అనేక ఒత్తిళ్లను ఎదుర్కొని ఆయన సేవలందించారు..
మన్మోహన్, పీవీలను అవమానించిన చరిత్ర నెహ్రూ కుటుంబానిది
:కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 30 : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల సోనియా కుటుంబం, కాంగ్రెస్ పార్టీ కుటిల రాజకీయాలు చేస్తుండడం చూసి దేశ ప్రజలు అసహ్యించుకుంటున్నారని కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి
అన్నారు. మన్మోహన్ సింగ్ దేశ ప్రజలందరూ గౌరవించుకునే వ్యక్తి అని, అలాంటి వ్యక్తిపై కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయడం అమానవీ యమని, ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కారహీనానికి అద్దం పడుతున్నదని మండిపడ్డారు. మన్మోహన్ సింగ్ దేశానికి పదేళ్ల పాటు అనేక ఒత్తిళ్లు, అనేక అవమానాలను ఎదుర్కొని సేవలదించిన విష యాన్ని దేశ ప్రజలెవరూ మర్చిపోరని తెలిపారు. మన్మోహన్ సింగ్ మరణించారని తెలియగానే వెంటనే ప్రధానమంత్రి నిర్ణయం తీసుకున్నారు. అటల్ బిహారీ వాజ్ పేయికి ఏవిధంగా అంతిమ సంస్కారాలు నిర్ణయి ంచారో.. మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి అదేవిధంగా అంత్యక్రియలు నిర్వహించాలని కేంద్రం నిర్వహించింది. ఆ బాధ్యతను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అప్పగించారు. అందుకు అనుగుణంగా మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరిగాయి.
అటల్ బిహారీ వాజ్ పేయికి స్మారక కేంద్రాన్ని నిర్మించినట్లుగానే.. మన్మోహన్ సింగ్ కు కూడా స్మారక కేంద్రాన్ని నిర్మించాలని.. మన్మోహన్ కన్నుమూసిన మూడు గంటల్లోనే నిర్ణయం తీసుకున్నారని కిషన్ రెడ్డి వెల్లడిరచారు. గతంలో ట్రస్టుల ద్వారానే స్మారక కేంద్రాలు నిర్మించారు. అదేవిధంగానే ట్రస్టు ఏర్పాటు చేసేందుకు మన్మోహన్ సింగ్ సతీమణితో మాట్లాడారు. ట్రస్టు పేరుతో భూమిని ట్రాన్స్ ఫర్ చేసి స్మారక కేంద్రాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసేలా నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా మన్మోహన్ కుటుంబ సభ్యులను ఓదార్చడంతో పాటు కేబినెట్ మంత్రులు అంతిమసంస్కార కార్యక్రమాల్లో పూర్తిస్థాయిలో పాల్గొన్నారు. దేశ మాజీ ప్రధానులందరికీ ఏ నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టారో.. అదేవిధంగా మన్మోహన్ సింగ్ స్మారక కట్టడం విషయంలో ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం, దుందుడుకుతనంతో వ్యవహరించడం, చివరికి బోర్లా పడటం ఆయనకు అలవాటైంది. ఒక మహానుభావుడి విషయంలో అలానే వ్యవహరించడం చూసి ప్రజలందరూ బాధపడ్డారని అన్నారు. మొదటి నుంచి నెహ్రూయేతర కుటుంబాలకు సంబంధించిన వారు ప్రధానమంత్రులుగా, రాష్ట్రపతులుగా బాధ్యతలు నిర్వహించినా.. వారిపట్ల నెహ్రూ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అవమానించిందని ఆరోపించారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పట్ల, కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ గా వ్యవహరించిన ప్రణబ్ ముఖర్జీ పట్ల కాంగ్రెస్ పార్టీ అవమానకరంగా వ్యవహరించిందన్నారు.
