– ప్రారంభించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19: హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నిర్వహిస్తున్న కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ ఎగ్జిబిషన్ – అమృత్‌ను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లలో నిర్మాణ రంగంలో వినియోగించే ఆధునిక యంత్ర పరికరాలైన జేసీబీలు, రోలర్లు, హిటాచీలు, క్రేన్లు, ఇతర భారీ యంత్రాలను మంత్రి సీతక్క పరిశీలించారు. ఆయా సంస్థల ప్రతినిధులతో మాట్లాడి యంత్రాల పనితీరు, వినియోగం, సాంకేతికత గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఇలాంటి భారీస్థాయి కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ ఎగ్జిబిషన్ నిర్వహించడం సంతోషకరమని, నిర్మాణ రంగానికి అవసరమైన అత్యాధునిక యంత్ర పరికరాలను ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. దేశ విదేశాల్లో వినియోగంలో ఉన్న ఆధునిక సాంకేతిక పరికరాలను తెలంగాణ ప్రజలకు, పరిశ్రమలకు, నిర్మాణరంగ ప్రతినిధులకు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఈ ఎగ్జిబిషన్ నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. భారీ నిర్మాణ ప్రాజెక్టులు, సివిల్ వర్క్స్, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు ఉపయోగపడే అనేక యంత్రాలను ప్రదర్శనలో ఉంచడం వల్ల పరిశ్రమలు, కాంట్రాక్టర్లు, యువ పారిశ్రామికవేత్తలకు ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులోకి రావడం ద్వారా అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని చెప్పారు. ఎగ్జిబిషన్ నిర్వాహక బృందాన్ని మంత్రి అభినందించారు. అలాగే ప్రదర్శనలో పాల్గొంటున్న దేశీయ, అంతర్జాతీయ కంపెనీలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, పారిశ్రామిక పురోగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




