ముందుకు నడిపించేందుకు ఏర్పడిందని తేల్చిచెప్పారు. మహిళా సాధికారతకు కూటమి కట్టుబడి పనిచేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ పనితీరును ఆయన ప్రశంసిస్తూ తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే 300 రోజుల వ్యవధిలో మూడు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర పోలీసు శాఖలో అర్హులైన పదివేల మంది మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అంతేగాక రాష్ట్రంలో ప్రస్తుతం మహిళలకు అందిస్తున్న రూ.1000ల ఆర్థిక సహాయాన్ని రూ.2000కి పెంచి నెలవారీగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ ప్రజల స్పందన చూస్తుంటే ముఖ్యమంత్రిగా మరోసారి స్టాలిన్‌ను బలపరిచేందుకు డీఎంకే-కాంగ్రెస్ కూటమిని గెలిపిస్తారనే నమ్మకం బలపడిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