మన్మోహన్ సింగ్ పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తూ మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సోనియా కుటుంబం ఏ విధంగా అవమానించారో ప్రజలందరికీ తెలుసన్నారు. గతంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఆర్డినెన్స్ ను… రాహుల్ గాంధీ మీడియా సమక్షంలో ‘‘బక్వాస్’’ అంటూ ఆర్డినెన్స్ కాపీని మీడియా ముఖంగా చించివేశారని గుర్తుచేశారు. మన్మోహన్ సింగ్ పట్ల.. రాహుల్ గాంధీ రాజకీయం కోసం దొంగ ప్రేమను ఒలకబోస్తున్నారు. దేశంలో విద్యావంతులు, మేధావులు, మీడియా, పార్టీలు.. రాహుల్ గాంధీ అహంకారపూరిత, దివాలాకోరుతనానికి ఖండిస్తున్నారు. పదేళ్ల పాటు ప్రధానమంత్రిగా పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మన్మోహన్ సింగ్ గౌరవార్థం టెన్ జనపథ్ లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన విందును రాహుల్ గాంధీ ఎందుకు బహిష్కరించారో సమాధానం చెప్పాలన్నారు. 2007లో ప్రధాని మన్మోహన్ సింగ్ 2 జీ స్పెక్ట్రం వేలం వేయాలని టెలికాం మంత్రి ఎ.రాజాకు ఉత్తరం రాశారు. కానీ, మన్మోహన్ సింగ్ నిర్ణయానికి విరుద్ధంగా, సోనియా గాంధీ ఆదేశాలతో 2జీ స్పెక్ట్రం కుంభకోణానికి తెరలేపారు. దీంతో టెలికం మంత్రి ఎ.రాజా జైలుకెళ్లారు. గతంలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మన్మోహన్ సింగ్ ని అనేక రకాలుగా అవమానించారు. ఆరోజు ఏ కాంగ్రెస్ నేత ఖండిరచలేదు. కాని, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ నవాజ్ షరీఫ్ వ్యాఖ్యలపై ఖండిరచారు. యూపీఏ ప్రభుత్వంలో పూర్తి నిర్ణయాధికారాలు యూపీఏ చైర్ పర్సన్ గా ఉన్న సోనియా గాంధీ చేతుల్లోనే ఉండేవి. తమ కనుసైగల్లోనే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పనిచేయాలనే భావనతో, బలవంతంగా ఆదేశాలిచ్చి ఫైళ్ల మీద సంతకాలు పెట్టించారనడానికి ఒక ఉదాహరణ 2జీ స్పెక్ట్రం కుంభకోణమని ఆరోపించారు.
షాడో ప్రైమ్ మినిస్టర్స్ గా సోనియా గాంధీ- రాహుల్ గాంధీ ప్రవర్తించారు. మన్మోహన్ సింగ్‌ని అడుగడుగునా అవమానించేలా వ్యవహరించారని తెలిపారు. 2008లో బీజింగ్ లో ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభమైతే అనేక దేశాల అధినేతలను, ప్రపంచస్థాయి నాయకులందరినీ ఒలింపిక్స్ కమిటీ ఆహ్వానించింది. కాని, భారత ప్రధానమంత్రికి ఆహ్వానం అందలేదు. సోనియా గాంధీ-రాహుల్ గాంధీకి ఆహ్వానాలు వొచ్చాయి. అలా ఆహ్వానాలు తెచ్చుకుని మన్మోహన్ సింగ్‌ను అవమానించారు. చైనా ఒలింపిక్స్ క్రీడల సమయంలో విదేశాంగ శాఖ అనుమతి లేకుండానే పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో తో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. చైనాకు సంబంధించిన జిన్ పింగ్ ను కలిసి భారత్-చైనా మధ్య సమాచార మార్పిడిపై ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతర్జాతీయ వ్యవహారాల్లోనూ నాటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ని దూరంగా పెట్టిన చరిత్ర నెహ్రూ కుటుంబానిదని కిషన్ రెడ్డి విమర్శించారు. . మన్మోహన్ సింగ్ ప్రధానిగా పదేళ్ల కాలంలో సాధించిన ప్రభుత్వ ఘనతలను సోనియా-రాహుల్ గాంధీ అకౌంట్ లో వేసుకున్నారు. ప్రభుత్వ ఫెయిల్యూర్స్ ఉంటే మన్మోహన్ సింగ్‌పై నెట్టారని తెలిపారు.
ఎలాంటి అవినీతి ముద్ర లేకుండా ప్రధానిగా మన్మోహన్ సింగ్ మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రధానిగా ఆయన ఉన్న సమయంలో జరిగిన కుంభకోణాలకు సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీయే కారణమని మండిపడ్డారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్ తో పాటు అనేకమంది గొప్ప నాయకులను అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. సర్దార్ వల్లభాయ్ పటేల్ కూతురు దిల్లీలో నివాసముండేందుకు అనుమతి కోరితే.. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఇల్లు కూడా కేటాయించలేదు. 2004లో తెలుగుబిడ్డ, దేశానికి ఎనలేని సేవలు చేసిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావుని అవమానపర్చింది, పీవీ దిల్లీలో మరణిస్తే.. కాంగ్రెస్ పార్టీ సాధారణ నాయకులకు దక్కిన గౌరవాన్ని కూడా పీవీకి దక్కకుండా అవమానపర్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. సోనియాగాంధీ బెదిరింపులతో.. పీవీ అంతిమయాత్ర తర్వాత ఆయన పార్థివదేహాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి కూడా తీసుకుపోనివ్వలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా.. పీవీ స్మారక కేంద్రాన్ని నిర్మించలేదని తెలిపారు. పీవీ నరసింహారావుకు భారతరత్న అవార్డు 2024లో నరేంద్ర మోదీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం గౌరవించిందని తెలిపారు.
పీవీకి భారతరత్న అవార్డు ఇస్తున్న సమయంలో కనీసం కాంగ్రెస్ నాయకులు ప్రశంసించిన పాపాన కూడా రాలేదు. రాష్ట్రపతి భవన్ లో మల్లిఖార్జున్ ఖర్గే వంటి కాంగ్రెస్ నాయకులు వొచ్చినా చప్పట్లు కొట్టలేదు.
కాంగ్రెస్ పార్టీ.. తమ సొంత పార్టీకి సంబంధించిన ప్రధానమంత్రుల పట్ల కూడా అగౌరవంగా, అవమానపర్చింది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దిల్లీలోని యమునా నది ఒడ్డున ఏక్తా స్థల్ పేరిట ప్రముఖ స్మారకాన్ని ప్రారంభించారు. భారతదేశ ప్రధాన మంత్రులకు సంబంధించిన జీవిత చరిత్రను తెలియజేసేలా నిర్మాణాలను ఏర్పాటు చేశారు. పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ ఇద్దరూ కలిసి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు. సొంత పార్టీకి సంబంధించిన ప్రధాన మంత్రులను కూడా అగౌరవపర్చిన వక్రబుద్ధి కాంగ్రెస్ పార్టీదని అన్నారు. యూపీఏ పాలనలో దేశంలో అనేక రహదారులు, యూనివర్సిటీలు, విమానాశ్రయాలు, పరిశోధన సంస్థలు, ప్రభుత్వ పథకాలకు నెహ్రూ కుటుంబానికి సంబంధించిన పేర్లు మాత్రమే పెట్టారు. దేశంలో ప్రముఖులు, నాయకుల పేర్లు పెట్టలేదు. క్రీడలకు కూడా రాజీవ్ గాంధీ పేరిట ఖేల్ రత్న అవార్డులు ప్రకటించారు. మన్మోహన్ సింగ్ మరణం పట్ల ఏడు రోజులు రాష్ట్ర ప్రభుత్వాలు సంతాప దినాలుగా ప్రకటిస్తే ఆ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ మాత్రం నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు వియత్నాం వెళ్లాడని అన్నారు. మన్మోహన్ సింగ్, పీవీని అవమానించిన రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు నీతులు వల్లించడం సిగ్గుచేటని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.





