బాలికపై లైంగిక దాడి కేసు.. రాజ‌కీయ దుమారం

– నిమ్స్ లో బాధితురాలికి వివిధ పార్టీల నేత‌ల ప‌రామ‌ర్శ‌
– మెరుగైన వైద్య‌సేవ‌లందించాల‌ని సూచ‌న‌లు

ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 11 : ఖమ్మం నగరంలోని రాపర్తి నగర్‌లో 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. కార్ డ్రైవర్ మహ్మద్ గౌస్ (57) లైంగిక దాడికి యత్నించి, ఆ విషయం బయటకు వస్తుందనే భయంతో ఆమెను అపార్ట్‌మెంట్ ఐదో  అంతస్తు పైనుంచి కిందకు తోసేశాడు. దీంతో పేద బాలిక వెన్నెముక, పక్కటెముకలు విరిగి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఆమె కు ప్రస్తుతం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలు అందజేస్తున్నారు. పలు రాజకీయ పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు గురువారం నిమ్స్ బాట పట్టారు. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితిని చూసి చలించిపోయారు. నిమ్స్ డైరెక్టర్ రాహుల్ తో మాట్లాడారు. బాలికకు అందుతున్న వైద్య చికిత్సల వివరాలను తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఎటువంటి పరిస్థితి ఎదురైనా ముందు తనకు తెలియజేయాలని మంత్రి సూచించారు. బాలిక తల్లిదండ్రులతో కూడా మాట్లాడి ధైర్యం చెప్పారు తాను అండగా ఉంటానని ప్రభుత్వం తరఫున అందాల్సిన అన్ని రకాల సహాయం అందిస్తానని తెలిపారు. అక్కడ ఉన్న ఐసిడిఎస్ అధికారులతో మాట్లాడిన తుమ్మల బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంఘటన జరిగిన రోజున ఫోన్ లో బాధిత కుటుంబంతో మాట్లాడారు.

మాజీ మంత్రి హరీష్ పరామర్శ

మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, మాజీ మంత్రి  సునీతా లక్ష్మారెడ్డి బాధిత బాలికను పరామర్శించారు. నిమ్స్ వైద్యులతో మాట్లాడి బాలిక ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, అందుతున్న చికిత్స వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. పేదల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధ్యత లేదా ?  చిన్న పాపకు కనీసం ఉచితంగా మందులు అందించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందా  అని ప్రశ్నించారు. బాధిత కుటుంబం నిమ్స్ ఆసుపత్రి సమీపంలో మందులు కొనుగోలు చేస్తున్నదని ఆ బిల్లులను చూయించారు. ఖమ్మంలో ప్రభుత్వ ఆసుపత్రి చేర్చుకోకపోవడంతో ప్రైవేటులో రూ.40 వేల అప్పు చేసి ఖర్చు చేసుకున్నారు. నిమ్స్ కు వస్తే ఇక్కడా ప్రభుత్వ డాక్టర్లు మందులు బయట కొనుక్కోమని చెప్పడం ప్రభుత్వ అమానవీయ తీరుకు నిదర్శనమని మండిపడ్డారు.

బీజేపీ నేతల పరామర్శ

బాధితురాలిని బీజేపీ రాష్ట్ర నాయకుల బృందం పరామర్శించింది. ఈ బృందంలో రాష్ట్ర కార్యదర్శి, ఖమ్మం జిల్లా ప్రభారీ బద్దం మహిపాల్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు,రాష్ట్ర అధికార ప్రతినిధులు వాకధాని పుల్లారావు యాదవ్,నంబూరి రామ లింగేశ్వరరావు తదితరులు ఉన్నారు. నేరుగా ఆసుపత్రికి చేరుకున్న వీరు బాలిక పరిస్థితిని చూసి తీవ్రంగా చలించిపోయారు. అభం శుభం తెలియని పసికందు రెండు చేతులు విరిగిపోయి, తిరిగి నడవలేని దీనస్థితిలో ఉండటం హృదయ విదారకమని, ఆ పాప తిరిగి సాధారణ స్థితికి రావడం కష్టమని వైద్యులు చెబుతుండటం అత్యంత బాధాకరమని అన్నారు. నిమ్స్ వైద్యులతో ప్రత్యేకంగా మాట్లాడి బాలిక ప్రాణాలను కాపాడేందుకు ఎటువంటి లోటు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి పార్టీ అండగా ఉంటుందని మనోధైర్యాన్ని కల్పించారు. ఇంత ఘోరం జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత అమానవీయంగా ఉందని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ ఆ పేద కుటుంబానికి కనీస పట్టింపు లేకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్ష నేతలు వస్తున్నారంటే వంద మంది పోలీసులను మోహరించడంపై ఉన్న శ్రద్ధ ఆ పసిపాపకు ఉచితంగా మందులు ఇప్పించడంపై ప్రభుత్వానికి లేకపోవడం దారుణమని ఆరోపించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *