– మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
– చాంద్రాయణగుట్టలో అంగన్‌వాడీ-కమ్-పాలన కేంద్రం ప్రారంభం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 : చాంద్రాయణగుట్ట నియోజకవర్గ పరిధిలోని అరుంధతి నగర్‌లో అంగన్‌వాడీ కేంద్రం-కమ్-పాలన(డే కేర్) కేంద్రాన్ని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు యూనిఫాంలు పంపిణీ చేసి వారి అభ్యాస ప్రదర్శనలను వీక్షించి అభినందించారు. అనంతరం లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా బోయ కార్పొరేషన్ వైస్ చైర్మన్ బోయ నగేష్, చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో తొలి పాలన కేంద్రాన్ని చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఆరు నెలల నుంచి మూడేళ్ల వయస్సు గల చిన్నారులకు సంరక్షణ, పోషకాహారం, ఆటల ద్వారా అభ్యాసం అందించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రం, పాలన కేంద్రాన్ని ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేయడం ద్వారా ఒకే కుటుంబంలోని చిన్నారులకు సమగ్ర సేవలందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఉపాధి కోసం బయటకు వెళ్లే తల్లులకు ఈ డే కేర్ కేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని, పిల్లల సంరక్షణ కోసం మహిళలు తమ ఉద్యోగాలు, ఉపాధిని వదులుకోవాల్సిన పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని అన్నారు. చిన్నారి జీవితంలోని మొదటి వెయ్యి రోజులు అత్యంత కీలకమైనవని, ఆ దశలో మెదడు ఎదుగుదలతోపాటు శారీరక, మానసిక వికాసం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. అందుకే గర్భధారణ దశ నుంచి తొలి రెండేళ్ల వరకు తల్లులు, చిన్నారులకు అవసరమైన పోషకాహారం, ఆరోగ్య సేవలు, సంరక్షణ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ప్రైవేట్ నర్సరీలకు దీటుగా అంగన్‌వాడీ కేంద్రాలను తీర్చిదిద్దుతూ 57 రకాల ఆట వస్తువులు, యూనిఫాంలు, నాణ్యమైన ప్రీ-స్కూల్ విద్యను అందిస్తున్నామని చెప్పారు. ఆరేళ్లలోపు పిల్లలందరినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. మహిళల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ పట్టణ ప్రాంతాల్లో కూడా మహిళా సంఘాలను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, టీనేజ్ బాలికల కోసం ప్రత్యేక మహిళా సంఘాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పేదరిక నిర్మూలనతోపాటు నిరక్షరాస్యత నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అమ్మకు అక్షరమాల కార్యక్రమం ద్వారా ఇప్పటికే ఆరు లక్షల మంది మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దామని మంత్రి సీతక్క చెప్పారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనితా రామచంద్రన్, బోయ కార్పొరేషన్ వైస్ చైర్మన్ బోయ నగేష్, ఎస్బీఐ ఫౌండేషన్ ప్రతినిధులు, అధికారులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యూష్ మెహ్రోత్రా అధ్యక్షుడు, ఎస్‌బీఐ ఫౌండేషన్ రాజారాం చవాన్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, ఎస్‌బీఐ ఫౌండేషన్ రుద్రాణి గుహ, అసిస్టెంట్ మేనేజర్ (శిశు అభివృద్ధి) పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




