– డీలిమిటేషన్ రాజకీయ సవరణగా మిగలొద్దు
– మహిళా రిజర్వేషన్లకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు
– పునర్విభజనతో ముడిపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాం
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక
– రేవంత్ రెడ్డి ఒక ‘హైబ్రిడ్’ ముఖ్యమంత్రి
– ఆయన రాజకీయ వైఖరిలో స్థిరత్వం లేదు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15 : పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న డీలిమిటేషన్ బిల్లులో ఉన్న అస్పష్టతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ సీట్ల శాతం 24% గానే కొనసాగాలని, దీనిని మార్చే ప్రయత్నం చేస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంతో ఆడుకుంటే తీవ్రమైన తిరుగుబాటు వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పాలనను కేవలం రాజకీయాల మీద కాక ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని పలు న్యూస్ ఏజెన్సీలతోపాటు ఫిర్జాదిగూడ మీటింగ్‌లో మాట్లాడిన కేటీఆర్ సూచించారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడమే కాక అసెంబ్లీ, కౌన్సిల్‌లో ఏకగ్రీవ తీర్మానాలు కూడా చేసిందని గుర్తు చేశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50%, మార్కెట్ కమిటీల్లో 33% రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా మహిళా సాధికారత పట్ల తమకున్న అచంచలమైన నిబద్ధతను చాటుకున్నామన్నారు. అయితే మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్), రాజ్యాంగ సవరణలతో అనవసరంగా ముడిపెట్టడాన్ని కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. అత్యంత సరళమైన విషయాన్ని కేంద్రం ఎందుకు సంక్లిష్టం చేస్తోందని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయండి. పార్లమెంటులో 543 సీట్లు ఉన్నాయి, అక్కడ వర్తింపజేయండి. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.. ఇక్కడా అమలు చేయండి. సీట్ల పెంపు, పునర్విభజనతో ముడిపెట్టి ఎందుకు అయోమయాన్ని సృష్టిస్తున్నారు అని నిలదీశారు. రాజ్యాంగ విధివిధానాల ప్రకారం మొదట జనగణన, తర్వాత నియోజకవర్గాల పునర్విభజన, ఆ తర్వాతే నిర్మాణాత్మక మార్పులు జరగాలని కేటీఆర్ స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలగని ఏ సహేతుకమైన ప్రతిపాదనకైనా బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని, కానీ దక్షిణాదికి అన్యాయం చేసే ప్రయత్నం జరిగితే మాత్రం తీవ్రంగా ప్రతిఘటిస్తామని, అవసరమైతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లులో ఉన్న అస్పష్టతలపై ఆందోళన వ్యక్తం చేశారు. 50% సీట్లు పెరుగుతాయని కేంద్ర నేతలు చెబుతున్నప్పటికీ బిల్లులో మాత్రం ఆ ప్రస్తావన లేదన్నారు. నియోజకవర్గాల పునర్విభజన అంశంపై 2022-23 నుంచే బీఆర్ఎస్ గళమెత్తుతోందంటూ కేవలం జనాభా ప్రాతిపదికన పార్లమెంటు సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పునరుద్ఘాటించారు. 1971లో పార్లమెంటు సీట్లపై విధించిన స్తంభన జనాభా నియంత్రణ ప్రాతిపదికన జరిగిందని కేటీఆర్ గుర్తు చేశారు. గత ఐదు దశాబ్దాలుగా దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ చర్యలను విజయవంతంగా అమలు చేశాయని తెలిపారు. జాతీయ జనాభా విధానాన్ని తూచా తప్పకుండా పాటించినందుకు ఇప్పుడు మమ్మల్ని శిక్షిస్తారా అని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం సుమారు 24% ఉందని, ఈ శాతాన్ని ఏ స్థితిలోనైనా కాపాడాలని నొక్కి చెప్పారు. 0.01% శాతం తగ్గుదల కూడా మాకు ఆమోదయోగ్యం కాదు.. దీనిని మార్చే ప్రయత్నం చేస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదన్నారు. ఈ ఆందోళనలను పట్టించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ‘మీరు ఒక నిప్పుల కుంపటి మీద కూర్చున్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంతో ఆడుకుంటే తీవ్రమైన తిరుగుబాటు వస్తుంది అని అన్నారు. ఇలాంటి చర్యలను అడ్డుకునేందుకు ఇతర పార్టీలతో కలిసి పనిచేస్తామని చెప్పారు.
రేవంత్ హైబ్రిడ్ ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ ఆయనను ఒక ‘హైబ్రిడ్ ముఖ్యమంత్రి’గా కేటీఆర్ అభివర్ణించారు. రేవంత్ రాజకీయ వైఖరిలో స్థిరత్వం లేదని, ఉదయం ఆయన కాంగ్రెస్‌కు ప్రతినిధిగా ఉంటారు.. సాయంత్రానికి బీజేపీతో కలిసిపోతారు.. సహజంగానే ఇలాంటి హైబ్రిడ్ విధానం ఆయన పాలనలో కూడా కనిపిస్తోంది అని వ్యాఖ్యానించారు. ఇతరుల నుంచి నిబంధనలు కోరుతున్న ముఖ్యమంత్రి హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించే ప్రతిపాదన విషయంలో జీహెచ్ఎంసీ ప్రతినిధులు, జెడ్పీటీసీ సభ్యులు లేదా ఎమ్మెల్యేలను ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించారు. మీకో విధానం, ఇతరులకో విధానం అంటే కుదరదు. ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేయకుండా స్పష్టతతో, బాధ్యతతో మాట్లాడాలి అని ఆయన హితవు పలికారు.
ముప్పై నెలలు అవుతున్నా నెరవేరని హామీలు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్లు అయింది.. ఎన్నికలలో అడ్డగోలుగా హామీలకు గ్రామీణ అమాయకులు నమ్మి ఓట్లు వేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జిల్లా ప్రజలు మాత్రం కాంగ్రెస్ మాటలు నమ్మలేదని, ఒక్క సీటు కూడా వాళ్ళకు ఇవ్వలేదంటూ పీర్జాదిగూడ ప్రజలకు అభినందనలు తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడ డివిజన్‌నుంచి పెద్దఎత్తున బీఆర్ఎస్ లోకి చేరికల సందర్భంగా ఆయన మాట్లాడారు. అత్తకు రూ.4000, కోడలికి రూ.2500 ఇస్తాం అన్నారు.. ఆషాఢం సేల్ లెక్క అడ్డగోలు హామీలు ఇచ్చుకుంటూ పోయారు. ముఖ్యమంత్రి గారూ.. మీరు ఇస్తామన్న స్కూటీలు ఎక్కడ, మహిళలకు ఇస్తామన్న రూ.2,500 ఎక్కడ అని అడిగితే ఎంత కండలు తిరిగిన మొగోడు అయినా మూడు నెలల్లో పిల్లలు పుట్టించరు కదా అన్నాడన్నారు. అయితే మూడు నెలలు కాదు.. 30 నెలలు అయినా పుట్టకపోతే ఏం అంటారు అని కేటీఆర్ సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు. ఆడ పిల్ల పుడితే రూ.13వేలు, మగ పిలగాడు పుడితే రూ.12వేలు ఇచ్చి తల్లీబిడ్డను ఇంటి దగ్గర దించి వచ్చేలా నాడు కేసీఆర్ సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అనేక పథకాలు రద్దయ్యాయని తెలిపారు. హైద్రాబాద్‌లో ఎవరైనా సంతోషంగా ఉన్నారంటే ఇద్దరే ఇద్దరు.. ఒకరు దొంగలు, మరొకరు దోమలు అని కేటీఆర్ వ్యంగ్యంగా అన్నారు. హైదరాబాద్‌లో ఎక్కడపడితే అక్కడ భూములు కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌కు దోమలబాదు, దోమలగూడ అని పేరు పెట్టమని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రికి తాను అసెంబ్లీలో చెప్పానన్నారు. కేసీఆర్‌ను బద్నాం చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి తప్పించుకునే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. తప్పించుకునే పరిస్థితి లేదు.. వాళ్ళను కచ్చితంగా నిలదీయాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణం భూమి పుట్టినప్పటి నుండి నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టి ఎనిమిదేండ్లయింది.. ఈ ప్రాజెక్టు పని ఎక్కడిది అక్కడే ఉందని విమర్శించారు. తాము కడతాం అంటే లేదు లేదు తామే కడతాం అని కేంద్రం అన్నదన్నారు. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఈ జిల్లాలో మూడుకు మూడు క్లీన్ స్వీప్ చేశామన్నారు. సెప్టెంబర్‌లోనో అక్టోబరులోనో జీహెచఎంసీ ఎన్నికలు అంటున్నారు.. వాళ్లను గెలిపిస్తే ఇక్కడకు మళ్ళీ బుల్డోజర్ వస్తుంది.. అందుకే బీఆరఎస్‌కి ఓటు వేయాలి అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మీకు అండగా ఉంటాం అని చెప్పారు.
——————————————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





