– విద్య, నైపుణ్యాభివృద్ధి, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి అవసరం
– ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మిస్తున్నామని వెల్లడి
– నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్ 11 : దేశ అభివృద్ధికి విద్య, వైద్యమే బలమైన పునాది అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దిల్లీలో రాష్ట్రపతి భవన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. విద్యా విప్లవం, నైపుణ్యాభివృద్ధి, ప్రపంచస్థాయి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి అవసరమన్నారు. వికసిత్ భారత్-2047 లక్ష్యాన్ని సాధించాలంటే దేశంలోని ప్రతి విద్యార్థికి, పౌరుడికి నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలని సీఎం చెప్పారు. ప్రజలను ఆర్థిక శక్తులుగా, దేశ నిర్మాతలుగా తీర్చిదిద్దడంలో విద్య, ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. కులగణన తర్వాత తెలంగాణ అభివృద్ధి నమూనాను వివరించారు. తెలంగాణ ప్రభుత్వం 2024లో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయని సీఎం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3.55 కోట్ల మంది, 242 కులాలకు చెందిన ప్రజల వివరాలను సేకరించిన ఈ సర్వేలో పైసలు, భూమి కంటే విద్యే సామాజిక వెనుకబాటుతనాన్ని ప్రభావితం చేస్తున్న ముఖ్యమైన అంశంగా తేలిందని చెప్పారు. అందుకే ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య అందించడం ద్వారా మాత్రమే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించవచ్చని స్పష్టం చేశారు.
తెలంగాణలో విద్య-నైపుణ్యాభివృద్ధి విప్లవం
విద్యాశాఖను తన వద్దే ఉంచుకోవడానికి కారణం విద్యపై తనకు ఉన్న నమ్మకమేనని సీఎం రేవంత్ రెడ్డి నొక్కి చెప్పారు. గత 75 ఏండ్లలో మనమంతా ఉచిత విద్య అందించేందుకు ప్రయత్నం చేశామని, కానీ నాణ్యమైన విద్యను అందించడం మనకు ఒక సవాలుగా మారిందని అన్నారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తూ తమ ప్రభుత్వం విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టిందన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ తరగతులు, ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, పాఠశాల బస్సులు, క్రీడా సౌకర్యాలు, నాణ్యమైన బోధన అందిస్తున్నామని తెలిపారు. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే క్యాంపస్‌లో చదివే అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. సమాజంలో సమానత్వం పెంపొందించేందుకు ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. అన్ని వర్గాల పిల్లలు కలిసి చదువుకోవడం, కలిసి జీవించడం ద్వారా కుల వివక్ష తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి అయినా, అధికారులైనా తమ రాష్ట్రంలోని యంగ్ ఇండియా స్కూల్స్ చూడాలంటే సంతోషంగా చూపిస్తామని చెప్పారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) యుగంలో యువతకు కొత్త నైపుణ్యాలు అవసరమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తయారీ, సేవారంగాల్లో భారీ ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు రీజినల్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రైల్వే, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. యువతకు ప్రపంచ స్థాయి శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆనంద్ మహీంద్రా, శ్రీని రాజు వంటి కార్పొరేట్ దిగ్గజాలు ఈ యూనివర్సిటీ నిర్వహణలో భాగస్వాములుగా ఉన్నారని వివరించారు. రాష్ట్రంలోని అన్ని ఐటీఐలను ఆధునిక సాంకేతిక శిక్షణ కేంద్రాలుగా మార్చేందుకు టాటా గ్రూప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని సీఎం తెలిపారు. ఈ ప్రాజెక్టులో టాటా సంస్థ రూ.2,100 కోట్ల పెట్టుబడి పెడుతుందన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్‌లో భాగంగా 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చెప్పారు. ఉన్నత విద్య, పరిశోధనలు, ఆవిష్కరణలు, స్టార్టప్‌ల అభివృద్ధికి తెలంగాణ కేంద్రంగా మారుతోందన్నారు. ఇప్పటికే ఐఐటీ, ఐఐఐటీ, నల్సార్, ఐఎస్‌బీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు ఉన్నాయని, హైదరాబాద్‌కు ఐఐఎం కూడా రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలను తెలంగాణకు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని, ఈ దిశగా యూనివర్సిటీ ఆఫ్ లండన్ హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్ క్యాంపస్ ఏర్పాటు చేయడం తొలి విజయమని వివరించారు. దేశ ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఇంజన్లుగా ఉన్న దిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నగరాల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో ‘ఎం-6 టాస్క్‌ఫోర్స’ ఏర్పాటు చేయాలని సీఎం ప్రతిపాదించారు. ఈ నగరాల మౌలిక వసతుల అభివృద్ధికి రూ.6 లక్షల కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించాలని కోరారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరుతూ సీఎం పలు ప్రతిపాదనలు చేశారు. రీజినల్ రింగ్ రోడ్, హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ, మూసీ నది పునరుజ్జీవనం, భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులు, సెమీ కండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు మద్దతు, హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు వంటి అంశాల్లో సహకారం అందించాలని కోరారు. దేశ ప్రజల ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక దృష్టి పెడితే ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా భారత్ అవతరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రాజెక్టులకు సహకరించాలి : ప్రధానికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి
రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపై కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకునేలా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర భవిష్యత్తు అవసరాలకు గోదావరి జలాల వినియోగం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 విస్తరణ ప్రతిపాదనలను ఆమోదించాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఫేజ్-2లో 7 కారిడార్లలో 122.9 కి.మీ మెట్రో విస్తరణకు రూ.38,595 కోట్ల ప్రతిపాదనలు సమర్పించినట్టు వివరించారు. ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ పనులకు వెంటనే ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి కోరారు. ఉత్తర భాగంలో భూసేకరణ ఖర్చులో 50 శాతం వాటా భరించేందుకు రాష్ట్రం ఇప్పటికే అంగీకరించిందని, ఎన్‌హెచఏఐకి రూ.626 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. ఉత్తర భాగానికి సంబంధించి 90 శాతానికి పైగా భూసేకరణ అవార్డు పూర్తయిందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ట్రిపుల్ ఆర్‌లో దక్షిణ భాగం నిర్మాణం కూడా అంతే కీలకమని ముఖ్యమంత్రి వివరించారు. చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు దక్షిణ కారిడార్ నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ చుట్టూ రవాణా వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని తెలిపారు. దక్షిణ భాగానికి సంబంధించిన అలైన్‌మెంట్ మ్యాపులు, హెచఎండీఏ మాస్టర్ ప్లాన్ నోటిఫికేషన్లను ఇప్పటికే కేంద్ర రోడ్డు రవాణా శాఖకు అందించామని చెప్పారు. ఉత్తర, దక్షిణ కారిడార్లను ఒకేసారి ఆమోదించి అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్-అమరావతి-బందర్ పోర్టు ఎక్స్‌ప్రెస్‌వేకు కేంద్రం అనుమతి ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టును కలిపే 12 లేన్ ఎక్స్‌ప్రెస్‌వే తెలంగాణకు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందని చెప్పారు. 120 మీటర్ల రైట్ ఆఫ్ వేతో ప్రతిపాదించిన ఈ హైవే ద్వారా సముద్ర తీరం లేని తెలంగాణకు పోర్ట్టు కనెక్టివిటీ లభిస్తుందని వివరించారు. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల ఎగుమతులకు ఇది కీలక మార్గంగా నిలుస్తుందన్నారు. వరంగల్ ఎయిర్‌పోర్టు పనులను ప్రారంభించాలన్న అంశాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రధానితో ప్రస్తావించారు. ఇప్పటికే అవసరమైన భూసేకరణ పూర్తి చేసి ఎయిర్ పోర్టు అథారిటీకి అప్పగించామని తెలిపారు. ఇది అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణ పారిశ్రామిక, విద్యా, పర్యాటక రంగాలకు మరింత లబ్ది చేకూరుతుందన్నారు. హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలని కోరారు. ఐఐఎంకు అవసరమయ్యే 200 ఎకరాల స్థలం కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఐఐఎం ఏర్పాటు చేస్తే నూతన విద్యావిధానం-2020 ఆశించిన లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





సుష్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీరియస్