– పిల్లలమర్రి శివారులో రోడ్డు ప్రమాదంలో మృతి
– భట్టి, పొంగులేటి, తుమ్మల దిగ్బ్రాంతి
ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15 : మహమ్మద్ జావీద్.. కరడుగట్టిన కాంగ్రెస్‌వాది. మైనార్టీ నాయకుడు. అతని మోముపై ఎపుడు చిరునవ్వే ఉంటుంది. పదేళ్ల బీఆరఎస్ పాలనలోనూ కాంగ్రెస్ జెండా విడవలేదు. పార్టీ తరఫున ఆందోళనలు నిర్వహించారు. ఖమ్మం ఎమ్మెల్యే కాంగ్రెస్ టికెట్ చేజారగా పార్టీ సమీకరణాల దృష్ట్యా తుమ్మల నాగేశ్వర రావు ఇక్కడినుంచి పోటీ చేసి విజయం సాధించారు. జావీద్(56) ఇక లేరనే విషయం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం నింపింది. ఖమ్మం-హైదరాబాద్ జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ ఖమ్మం నగర మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత మహమ్మద్ జావీద్ ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేట పిల్లలమర్రి శివారులో ఆయన ఒక్కరే ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి అతివేగంగా డివైడర్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టగా అక్కడికక్కడే మృతిచెందారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అనుచరునిగా కొనసాగుతున్నారు. ఏడేళ్లపాటు పార్టీ ఖమ్మం నగర అధ్యక్షునిగా పనిచేశారు. ఆ పదవి నుంచి ఆరు నెలల కిందటే పీసీసీ సభ్యునిగా నియమితులయ్యారు. భట్టి ‘పీపుల్స్ మార్చ’ విజయవంతం కోసం శ్రమించారు. సీఎం రేవంత్ రెడ్డి నాటి ప్రతిపక్ష నేతగా ఖమ్మం పర్యటనలో అండగా నిలిచారు. బుధవారం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పర్యటనను విజయవంతం చేశారు. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగాన్ని పార్టీ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఖమ్మం రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జావేద్ పార్టీ కోసం నిరంతరం అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. జిల్లా కమిటీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, ఖమ్మం డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి, జిల్లా మాజీ అధ్యకుడు దుర్గా ప్రసాద్, 50వ డివిజన్ కార్పొరేటర్ రాపర్తి శరత్ కుమార్ సంతాపం తెలియజేశారు. సంఘటన ప్రాంతానికి వెళ్లారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి సంతాపం తెలియజేశారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, బీఆరఎస్ రాజ్య సభ సభ్యుడు రవిచంద్ర, బీజేపీ రాష్ట్ర నేత దేవకీ వాసుదేవరావులు కూడా సంతాపం తెలిపారు. రాత్రికి ఖమ్మంలోని వైఎసఆర్ నగర్ ఏరియాలోని రెడ్ హిల్స్ కాలనీకి జావీద్ పార్థివ దేహాన్ని తీసుకొచ్చారు. గురువారం ఉదయం పార్టీ జిల్లా కార్యాలయానికి పార్థివ దేహాన్ని తీసుకురానున్నారు. జావీద్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె షహెల కుర్రత్ బీటెక్ పూర్తి చేసి లా చదువుతోంది. చిన్న కుమార్తె మదీనా సభాహత్ మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



